స్నేహమంటే…

స్నేహమంటే...స్నేహం అనేది పదం కాదు ఒక భావోద్వేగం. ప్రేమిస్తున్నాను అని చెప్పినంత భావోద్వేగంతోనే, స్నేహిస్తున్నాను అని చెప్పవచ్చు. ప్రేమ కోసం అర్రులు చాచినట్లుగానే మనకు నచ్చినవారి స్నేహం కోసం ఆకాంక్షించవచ్చు. ప్రేమలానే స్నేహం కూడా అనుకోకుండానే పుట్టవచ్చు.
చిన్నప్పటి స్నేహాలు వేరు. అప్పుడు మనకి ఆడుకోడానికి కొందరు కావాలి. అందులో కూడా ఎంపికలు ఉంటాయి. ఎవరు నచ్చుతారు, ఎందుకు నచ్చుతారో కూడా తెలీదు. అందుకే మనకి చాలా విరుద్ధమైన జతలు కనబడతాయి. ఇది చాలా చిన్నప్పుడు. కానీ పెద్దవుతున్నకొద్దీ, వేరే అవసరాలు మనుషులను కలుపుతాయి. నోట్స్‌ కావాలనో, లేక ఒకే ఆట ఇష్టమనో, లేక ఒకే రకమైన అభిరుచులో… ఇలాంటివే ఏవో. అలా అవసరాలు మారుతున్న కొద్దీ మన ఎంపికలో కూడా మార్పులు వస్తుంటాయి. ప్రతి స్నేహం భౌతిక అవసరాలతో ముడిపడి ఉండదు.
మన బాహ్య ప్రపంచంలో ఒక పెర్ఫార్మన్స్‌ నీడ్‌ ఉంటుంది. ప్రేమ కూడా ఏదో ఒక సందర్భంలో పెర్ఫార్మన్స్‌ డిమాండ్‌ చేస్తుంది. స్నేహంలో ఆ ఒత్తిడి ఉండదు. స్నేహంలో ఎవరు వారుగానే ఉంటారు. అందుకే స్నేహంలో అంతటి స్వేచ్ఛ ఉంటుంది. ఇది బంధమే కాని బంధించేది కాదు. స్నేహం త్యాగాలు కోరుకోదు, రాజీపడమని అడగదు. ప్రేమలో లేని స్వేచ్ఛ స్నేహంలో ఉంది.
మన అంతఃప్రపంచంలో మనం ఒంటరులమే. దానిని కొంతవరకైనా కదిలించగలిగేది స్నేహమే. ఈ అంతఃప్రపంచంలో మన భయాలు. అపోహలు, మనం నమ్ముతున్న సిద్ధాంతాలపై ప్రశ్నలు, మన నిజానిజాలు, బలహీనతలు, తెగింపులు, ట్రామా, దుఖం, ఓటములు, పట్టుదలలు – ఇలా ఎన్నో సాగుతుంటాయి. ఇవి చెప్పనివి, చెప్పినా అర్థం చేసుకోలేకున్నవి. కొన్నిసార్లు ఇవి సంభాషణలో ఉన్నట్టుండి ఒకే ఒక్క క్షణం తొంగిచూసి చటుక్కున లోపలకు ముడుచుకుపోయేవి.
స్నేహం ఒకటే ఆ క్షణాన్ని పట్టుకోగలదు. క్షమించగలదు, లాలించగలదు.
అయితే మనం ఎలా ఉన్నామో అలానే స్నేహం కూడా ఉంటుందా? మార్పులు ఉండవా? ఉంటాయి. ముఖ్యంగా మన ఆలోచనలు ఎదుగుతున్నప్పుడు మన అభిప్రాయలు, నమ్మకాలు గట్టి పడినప్పుడు స్నేహానికి ఒక ఇంతేహాన్‌ వంటిది వస్తుంది. ఆ పాయింట్‌ లో మన స్నేహం నిలుస్తుందో లేదో తెలుస్తుంది.
అలా కాక విరుద్ధమైన భావాలు ఉన్నా కూడా భరిస్తూ సాగించేది స్నేహం కాదు. స్నేహం నిలవాలని స్నేహితులని భరించడం స్నేహాన్ని అవమానించడమే. స్నేహంలో మౌలిక లక్షణమే స్వేచ్ఛ. మనం మనలా ఉండడం.
కానీ స్నేహంలో సహనం సంగతో? భరించలేం అనుకోవడానికి, స్నేహితులు ఒక కష్టంలో ఉండి బాధపెట్టేలా ప్రవర్తించడానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అప్పుడే ఒక విషాదం నుండి బయటకు వస్తుంటే తన ప్రవర్తన అంటి ముట్టనట్లుగా ఉండొచ్చు. అప్పుడు సహనం ఉండాలి కదా. అక్కడ మన పట్ల వారి ప్రవర్తన కన్నా వారి సంఘర్షణనే అర్థం చేసుకోవాలి.
కాని మన మానసిక ఆరోగ్యానికి కూడా విలువ ఇవ్వాలి కదా? ఎంత అండగా నిలబడినా, స్నేహంలో కూడా మనలను మనం కాపాడుకోవలసిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు మనకు మనమే అందరికన్నా మంచి స్నేహితులం అవుతాం. స్పష్టమైన సరిహద్దులు లేని స్నేహం కూడా మంచిది కాదు.
మనం ఎదిగే స్పీడ్‌ లో మన స్నేహితులు ఎదగకపొతే కొత్త స్నేహాలు పుట్టుకు రావచ్చు. రాజకీయకారణాలు, విలువలు, కొత్త విషయాలు అర్థమవడం వలన కూడా స్నేహాలు ఛిద్రమవవచ్చు. మారుతున్న కాలానికి తగినట్లుగా విలువలు కూడా మారుతున్నాయి. స్నేహబందం ఎక్కువైతే నష్టమేమి లేదు. కానీ మౌలిక ధక్పధాలలో వ్యత్యాసం ఎక్కువగా ఉంటే స్నేహాలు మనలేవు. మనగలిగాయంటే వారి విశ్వాసాలపై వారికి విశ్వాసం లేనట్టే. ఇలా స్నేహితులు విడిపోవడాన్ని ”ఫ్రెండ్షిప్‌ బ్రేకప్‌” అంటారు. ఈ నొప్పి విచ్ఛిన్నమైన ప్రేమ కలిగించే నొప్పి కన్నా బలమైనది.
స్నేహంలో స్వేచ్ఛ ఎంత ఉంటుందో అంతే బాధ్యత కూడా ఉంటుంది. స్నేహితులకు అండగా నిలబడడం ఒకటైతే, వారి లోలోపలి ఆలోచనలు అర్థం చేసుకుంటూ, సహానుభూతితో వారిలో ఉన్న సున్నితమైన కోణాలను జాగ్రత్తగా పదిలపరచడం, ఎన్ని గొడవలైనా మందలించినా అది స్నేహితుల హితం కోరే చేయడం కూడా ఈ బాధ్యతల్లో ఒకటి. అయితే ఇక్కడ ఒక సౌలభ్యం ఏమిటంటే స్నేహితులు ఎంత కాలం విడిగా ఉన్నా కలవగానే అలానే కలబోసుకోగలగడం. ఎక్కడ వదిలామో మళ్లీ అక్కడి నుండే ముందుకు సాగగలడం.
కొన్నిసార్లు స్నేహంలో వెన్నుపోట్లు కూడా ఉంటాయి. మనం చెప్పుకున్న రహస్యాలు, చేసిన తప్పులు విపరీతంగా ప్రచారం చేసేవారుండొచ్చు. లేక మనకు రాబోయే అవకాశాన్ని గద్దలా తన్నుకుపోయేవారు, ఇలా ఎందరో. మరి నిజంగా వారు తప్పు తెలుసుకుని వస్తే క్షమించగలమా? క్షమించవచ్చేమో కాని ఆ స్నేహం తిరిగి కొనసాగదు. నమ్మకాన్ని వమ్ము చేసిన చోట స్నేహం మనలేదు.
స్నేహానికి జెండర్‌కి కూడా ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. ఆడ మగా మధ్య స్నేహం సాధ్యమా అనే డిబేట్లు సాగేవి ఇదివరలో. సాధ్యమే అని ఎన్నోసార్లు నిరూపించబడింది కూడా. ఇప్పుడు ఆడ మగా స్థాయి నుండి బయటపడి, అన్ని జెండర్లను వీక్షించవలసిన అవసరం ఉంది. బ్రాహ్మణవాదం, పితస్వామ్యం నుండి బయటపడాలని చేసే ప్రయత్నాలలో మన బంధాలను ఆడ, మగ (బైనరీ) ఉనికిలోనే సాగిస్తుంటే ఎప్పటికి ఈ చట్రంలోనే ఇరుక్కుపోతాం.
క్వీర్‌ వ్యక్తులతో సంభాషణ, వారితో స్నేహాన్ని ఆకాంక్షించి పొందడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. మొదటగా మన ఆలోచన పరిధి విశాలమవుతుంది. కుటుంబం, ఆస్తి, ఇంటి పరువు వగైరాలన్నీ పితస్వామ్యపు దక్కోణాలే. వీటి నుండి బయటపడి ప్రపంచాన్ని వీక్షించాలి అనుకున్నప్పుడు క్వీర్‌ స్నేహాలు సామూహిక జీవనంలోని మధురమైన కోణాలను చూపెడాతాయి. మనలో సహనం, దయను దాటి, సహానుభూతిని నేర్పిస్తాయి. మనమనుకున్న జీవిత చట్రాలను దాటి బంధాలను అర్థం చేసుకోవడానికి ఎంతో తోడ్పడతాయి.
సమానత్వం లేకపోతే అది స్నేహం అవదు. స్నేహంలో సమానత్వం అనేది ఒక గమ్మత్తైన పదం. స్నేహంలో భౌతికమైన అర్హతలు- ఆస్తి, విద్య, అందం, కులం వగైరా పని చెయ్యవు అని మనకు ఎంత తెలిసినా చాలాసార్లు స్నేహంలో ఆధిక్యతను ఇవే నిర్ణయిస్తాయి. ఈ అధికారం అనేది స్పష్టంగా బైటికి కనపడకపోవచ్చు.
ఆ స్నేహంలో ఎవరి పాత్ర ఎంతో – ముఖ్యంగా నిర్ణయాధికారం లేదా ఇచ్చి పుచ్చుకోవడం, అన్నిటికన్నా మరీ ముఖ్యంగా ఆంతరంగిక ప్రపంచాన్ని ఏ వర్గానికి చెందిన స్నేహితులు పంచుకుంటున్నారో ఏ వర్గానికి చెందిన స్నేహితులు దాచిపెడుతున్నారో – ఈ విషయాలని గమనిస్తే అర్థం అవుతుంది. స్నేహంగా ఉండే అధికార సంబంధాన్ని స్నేహం అనగలమా?
స్నేహంలో ప్రైవసీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒకరి ఆంతరంగిక విషయాలు మరొకరు తెలుసుకోవాలి అనుకోవడం వెనుక కారణం ఏమిటి? కుతూహలమా లేక వారి గురించిన శ్రద్ధా? ఒకవేళ కుతూహలమైతే చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు సమాచారం రాబట్టడం లేక దాటవేయడం కూడా అధికార సంబంధాల పరిధిలోనే వస్తుంది. అంటే స్నేహితులతో ఒకరు ఎక్కువగా పంచుకోవచ్చు, అది వారి స్వేచ్ఛతో సాగినా, ఎక్కువ ప్రశ్నలు వేసి శ్రద్ధ చూపే స్నేహాలలో, ప్రశ్నించేవారు వారి విషయాలు ఎంత వరకు పంచుకుంటున్నారో కూడా గమనిస్తే ఈ అధికార సంబంధం అర్థమవుతుంది. ఇక్కడ సమాచారం నియంత్రించడం కూడా అధికార చర్యగానే చూడాలి.
పితస్వామ్యం ఆడవారిని విడదీసి పాలిస్తున్నది. రెండు కొప్పులొక చోట ఇమడవు, అత్తలేని కోడలు ఉత్తమురాలు, ఆడవారి నోట్లో నువ్వుగింజ నానదు వంటివన్నీ పితస్వామ్యపు ఉవాచాలే. అనాదిగా ఆడవారి మధ్య స్నేహాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు కాని, మన వద్ద ఆడవారి మధ్య విరిసిన స్నేహాల కథలు కోకొల్లలు. బిందెలు మోసుకుంటూ, పనులు చేసుకుంటూ ఆడవారి మధ్య పుట్టిన పాటలు ఇటువంటి తీయని విషయాలెన్నో చెబుతాయి. ఈ ఎరుక వస్తున్న కొద్దీ ఆడవారి మధ్య స్నేహసౌరభం పెరుగుతోంది.
ఇక ఆఖరున స్నేహాన్ని మనం ప్రజాస్వామికంగా చూడాలంటాం కానీ ఇందులో ఉన్న ఇంటర్సెక్షనాలిటీ ని కూడా అర్థం చేసుకోవాలి. ఒకే వర్గం మనుషులు కూడటం, ఒకే కులం లేదా మతం, ఒకే ఆర్థిక స్థాయిలో స్నేహాలు మనకు అన్నివైపులా కనబడతాయి. దీనికి జీవితాలలో ఉన్న సారూప్యం కారణమేగాని మన పరిధులను దాటి చేసే స్నేహాలు, మానవ జీవన సోపానానికి చక్కని మెట్లు. ఉదాహరణకు స్నేహంలో కులాధిక్యత నా మనసులోకి రాదు అని ప్రకటించే వ్యక్తికీ తన కులం కాక అణిచివేయబడిన కులాల నుండి వచ్చిన స్నేహితులెంతమందో లెక్కవేసుకోవాలి. అయితే వట్టి పరిచయమో, కాస్త చనువుగా మాట్లాడే మాటలో స్నేహానికి ప్రామాణికత కాదు. ఒకరి అంతః ప్రపంచంలో మరొకరిని ఎంతవరకు అనుమతించగలమో చూసుకోవాలి.
సష్టిలో తీయనిది స్నేహమేనోయి అని అంటారు కాని తీపి కాకుండా స్నేహంలో అన్ని రుచులు ఉంటాయి. దెబ్బలాడుకునేవి, ప్రేమించుకునేవి, అమ్మతనం చూపేవి, కాపాడేవి, రక్షించేవి, భక్షించేవి.. ఇలా ఎన్నో. అన్ని అనుభూతులను అనుభవిస్తూ ముందుకు సాగిపోవడమే జీవితం.
– తోట అపర్ణ