స్త్రీ స్వేచ్ఛ!?

Women's freedom!?”స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి మెదడు వుంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి” అంటాడు రచయిత గుడిపాటి వెంకటాచలం. అసలు సమస్యల్లా స్త్రీని సమాజంలో భాగస్వామిగా, నాగరికత నిర్మాణంలో పాత్రధారురాలిగా గుర్తించకపోవటమే. పురుషాదిక్య భావజాలం స్త్రీని కేవలం ‘పరాన్నజీవిగా’ చూడటం మూలంగానే ఓ వర్గం మరో వర్గంపై శారీరక, మానసిక అజమాయిషీ చెలాయిస్తుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, లైంగిక హింసకు వ్యతిరేకంగా ఆయాదేశాల్లో ఉద్యమాలు చేశారు. ఇక ముందు చేస్తారు కూడా.
స్త్రీని మనిషిగా చూడని సమాజంలో వారు ఉంటున్నందుకు వారికి రక్షణ కల్పించలేని సమాజంలో పురుషులు ఉంటున్నందుకు సిగ్గుపడాల్సిన అంశం. ఇక్కడ ఎవరు ఎవర్ని కాపాడాలన్నది ప్రశ్న? స్త్రీని పురుషుడు కాపాడాల్సిన, స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించాల్సిన అవసరం ఏమిటి? పుట్టుకతోనే పురుషులతో పాటే స్త్రీలు కూడా ‘స్వేచ్ఛాజీవులే’. కాని వారి స్వేచ్ఛను పురుష భావజాలం లాక్కొని వారిపై క్రమంగా అజామాయిషి చెలాయించడం మొదలుపెట్టారు. ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అని మనుస్మృతి పేర్కొంటే ఇక స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడుంటుంది? కడుపులో పిండం నిర్ధారణ జరిగితే చాలు గర్భస్థ దశలోనే ‘జీవితకాలం’ ముగుస్తున్నప్పుడు, పుట్టిన తర్వాత ఎదుర్కోబోయే దశలవారి హింసను జీవితాంతం ఎదుర్కొవాల్సిందే. చట్టాలు మారినా సమాజం వేగంగా ఆధునీకతను సంతరించుకుంటున్నా స్త్రీల పట్ల పురుషుల ఆలోచన ధోరణి మారకపోవడం బాధకల్గించే అంశం.
మన దేశంలో 19వ శతాబ్దంలోనే సనాతమైన ఆచరాలపట్ల రాజారామ్‌, మోహన్‌రారు, కందుకూరి విరేశలింగం, గురజాడ, పూలే దపంతులు మొదలైన వారు స్త్రీలపట్ల జరుగుతున్న సాంఘిక దురాచారాలపై తన కలం, గళం ఎత్తి, స్త్రీలకు బాసటగా నిలిచారు. స్త్రీల పట్ల హింస, ఇతిహాసాలలోను, వేద కాలంలోనూ జరిగినట్లు చరిత్రలో చదువుకున్నాం. అంతెందుకు వేదకాలంలో విద్యను అభ్యసించిన స్త్రీలు ఇద్దరే. గార్గేయి, మైత్రేయి. వారు కూడా అగ్రవర్ణాల వారే కావడం గమనార్హం. మరి ఇన్ని లక్షల సంవత్సరాల నాగరికతా పరిణామ క్రమంలో, మానవుడు సాధించిన పురోగతి, స్త్రీల పట్ల జరుగుతున్న హింసను అరికట్టడానికి ఎన్ని చట్టాలు చేసినా అవి స్త్రీల పట్ల జరుగుతున్న హింసను నివారించలేకపోయాయి. పురుషాధిపత్యం లేని సమాజాన్ని మనం ఊహించలేం, మనకు తెలిసిన సమాజం కూడా అదే! మనం మన భావాలను వైరుధ్యాలను, అవసరాలను, కోపాలను, కోరికలను మాత్రమే వ్యక్తీకరించగలం. భవిష్యత్తును గురించిన కచ్చితమైన నమూనా ఏది లేకపోయినా ఒక్కొక్క ఇటుక పడగొట్టగలం. కానీ నిర్మించటమే కష్టమైన విషయం. వ్యవస్థపట్ల, వ్యక్తుల పట్ల, జాతిపట్ల మనం చూయించే సానుకూల దృక్పథమే ఆ జాతి, వ్యవస్థ ఎలాంటి అంతరాయం లేకుండా మనుగడ కొనసాగిస్తుంది. అవాంతరాలు, అంతరాయాలు కల్పిస్తే అది కూడా ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటుందని అంటారు వసంత కన్నాబిరాన్‌. స్త్రీల పట్ల జరుగుతున్న హింసను నివారించడానికి ప్రత్యామ్నాయాలు ఏంటనేది కూడా ప్రశ్నే?
స్త్రీ లేని సమాజాన్ని, స్త్రీకి భాగస్వామ్యం కల్పించని నాగరికతను ఎక్కడైనా చూశామా, చదివామా అన్నది తెలుసుకోవాలి. స్త్రీని దేవతగా పూజించిన భారతీయ సమాజం, ఆచరణలో స్త్రీ స్వేచ్ఛకు ఆటంకాలు కల్గిస్తున్నది. లేకపోతే కోల్‌కత్తలో ఇటీవలే ఆర్జీకర్‌ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య దానికి నిదర్శనం కాదా? అదేవిధంగా మణిపూర్‌లో మహిళల్ని నగంగా ఊరేగించే విధానం సభ్యసమాజం తలదించుకునేలా చేయలేదా? గతంలో జరిగిన ‘బిల్కిస్‌బానో’ ఉదంతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆయేషామీరా’ అత్యాచారం, హత్య; అనంతరం ‘దిశ’ అత్యాచారం, హత్య; దేశ రాజధానిలో ‘నిర్భయ’ పై జరిగిన అత్యాచారం మొదలైనవి సమాజాన్ని, స్త్రీల మనుగడను ఆలోచింపచేశాయి. వెరసి స్త్రీని పురుషుడు కేవలం విలాస వస్తువుగానో, కోరికలను తీర్చే వ్యక్తిగానో చూడడం, అనంతరం వారి స్వేచ్ఛను, హక్కులను కాలరాయడం… ఫలితంగా జరిగే సంఘటనలు కావా అవి? ఇక పాశ్చాత్య సమాజం స్త్రీని కేవలం అందాల ప్రదర్శనకు, జీవిత భాగస్వామిని తృప్తి పరచడానికే అన్నట్లుగా చూసింది. కాలక్రమేణా అక్కడ కొంతమార్పు వచ్చిందని చెప్పాలి. అక్కడ స్త్రీకి స్వేచ్ఛ వున్నట్లుగానే భావించాలి. ఇక ‘స్త్రీలు – రాజకీయాలు’ అనే అంశానికి వస్తే జర్మనీకి అధ్యక్షురాలిగా ఏంజెలా మోర్కిల్‌, పాకిస్థాన్‌ ప్రథానిగా బెనజీర్‌ భుట్టో, భారత్‌లో ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్‌లో ప్రథానిగా షేక్‌ హసీన, బేగం ఖలీదాజియా, శ్రీలంకలో సిరిమావో బండారు నాయకే, బ్రిటన్‌లో మార్గరేట్‌ థాచర్‌ లాంటి వారు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొని ప్రజలకు సేవ చేయడం గమనార్హం.
కానీ అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా దేశంలో మాత్రం నేటికీ మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోలేకపోతున్నారంటే మహిళల పట్ల అమెరికా సమాజంలో ఇంకా సరియైన దృక్పధం రాలేదనే భావించాలి. ఇక ఆఫ్రీఖా సమాజం విషయానికి వస్తే స్త్రీని కేవలం కుటుంబ బానిసగానే పరిగణించింది నేటికి కూడా. అక్కడ స్త్రీలకు సరైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవు అంటే నమ్మశక్యం కాని విషయం.
‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాలెత్తిన కూలీలెవ్వరు?’ అన్న మహాకవి మాటల్లో ఆ రాళ్ళెత్తిన కూలీల్లో మహిళా కూలీలు లేరని ఏ చరిత్రకారులైన నిరూపించగలరా? స్త్రీ లేని సమాజాన్ని, స్త్రీ భాగస్వామ్యం లేని నాగరికతల నిర్మాణాలను ఊహంచలేం! సింధు నాగరికత నిర్మాణంలో, ఈజిప్టు నాగరికతా నిర్మాణంలో, ప్రపంచ పరిణామ క్రమానికి, మానవ వికాస నిర్మాణంలో స్త్రీలు పాలుపంచుకోలేదని ఎవరైనా నిరూపించగలరా! అందుకే సమాజంలో సగభాగమైన స్త్రీలను మరొక సగభాగమైన పురుషులు తమ అజమాయిషీలో వుంచుకోవాలనుకోవటం అవివేకపు ఆలోచన. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆచరించకుండా మాట్లాడే అర్హత లేదనేది నా అభిప్రాయం. పురుషులుగా మనం స్త్రీలను గౌరవిస్తే వారి నుండి కూడా అదేవిధమైన గౌరవం పొందినవారమవుతాం. ‘ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును’ అన్న గురజాడ వారి మాటలను ఆచరణలో పెట్టి వారిని మనతో పాటే ‘స్వేచ్ఛగా’ ఎదగడానికి అన్ని అవకాశాలను కల్పిద్దాం. స్త్రీ స్వేచ్ఛ దేనికి? దేని నుంచి? ప్రకృతి తాను కొనసాగడానికి స్త్రీ పురుషుల్ని సాయుధుల్ని చేసే క్రమంలో మనిషి సంఘజీవిగా మారి ఏర్పర్చుకొన్న కట్టుబాట్లు, వాటిని తానే మళ్ళీ అవసరం మేరకు కుంటి సాకులతో ఉల్లంఘించుకొంటూ నీతి మర్యాదలనే తప్పుడు విలువలను సృష్ఠించుకొని స్త్రీ స్వేచ్ఛకు ‘ఆంక్షలు’ విధిస్తున్నాడు.
స్రీలు పనిచేసే ప్రదేశాలు మొదలుకొని వారు సంచరించే అన్ని ప్రాంతాల్లో లైంగికపరమైన హింసను ఎదుర్కొంటున్నారంటే స్త్రీ రక్షణ, స్వేచ్ఛ ప్రశ్నార్ధకంగా రోజురోజుకి ఎలా మారుతుందో గమనించవచ్చు. పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జికర్‌ ఆసుపత్రి సంఘటన అనంతరం మిట్ట మధ్నాహ్నం మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతంలో నడిరోడ్డుపై జరిగిన అత్యాచారం సభ్యసమాజం తలదించుకునేల చేసింది. మన దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళపై లైంగికపరమైన వేధింపులు జరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అంటే స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ మనుగడ ఇంతగా ప్రశ్నార్ధకం ఐతే భవిష్యత్‌లో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో వున్న బాల్యవివాహాలు, సతీ సహగమనం కన్యాశుల్కం, వర విక్రయం, బాల్య వితంతు వివాహలను, దాటి నేడు స్త్రీలకు స్వేచ్ఛా స్వాంతంత్య్రం లభించిన మాట వాస్తవం. కానీ స్త్రీలపై జరుగుతున్న వ్యవస్థీకృతమైన నేరాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే వున్నాయి. వీటికి అడ్డుకట్ట పడేదెన్నడు అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న!
స్త్రీ, పురుషుడు సగభాగమూ, సమభాగమై సాగించాల్సిన జీవన ప్రయాణంలో స్త్రీకి పోటీదారుగా నటిస్తూనే … పోటీ నిర్వాహకుడు, పోటీ నిర్ణేత కూడా కావడం అసలైన దౌర్భాగ్యం. అందులోను ఓటమెప్పుడూ స్త్రీకే మిగులుతుండటం, సమాజంలోని పట్టుతప్పని పటిష్ఠమైన కుట్రకు నిదర్శనం. చూడటానికి మాత్రం అంతా సమాన అవకాశం. ఆలోచిస్తే అసలు అవకాశమే లేదు. స్త్రీ పురుషుల మధ్య నిజమైన సమానత్వం ఏర్పడాలంటే ప్రతీ దశలోను… స్త్రీలు ఎప్పటికప్పుడు తమస్థితిని గ్రహించుకొంటూ తమకు తక్కువ స్థాయిలో ఉండే పరిస్థితులు అంతమయ్యేలా చూసుకోవాలి. అప్పుడే స్త్రీ స్వేచ్ఛ పట్ల సరిగ్గా స్పందించిన వారమవుతాం. స్త్రీలు ‘స్వేచ్ఛ’ అని పోరాటాలు చేయటం, పురుషులు తమ ఆధిపత్య భావజాలాన్ని తగ్గించుకోవటానికి ఇష్టపడకపోవడం వల్ల తలెత్తిన ఘర్షణ వల్లనే ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరి పరిధిలో వారు స్వేచ్ఛను అనుభవిస్తూనే పరస్పరం గౌరవించుకుంటే సమాజంలో స్త్రీ, పురుష సంబంధాలు ఘర్షణాత్మకంగా కాకుండా ఆరోగ్యకరంగా వుంటాయి. అలాంటి వాతావరణం మున్ముందు కల్పించి ‘స్త్రీ స్వేచ్ఛకు’ ఆటంకాలు కల్పించకుండా, సమాజ నవ నిర్మాణంలో వారిని భాగస్వామ్యులుగా చేసి, పురోగతి సాధించడానికి వారి సహకారం తీసుకుంటే ఏ సమస్యా రాదు.
డా||మహ్మద్‌ హసన్‌