స్నేహం అనేది కొత్తగా పరిచయమైన ఇద్దరు వ్యక్తుల మధ్య, విద్యార్థుల మధ్య లేదా సహోద్యోగుల మధ్య మాత్రమే ఏర్పడే బంధమే కాదు. భార్య భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య కూడా మంచి స్నేహం ఏర్పడుతుంది. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గిఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కుటుంబ బంధాల మధ్య స్నేహబంధం ఉంటే ఆ కుటుంబం మరింత పటిష్టంగా ఉంటుంది.
స్నేహం… ఓ మధురం స్నేహం… ఓ ధైర్యం
స్నేహం… ఓ త్యాగం స్నేహం… ఓ సంబరం
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం…స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా…కడదాక నీడలాగ నిను వీడిపోదురా…అంటూ కవులు రాసిన కవితాసుధ స్నేహానికి ఉన్న విశిష్టతను ఎన్ని విధాలుగా కొనియాడినా కూడా..ఆ స్నేహబంధంలోని మధురానుభూతి వర్ణింప శక్యం కానిది. కుటుంబాలను బంధాలు నిర్ణయిస్తే స్నేహబంధాన్ని మాత్రం మనిషే నిర్ణయించుకుంటాడు.అదే స్నేహంలో ఉన్న గొప్పతనం. స్నేహానికి ఉన్నగొప్పతనాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన అనేక చలన చిత్రాలు ఘనవిజయాలను సాధించాయి. దీనికి ప్రధాన కారణం సమాజంలో స్నేహబంధంపై ఉన్న ఉన్నతమైన భావనే. కృష్ణ-కుచేలులు, కర్ణ-దుర్యోధనులు, అన్నదమ్ములైనా స్నేహితులుగా కడదాకా జీవితాన్ని సాగించిన రామలక్ష్మణులు మన పురాణ ఇతిహాస స్నేహితులు.
ఎల్లలు లేనిదే…స్నేహం
స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే నిర్ధిష్టమైన నియమ నిబంధనలు, ప్రణాళికలు, అంచనాలు ఏమి స్నేహితుల మధ్య ఉండవు. స్నేహానికి వయసుతో, కులమతాలతో, స్థితిగతులతో, లింగభేదంతో, ఎల్లలతో సంబంధం ఉండదు. స్నేహం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క బంధం లాగా మారి ప్రవర్తించగలదు. ఒకసారిగురువులా మారి మంచిని బోధించి దారిని చూపిస్తుంది. మరొకసారి తల్లిదండ్రుల్లాగా మారి మందలించిబాగోగుల్ని చూస్తుంది.కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధంగా మారుతుంది.చివరికి ఎంత త్యాగానికైనా సిద్ధపడుతుంది ఈ స్నేహం.కుటుంబ బంధాల్లో కూడా స్నేహబంధం ఉంటుంది.స్నేహం అనేది కొత్తగా పరిచయమైన ఇద్దరు వ్యక్తుల మధ్య, విద్యార్థుల మధ్య లేదా సహోద్యోగుల మధ్య మాత్రమే ఏర్పడే బంధమే కాదు. భార్య భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య కూడా మంచి స్నేహం ఏర్పడుతుంది. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గిఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కుటుంబ బంధాల మధ్య స్నేహబంధం ఉంటే ఆ కుటుంబం మరింత పటిష్టంగా ఉంటుంది.
స్నేహితుల దినోత్సవం-చరిత్ర
1930లో యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన హల్ మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ మొదటిసారిగా ఫ్రెండ్‌షిప్ డే భావనను ప్రతిపాదించారు.అయితే, దీని వెనుక వ్యాపార దృక్పథంఉండటంతో ఈ ప్రతిపాదన అంతగా ప్రాచుర్యం చెందలేదు.1935వ సంవత్సరం ఆగస్ట్ మొదటి శనివారం రోజునఅమెరికా ప్రభుత్వం చేతిలో హతమైన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తరువాత రోజైన ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని”ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే” గా ప్రకటించిందనేది కొందరి వాదన.1958లో, పరాగ్వే మనస్తత్వవేత్త, విద్యావేత్త అయిన డాక్టర్ ఆర్టెమియో బ్రాచో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఆలోచనను ప్రతిపాదించిన తర్వాత ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకునే సాంప్రదాయం గణనీయంగా పెరిగిందనేది మరికొందరి వాదన. ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 27, 2011న అంతర్జాతీయస్నేహితుల దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది. యుఎన్ జనరల్ అసెంబ్లీ జూలై 30ని అంతర్జాతీయస్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలో ఈ స్నేహితుల దినోత్సవాన్ని వివిధ దేశాలు వివిధ తేదీల్లో జరుపుకుంటున్నాయి. భారతదేశం, అమెరికా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం నాడుఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి.
స్నేహమంటేనే స్వచ్ఛమైనది..
రక్తసంబంధం కాకపోయినా…రక్తం చిందించడానికైనా… వెనుకాడనిదే… ఈ స్నేహం.స్నేహంలో నిజమైన స్నేహం, అబద్ధమైన స్నేహం అనే రెండు రకాల స్నేహాలు ఉండవు. స్నేహమంటేనే… నిజమైనది, స్వచ్ఛమైనది, కపటం లేనిది. కొందరి జీవితాలలో బాల్యంతో మొదలైన స్నేహం జీవితపు చివరి అంచుల వరకు కొనసాగుతూనే ఉంటుంది. మరికొందరి జీవితాలలో వృద్ధాప్యంలో కొత్త స్నేహాలు చిగురించి, భరోసాగా నిలుస్తాయి.ప్రతీ రోజుమాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం చెప్పి ఓదార్చే నేస్తం ఉన్నాడనే నమ్మకమైన ఆలోచన మనకు కొండంత ధైర్యాన్ని, ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు.కష్టంలో, సుఖంలో, బాధలో, సంతోషంలో నేనున్నానని నిలబడే స్నేహితుడు దొరకటం ఒక గొప్ప అదృష్టం.ఎంతో విశిష్టమైన స్నేహ బంధానికి గుర్తుగా జరుపుకునే స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
(ఆగష్టు 04 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం)
– ననుబోలు రాజశేఖర్, 8330969808