అకౌంట్లపై ఉన్న ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలి

అకౌంట్లపై ఉన్న ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలి– పోస్ట్‌ ఆఫీస్‌ ఎదుట రైతుల నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
తమ డబ్బులు తమకు ఇప్పించడంతో పాటు అకౌంట్‌పై ఉన్న ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని రైతులు ప్రాధేయపడ్డారు. ఈ విషయమై సోమవారం పట్టణంలోని పోస్టాఫీసు ఎదుట నిరసన తెలిపారు. ఆరు నెలల కింద పోస్ట్‌ పేమేంట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సీసీఐ ద్వారా రైతులకు వచ్చిన పత్తి డబ్బులు కాజేసిన విషయం తెలిసిందే. అయితే సదరు మేనేజర్‌ రైతుల అకౌంట్‌లలో డబ్బులు వేయడంతో వాటిని పోలీసులు ఫ్రీజ్‌ చేయించారు. దానిపై ఉన్న ఫ్రీజింగ్‌ ఎత్తివేయాలని రైతులు కోరారు. ఆదిలాబాద్‌ రూరల్‌, తాంసి, జైనథ్‌ మండలాలకు చెందిన రైతులు అధికారులతో మాట్లాడినంతరం జిల్లా కలెక్టర్‌ రాజర్షిషాను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తాంసి మండలం వడూర్‌కు చెందిన రైతు మోహన్‌ మాట్లాడుతూ ఆరు నెలల క్రితం పోస్ట్‌ పేమేంట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రైతుల నగదు కాజేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని బ్యాంక్‌ నుంచి వేరే ఖాతాల్లో డబ్బులు జమ అయిన అకౌంట్లను ఫ్రీజ్‌ చేశారన్నారు. తమ అకౌంట్లో డబ్బులున్న వ్యవసాయానికి వాడుకోలేక వడ్డిపై డబ్బులు తీసుకొని వ్యవసాయం చేస్తున్నామన్నారు. డీఎస్పీని కలిసి విన్నవించడంతో ఆయన లేటర్‌ ఇచ్చారన్నారు. కానీ పోస్ట్‌ ఆఫీసు వారు మాత్రం రేపు మాపు అంటు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. తమ అకౌంట్లపై ఉన్న ఫ్రీజింగ్‌ ను ఎత్తివేయాలని కోరారు.