ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ

– అదానీ వ్యవహారంలో కాంగ్రెస్‌ వైఖరిదే : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– ద్వంద్వ ప్రమాణాలంటూ రాహుల్‌ గాంధీకి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అదానీ వ్యవహారంలో కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈ విషయంలో ఆ పార్టీ వైఖరి ‘ఢిల్లీలో కుస్తీ..గల్లీలో దోస్తీ…’ మాదిరిగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి… కేటీఆర్‌ గురువారం లేఖ రాశారు. జాతీయ స్థాయిలో అదానీ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌… తెలంగాణలో మాత్రం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అదానీ అవినీతిపై ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు ఆరోపణలు గుప్పిస్తోంటే, సీఎం రేవంత్‌ మాత్రం రాష్ట్రంలో అదానీ గ్రూప్‌నకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని దుయ్యబట్టారు.
ఆ గ్రూప్‌ కోసం సుమారు రూ.12 వేల కోట్ల మేర భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని గుర్తు చేశారు. అదానీ అవినీతిపై ఒకవైపు ‘చలో రాజ్‌ భవన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌..మరోవైపు అదే అదానీతో అంటగాకుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ నిరసన చేపట్టటం కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కేటీఆర్‌ ఈ సందర్భంగా విమర్శించారు. ఆ నిరసనలన్నింటినీ కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలుగా అభివర్ణించారు. ‘మీ పార్టీకి చెందిన సీఎం రేవంత్‌తో అదానీ అనుబంధం గురించి మీరు ప్రశ్నిస్తారా? లేక ఆయన వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడటానికి మౌనంగా ఉంటారా?’ అని రాహుల్‌ను సూటిగా ప్రశ్నించారు.