చెడు మార్గంలో వెళ్లేవారిని మంచి మార్గంలో తెప్పించే శక్తి ఒక్క స్నేహానికే ఉంది. కుటుంబంలో ఉన్న బంధుత్వాల దగ్గర మొదలయ్యే బాధను స్నేహితులకు చెప్పి దూరం చేసుకొంటాం. అందుకే అమ్మనాన్న, ఉపాధ్యాయులు, అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు ఆఖరికి దాంపత్యబంధం కన్న గొప్పది స్నేహబంధం. ఎటువంటి సమస్యనైనా స్నేహితునితో పొరపొచ్చాల్లేకుండా చర్చించుకోవచ్చు. అహానికి అక్కడ చోటే ఉండదు. నిజమైన స్నేహానికి ఎక్కువ తక్కువలుండవు. పేదవాడు గొప్పధనవంతునితో స్నేహహస్తాన్ని కలుపవచ్చు. బాగా చదువుకున్నవారు అసలు చదువే లేని పామరునితో అత్యంత గాఢంగా స్నేహం చేయవచ్చు.
‘శత్రువు ఒక్కడున్నా ఎక్కువే. వందమంది మిత్రులున్నా వారు తక్కువే’ అన్నారు వివేకానందులు. అంటే స్నేహితుల విలువ ఎంచలేనిది అనే కదా! అలాగే ‘కష్టకాలంలో స్నేహితులెవరో మనకు బాగా తెలుస్తుంది’ అంటారు గాంధీ. నిజమే కదా? కష్టనష్టాల్లో నీకు నేను తోడున్నాననే మిత్రుడే అసలైన మిత్రుడు. సుఖాల్లో మనతో ఉంటూ కష్టం రాగానే కనుమరుగైనవాడ్ని మిత్రుడని అనలేం. అందుకే మంచి స్నేహాన్ని వెలుగుతున్న దీపంతోనూ, చెడు స్నేహాన్ని కొడిగట్టుతున్న దీపంతోను పోల్చారు తులసీదాసు. స్నేహితులు లేని వారు అరుదుగా ఉంటారు. ఒకరో ఇద్దరో స్నేహితులందరికీ ఉంటూనే ఉంటారు. కాస్త నడక, మాట వస్తే చాలు స్నేహం కోసం ప్రాణి ఎదురుచూస్తుంది. కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ స్నేహాన్ని చూస్తుంటాం. నోరు లేని ప్రాణులే స్నేహం కోరుకుంటే ఇక మనసు, నోరున్న మనం స్నేహం కోసం అర్రులు చాచడంలో విచిత్రమేముంది? స్నేహం ఓ మధురమైన అనుభూతి. కదలలేని వృద్ధునికి తన చిన్ననాటి స్నేహితుడు ఎదురైతే చాలు ఓపికలేకున్నా సరే టక్కున లేచి కూర్చుంటాడు. చిరునవ్వుతో పలుకరిస్తాడు. అంతటి శక్తి ఒక్క స్నేహానికే ఉంది. చెడు మార్గంలో వెళ్లేవారిని మంచి మార్గంలో తెప్పించే శక్తి ఒక్క స్నేహానికే ఉంది. కుటుంబంలో ఉన్న బంధుత్వాల దగ్గర మొదలయ్యే బాధను స్నేహితులకు చెప్పి దూరం చేసుకొంటాం. అందుకే అమ్మనాన్న, ఉపాధ్యాయులు, అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు ఆఖరికి దాంపత్యబంధం కన్న గొప్పది స్నేహబంధం. ఎటువంటి సమస్యనైనా స్నేహితునితో పొరపొచ్చాల్లేకుండా చర్చించుకోవచ్చు. అహానికి అక్కడ చోటే ఉండదు. నిజమైన స్నేహానికి ఎక్కువ తక్కువలుండవు. పేదవాడు గొప్పధనవంతునితో స్నేహహస్తాన్ని కలుపవచ్చు. బాగా చదువుకున్నవారు అసలు చదువే లేని పామరునితో అత్యంత గాఢంగా స్నేహం చేయవచ్చు. వాస్తవానికి స్నేహానికి కాలంతో కూడా పట్టింపుండదు. వయసు తేడా రాదు. స్నేహం ఒక్క తరానితో ఆగిపోదు. తరతరాలకు తరగని గనిలా అందుతుంది. మంచిస్నేహితుడు కష్టనష్టాల్లో అండగా ఉంటాడు. స్నేహానికి ఎల్లలు ఉండవు. బుద్ధి వికాసానికి బాటలు వేయగలిగే శక్తికూడా స్నేహానికే ఉంది. నిస్వార్థమనేది కేవలం స్నేహంలోనే ఉంటుంది అన్నా అతిశయోక్తికాదు. జీవితమనే ఉద్యావనంలో స్నేహమనే పూవు పూస్తే చాలు ఆ జీవితం ధన్యమైనట్లే. స్నేహం గురించి మాటల్లో చెప్పలేం. ఎవరికి వారు అనుభవించి తీరాల్సిందే.
అలాగే ప్రకృతి లేనిదే మానవులు మనలేరు కనుక ప్రకృతిలోని ప్రతి చెట్టు పుట్టా తోపాటుగా జంతువులతో కూడా మనిషి స్నేహం చేయాల్సిందే. అపుడే ప్రకృతి మనిషిని ఎల్లవేళలా కాపాడుతుంది. స్నేహాన్ని మరిస్తే పర్యావరణం భయకర రూపం దాలుస్తుంది. కనుక ప్రకృతితో సైతం మనిషి స్నేహం చేయాల్సిందే. ఏది ఏమైనా ఎక్కువ కాలం సాగేదే నిజమైన స్నేహం. అట్లా స్నేహాన్ని నిలబెట్టుకోవాలంటే నీతి నిజాయితీలుండాలి. స్వార్థరహితంగా ఉండాలి. అబద్ధాలుచెప్పకూడదు. దాపరికాలు ఉండకూడదు. ఇలాంటి నిబంధనలు పెట్టుకుంటే ఆ స్నేహం పదికాలాలు మన్నుతుంది. అందరికీ ఆదర్శమౌతుంది. కానీ ఈ మధ్య కొన్ని స్నేహాలు తప్పుదారిన నడుస్తున్నాయి. స్నేహం అనే ముసుగులో అమాయకులను దోచేస్తున్నారు. అందుకే పిల్లలు స్నేహాలు చేసేటపుడు వారిని నొప్పించకుండానే పెద్దలు వారు ఎటువంటి స్నేహానికి దగ్గరవుతున్నారో ఓ కంట కనిపెట్టాలి. స్నేహం విలువ, స్నేహం అంటే ఏమిటో వారికి తెలియపర్చాలి. అపుడే స్నేహ పరిమళం వారి జీవితాన్ని సుగంధ భరితం చేస్తుంది.