చిలుకమ్మ స్వేచ్ఛ

చిలుకమ్మ స్వేచ్ఛలక్ష్మాపురం అనే ఒక ఊరిలో నారాయణ అనబడే ఒక వ్యక్తి ఉండేవాడు.చాలా తెలివైనవాడు. కానీ కోపిష్టి. చిన్నప్పటి నుంచి తన స్నేహితులతోఎంతో సరదాగా కాలాన్ని గడిపేవాడు. తనకు18 ఏళ్లు నిండగానే తన తండ్రి ఏదో ఒక పని చేసుకుని సంపాదించమని గట్టిగా మందలించాడు. దాంతో పని కోసం వెతుకుతున్నాడు నారాయణ.
ఒకనాడు నారాయణ తల్లి ధాన్యాన్ని చాటలో పోసుకొని చెరుగుతుండగా కొంత ధాన్యం గింజలు కింద పడ్డాయి. అప్పుడు ఆ ధాన్యం కోసం రామచిలుకలన్నీ వచ్చి వాలాయి.ఆ గింజలని చిలుకలు తింటుండగా నారాయణ వాటిని తదేకంగా చూడసాగాడు. కారణం అందులో ఒక ఆకర్షణీయమైన చిలక ఉంది. ఎంతో హుషారుగాను ఉంది. దానిని చూడగానే నారాయణకు ఒక ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన ఏమిటంటే! ”ఆ ఆకర్షణీయమైన చిలుకకు మాటలు నేర్పించి జనాల ముందు మాట్లాడించి డబ్బు సంపాదించవచ్చునని”. అనుకున్నదే తడవుగా నారాయణ ఆ చిలుకను బోనులో బంధించాడు. అప్పుడు ఆ చిలుక ఎంతో విలవిలలాడిపోయింది. స్వేచ్ఛగా తిరిగే తనకు ఏమిటీ ఈ అవస్థ అని తనలోనే తను కుములిపోయింది. చేసేది ఏమీ లేకపోవడంతో చిలక తన యజమానికి అనుగుణంగా నడుచుకుంది. నేర్పించిన మాటలన్నిటిని నేర్చుకుంది. జనాలంతా చిలుక పలుకులను చూసి తెగ ముచ్చట పడిపోయే వాళ్ళు. తమకు తోచిన డబ్బు ఇచ్చే వాళ్ళు. అప్పుడు నారాయణ తెగ సంబరపడిపోయాడు.
ఒకనాడు అదే ఊరిలో మరొక వ్యక్తి కూడా నారాయణ లాగే సంపాదించాలని మాట్లాడే చిలకను తెచ్చాడు. జనాలంతా ఆ చిలుకనూ ముద్దు చేశారు. నారాయణ కు కోపం వచ్చింది. తన చిలుకే ప్రత్యేకమైనదిగా కావాలనుకున్నాడు. ఆ చిలుక మరిన్ని మాటలు నేర్వాలని అప్పుడే తనకుగొప్ప పేరు వస్తుందని, ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చునని ఒత్తిడి తెచ్చాడు. చిలుక పట్ల చులకన భావం చూపించాడు.ఎపుడూ రుసరుసలాడుతూ ఉండేవాడు. చిలకమ్మ ఒత్తిడి తట్టుకోలేక పంజరంలోంచి ఆకాశం వైపు దీనంగా చూసేది. తన బాల్యాన్ని గుర్తు తలచుకునేది.తన చిన్నతనంలో ఎంత హుషారుగా ఉండేదో, తల్లిదండ్రులతో ,తోబుట్టువులతో ఎంత ప్రేమగా ఉండేదో గుర్తుతెచ్చుకునేది.
ఒక్క అవకాశం ఇస్తే చాలు ఆకాశంలో అందనంత ఎత్తుకు ఎదగాలని, తనలాంటి పక్షులతో సావాసం చేయాలని, చెట్ల కొమ్మల పైన కలియతిరగాలని, రకరకాల పండ్ల రుచులు చూడాలని ఆశతో దీనంగా ఆకాశం వైపు చూస్తోంది చిలకమ్మ. ఇందుకు కారణం ”యజమాని తప్తి లేని జీవితం – స్వేచ్ఛ లేని చిలుకమ్మ బానిసతనం”. కొంతకాలానికి నారాయణ అనారోగ్యం బారిన పడ్డాడు. తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కోపంతో కుటుంబ సభ్యులను దూరం చేసుకున్నాడు నారాయణ. దాంతో తనకు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఎవరూ తనను దగ్గరకు తీయలేదు .నారాయణకు తన పరిస్థితి అర్థమైంది. చివరకు చిలకమ్మను పంజరం నుండి స్వేచ్ఛగా వదిలేశాడు. ఒక కొత్తప్రాణి భూమి మీద పురుడు పోసుకున్నట్లుగా అనిపించింది చిలకమ్మకు. ఆకాశం వైపున రివ్వున ఎగిరింది. తన కోరిక ప్రకారమే అందనంత ఎత్తుకు ఎదిగింది. చెట్ల కొమ్మల పైన కలియ తిరిగింది. రకరకాల పండ్ల రుచి చూసింది. తీయటి పండ్లను సేకరించింది. మరి ఈ పండ్లు తన కోసం కాదు. తన యజమాని కోసం. అవును.తన యజమానికి తెచ్చి ఇచ్చింది. ఇలా రోజూ చేస్తుంది. కొంతకాలానికి నారాయణ ఆరోగ్యం కుదుటపడింది. నారాయణ సంతోషించాడు. తను చిలుకపట్ల ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాప పడ్డాడు. తనను స్వేచ్ఛగా వదిలివేసినప్పటికినీ అది చూపించిన విశ్వాసానికి మోకరిల్లాడు. అప్పటినుంచి చిలుకను పంజరంలో బంధించలేదు. తనతో సమానమైన ఒక ప్రాణిలాగా చూడ సాగాడు. ఇప్పుడు ”తప్తిగా యజమాని – స్వేచ్ఛగా చిలకమ్మ” తమ ప్రయాణం సాగిస్తున్నారు.

– స్వాతి చొల్లేటి, 9642768412