స్నేహమంటే స్వేచ్ఛ, సమానత్వం

‘స్నేహమంటే వీడిపోనిది. ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండే ఒక గొప్ప ధైర్యం, చేయూత’ అని మన చిన్నప్పటి నుండి ఎన్నో పర్యాయపదాలు, అర్థాలు వింటూనే ఉన్నాం. దాదాపు ప్రపంచం నిండా స్నేహాన్ని కీర్తిస్తూ బోలెడు సాహిత్యం, ఎన్నో మధురమైన పాటలు కూడా ఉన్నాయి. ఈ లోకంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, పిల్లలు లేని అసలు పెళ్లే చేసుకోని స్త్రీ పురుషులు, కుటుంబం, బంధువులు లేని వాళ్ళయినా ఉంటారేమో కానీ స్నేహితులు లేని మనిషే ఉండడు అనేది అతిశయోక్తి కాదేమో. ఈ లోకంలో మాతృత్వం తర్వాత అంతగా కీర్తించబడే బంధం స్నేహ బంధం ఒక్కటే. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం…

చాలా సందర్భాల్లో ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు అతను లేదా ఆమే ఎదుటి వ్యక్తుల ద్వారా ప్రేమించబడుతున్నామా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా తమ స్నేహితుల్ని ప్రేమించగల సామర్థ్యం ఉన్న వాళ్ళయి ఉంటారు. అయితే ఒకే జెండర్‌ మధ్య మాత్రమే స్నేహం ఉంటుందా..? రెండు వేర్వేరు జెండర్ల మధ్య స్నేహం ఉండదా.! ఒకవేళ ఉంటే సమాజం అంగీకరిస్తుందా.? అవునూ స్నేహానికి జెండర్‌తో సంబంధం లేదు. ఏ ఇరువురి మధ్య అయినా స్నేహాలు వికసించొచ్చు. నాకూ అమ్మాయిలే కాదు అబ్బాయిల్లోనూ, క్వీర్‌ గ్రూప్‌లోనూ మంచి స్నేహితులున్నారు. పురుషుడు-పురుషుడు, స్త్రీ-స్త్రీ లేదా పురుషుడు/స్త్రీ-థర్డ్‌ జెండర్‌/ క్వీర్‌ పర్సన్స్‌ మధ్య స్నేహాలు కచ్చితంగా సాధ్యమే.
ప్రస్తుత సమాజంలో జెండర్‌లెస్‌ స్నేహాలు అత్యంత అవసరం కూడా. సమాజమే ఒక ఇంటర్సెక్షనల్‌ సమూహం అయినప్పుడు స్నేహం వర్గ, కుల, మతాల తారతమ్యాన్ని దాటినట్టుగానే జెండర్‌ అవాంతరాల్ని కూడా దాటగలగాలి. అప్పుడే జెండర్‌ స్పృహ కలిగిన మెరుగైన సమ్మిళిత సమాజం నిర్మించగలం. గత పదేండ్లుగా నాకు మనరాష్ట్రంలోనే కాదు వేరే దేశాల నుండి కూడా క్వీర్‌ పర్సన్స్‌ సమూహం నుండి మంచి స్నేహితులున్నారు. నేను స్త్రీగా, తరతరాలుగా అణిచివేతకు గురైన సమూహపు వ్యక్తిగా క్వీర్‌ వ్యక్తుల అవసరాలను, వారిపై జరుగుతున్న హింసను అర్థం చేసుకోగలిగాను. ఆయా వ్యక్తులతో సమిష్టిగా మా ఇరు సమూహాల ప్రయోజనాల కోసం, మాపై జరిగే హింస, వివక్షలకు వ్యతిరేకంగా, మెరుగైన సమాజ నిర్మాణం కోసం పనిచేయగలుగుతున్నాం.
జెండర్‌ లేని స్నేహాలను చిన్నప్పుడు మాత్రమే చూస్తాం. రాను రాను కుటుంబం, సమాజం జెండర్‌ స్పృహ లేకుండా మనుషుల్ని వేరు చేస్తుంది. ఉదాహరణకు ఆడపిల్లని ‘మగపిల్లలతో ఏంటీ స్నేహాలు, ఆటలు’ అని అడ్డుగోడలు కట్టేస్తాం. ఇది పిల్లలు ఎదిగాక వాళ్ళ మెదళ్లలో జెండర్‌ సమానత్వాన్ని సమాధి చేసి జెండర్‌ హింసను, న్యూనతను పెంచుతుంది. మనం పిల్లల్ని అలాంటి వివక్షపూరిత వాతావరణానికి దూరంగా పెంచగలిగితేనే స్నేహాల్ని విస్తృత పరుచుకుని మానవీయ విలువల్ని పెంపొందించగలుగుతాం.
మరి స్నేహం సమవయస్కుల మధ్య మాత్రమే ఉంటుందా..!? ఇది కూడా ముమ్మాటికీ కాదు. స్నేహానికి జెండర్‌తో పనిలేనట్టే వయసు కూడా అడ్డంకి ఎంత మాత్రమూ కాదు. స్నేహం వృద్ధుడు, చిన్న పిల్లవాడి మధ్య కూడా జీవించగలదు. మనుషులు తమ పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు, గుర్రాలు, పావురాలు చిలుకలతో, మొక్కలతో కూడా స్నేహాన్ని ఏర్పరుచుకుంటారు. తండ్రి – కొడుకు/ కూతురు, తల్లి – కొడుకు/ కూతురు, భర్త – భార్య, అన్నాచెల్లుల్లు – అక్కాతమ్ముళ్లు, అన్నతమ్ముళ్లు, టీచర్‌ – విద్యార్థి మధ్య కూడా స్నేహం పరిమళిస్తుంది. అంతేకాక కుటుంబ సంబంధాలలో కూడా స్నేహం అనుభూతి చెందుతుంది. అయినప్పటికీ స్నేహం కంటే ఎక్కువగా, కుటుంబ సంబంధాలలో ప్రేమను పట్టి ఉంచే శక్తి వేరుగా ఉంటుంది. లోతుగా పరిశీలిస్తే పైబంధాల్లో ప్రేమ అనేది స్నేహం కంటే తక్కువగానే ఉంది. ఎందుకంటే అవి పరస్పరం వేరుచేసి చూడలేని అంశాలుగా కనిపిస్తాయి. కుటుంబ సంబంధాలలో కూడా ప్రేమ, అనుబంధాలకు కూడా అంతర్లీనంగా స్నేహమే పునాదిగా కనిపిస్తుంది. నాకున్న స్నేహితుల్లో అన్ని వయసుల వాళ్ళు, నాకన్నా చాలా పెద్ద వాళ్ళు, పిల్లలు కూడా ఉన్నారు. నేను ప్రస్తుతం ఉన్న నా స్నేహితుల్ని కలుసుకునే వరకు నా చెల్లెలే నాకున్న మంచి మిత్రురాలు. ప్రస్తుతం నా కొడుకు కూడా మంచి స్నేహితుడు. మేమిరువురం అన్ని విషయాలు పరస్పరం పంచుకుంటాం. సలహాలు, సూచనలు చేసుకుంటాం.
స్నేహమంటే స్వేచ్ఛ, సమానత్వం అని విశాలమైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది మన స్నేహాల ఎంపిక, ఆ స్నేహాన్ని కొనసాగించాలనే సంకల్పాన్ని బట్టి ఉంటుంది. స్నేహం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి మనతో లేదా మనం ఆమె /అతనితో ఎలా ఉండాలి అని ఆశిస్తున్నాం అనే అంతర్గత అన్వేషణ అవసరం. ఎందుకంటే స్నేహం తరచుగా ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకుని అర్థంచేసుకోవడానికి, తనను తాను తెలుసుకోవటానికి, తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది. మన స్నేహితుల్లో ప్రతి ఒక్కరూ మనలోని మంచి లేదా చెడు లక్షణాన్ని ప్రతిబింబిస్తారు. మనలోని పాజిటివ్‌, నెగిటివ్‌ లక్షణాల్ని కలిగినవాళ్ళే మన స్నేహితులుగా ఉంటారు. ఎందుకంటే మనమే వివిధ రూపాల్లో ఎదుటి వ్యక్తిలో మనల్ని మనం వెదుక్కుంటాం. అది మనల్ని మరింత దృఢపరుస్తుంది. ఇది మీకు కాస్త కన్ఫ్యుజింగ్‌గా ఉండొచ్చు కానీ నా అనుభవం ఒక ఉదాహరణగా చెప్తాను.
నా స్నేహితుల్లో ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిలో నన్ను వెదుక్కుంటాను. వారితో సారూప్యత చెందడం వల్ల నన్ను నేను మార్చుకోవడానికో, మెరుగుపర్చుకోవడానికో ప్రయత్నిస్తాను. మేము మా వ్యక్తిగత, సామాజిక, రాజకీయ అంశాలను విస్తృతంగా చర్చించే క్రమంలో సుదీర్ఘ వాదనలు చేసుకున్నప్పటికే ఒకరిపట్ల ఒకరం ఈ స్వేచ్చా, సమానత్వం అనే సూత్రాన్ని విస్మరించకుండా చూసుకుంటాం. తద్వారా మా ఆలోచన విధానాలే కాదు మా స్నేహం కూడా మరింత బలపడింది. అయితే మేము ఒకరినొకరం బలవంతంగా ఏం భరించట్లేదు. స్నేహం నిలబడాలనే కారణం కోసం అలా చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. స్నేహంలో మనకు స్వేచ్ఛ, సమానత్వం మన అభిప్రాయాల్ని మాట్లాడలేని ఇరుకుతనం ఉన్నప్పుడు ఆ స్నేహబంధం నుండి విడిపోయి ముందుకుసాగడం కూడా నేర్చుకోవాలి. ప్రేమ అయినా స్నేహం అయినా టాక్సిక్‌ అయినప్పుడు లేదా అతి చొరవకు కారణం అయినప్పుడు సామరస్యంగా విడిపోవడం కూడా అంతవరకూ ఉన్న పరస్పర స్నేహ బంధాన్ని గౌరవించుకోవడమే అవుతుంది. పవిత్ర స్నేహం, చిన్నప్పటి స్నేహం అనుకుంటూ ఎమోషనల్‌ బర్డెన్‌తో దేన్నీ బలవంతంగా మోయాల్సిన పనిలేదు. స్నేహానికి కూడా స్వేచ్ఛ, సమానత్వాలు, పరస్పర అంగీకారం, గౌరవం ముఖ్యం.
సాధారణంగా స్నేహం మూడు కారణాల వల్ల ఏర్పడుతుంది. అవి స్నేహ ధర్మం, స్వప్రయోజనం, ఆనందం. స్నేహ ధర్మం కారణం అయినప్పుడు స్నేహం కోసమే స్నేహం ఉంటుంది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఒకరు మరొకరి వ్యక్తిత్వంలోని కొన్ని విశ్వసనీయ విలువల కోసం ఒకరినొకరు ఆదరిస్తారు. అతను/ఆమెలోని పరిపూర్ణ వ్యక్తిత్వం కోసం మనం ఆ వ్యక్తికి స్నేహితునిగా ఉండాలని కోరుకుంటాం. రెండవ రకమైన స్నేహం దాని ప్రయోజనాత్మక విలువ కోసం ఏర్పడుతుంది. అలా నాకు ఎదుటి వ్యక్తి స్నేహం ఎంత ఉపయోగకరంగా ఉంది? నేను అతని నుండి ఏ ప్రయోజనం పొందగలను? ఇలా ఒక వ్యక్తి ఆచరణాత్మక, వృత్తిపరమైన, రాజకీయ కారణాల కోసం స్నేహ సంబంధాన్ని ఏర్పరుచుకోవచ్చు. ఇక మూడవ రకం తప్పనిసరిగా ‘సంబంధం ఇవ్వగల ఆనందం’ కారణంగా ఏర్పడుతుంది. అతను/ ఆమె. మనకు సంతోషాన్ని, నవ్వుల్నీ పంచే వ్యక్తులుగా ఉంటారు. వారితో ఉండే క్షణం మన చింతలన్నింటినీ మరచిపోతాం. మనల్ని ఆనందంగా ఉంచేందుకు వాళ్ళు ఎప్పుడూ తమ సహజ ధోరణిలో ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎప్పుడూ మనల్మి నిరాశపరచరు. అయితే మన స్నేహితులు శారీరకంగా, మానసికంగా, భౌతికంగా మనకు ఆనందాన్ని ఇవ్వడంలో ఎంత వరకు ఎఫర్ట్‌ పెట్టగలరు..!? మన సమయాలు అనుకూలిస్తాయా కూడా మనకొక అంచనా అవగాహన ఉండాలి. వారి పరిమితుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి నుండి అతిగా ఆశించం.
పై మూడు రకాల స్నేహాల్లో ఏది మంచిది? మొదటి రకం మంచిదనిపిస్తుంది. కానీ ఇది ఇతర రకాల వలె ఉపయోగకరంగా కానీ లేదా ఆనందం ఇచ్చేదిగా కూడా లేదు. రెండవ రకం మంచిది, పరస్పర ప్రయోజన కలిగించేదిగా అయినప్పటికీ ఈ టైపు స్నేహాలు దీర్ఘకాలం మన్నవు. నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. మూడో రకం కూడా మంచిది. అయితే జీవితంలో ఎంతకాలం ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తాం..? ఒక వ్యక్తి ఒక రోజులో ఎన్ని జోకులు పంచుకోవచ్చు? మరి మొదట్లో అతనికి/ఆమెకు ఇచ్చినంత ఆనందాన్ని ఇస్తుందా? రొటీన్‌గా ఉండదా..!? అతను/ ఆమె ఒక సంతృప్త స్థానం, మానసిక, భావోద్వేగ అలసటను చేరుకోలేరా..? అబ్బా ఇంకా చాలు అనిపించదా..!? నిశితంగా పరిశీలిస్తే ఇలాంటి వ్యత్యాసాలన్నీ నీరు చొరబడని కంపార్ట్‌మెంట్లు కాదని తెలుస్తుంది. నిశితంగా పరిశిలిస్తూ ఈ మూడు రకాలు ఒకదానితో ఒకటి సబంధం కలిగినట్టు అనిపిస్తాయి. ప్రయోజనం ఆధారంగా ఏర్పడిన స్నేహ బంధం కూడా తగిన సమయంలో మంచి స్థితికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఆదర్శనీయమైన విలువలు కలిగిన స్నేహం కూడా త్వరలో ఉపయోగాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి పై మూడు రకాల స్నేహాలను కలిపి ఉంచడం ఆదర్శవంతమైన ప్యాకేజీ అవుతుంది.
మనం ఏర్పరుచుకునే స్నేహాలు ఆటపాటలతో ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇవ్వడమే కాదు మానవీయ విలువలతో కూడినవి మరియు మనలోపలి అంతర్లీనమైన భావోద్వేగాలను సరిగ్గా నిర్వర్తించగలిగేవిగా ఉండాలి. మనల్ని వెన్నుతట్టి తోడుగా నిలబడే సహాయకారిగా ఉండాలి. అలాంటి స్నేహాలను ఏర్పరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ముఖ్యంగా ఆడపిల్లలకు, స్త్రీలకూ అత్యంత అవసరం కూడా. నా జీవితంలో కొన్నాళ్లుగా స్నేహితులు అనుకున్నవాళ్ళు నా ఆలోచనలకు ఆశయాలకు విరుద్ధంగా నన్ను నేను వారి నిబంధనలకు తగ్గట్టుగా మార్చుకునే విధంగా నన్ను ప్రభావితం చేసారు. అది నాకు ఊపిరాడనివ్వనంతగా ఇబ్బంది పెట్టింది. అది నా మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసింది. అలంటి టాక్సిక్‌ స్నేహాలను వదిలించుకున్నాకే స్త్రీగా నా వ్యక్తిత్వాన్ని మరింత దఢపరుచుకున్నాను. చివరగా బైబిల్‌ లో ఒక మాటుంటుంది ‘దూరంగా ఉన్ననీ తోడబుట్టిన వాడికన్నా నీ పొరుగున ఉండే నీ మిత్రుడే నీకు అత్యంత ఆప్తుడు అని’. కాబట్టి నీ జీవితంలో విలువైన స్నేహితుల్ని పోగుచేసుకుని నిలబెట్టుకో. వాళ్ళే నీ జీవితాన్ని వెలిగిస్తారు. అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

– కవిత పులి, 9652329800