నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా ‘ఘటికా చలం’. ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు నిర్మిస్తున్నారు. అమర్ కామెపల్లి దర్శకుడు. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా నిర్మాత ఎస్‌కేఎన్, డైరెక్టర్ మారుతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అమర్ కామెపల్లి మాట్లాడుతూ, ‘ఈ సినిమా కాన్సెప్ట్‌ను యూఎస్‌లో ఉండే నా ఫ్రెండ్ రాజు చెప్పాడు. వాళ్లకు తెలిసిన వారి ఇంట్లో జరిగే కొన్ని ఘటనలు చెప్పాడు. 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్‌లో జరిగిన కథ. మారుతికి ట్రైలర్ చూపించాను. ఆయనకు నచ్చి మూవీ చూశారు. ఆయనతోపాటు నిర్మాత ఎస్‌కెఎన్‌కీ సినిమా నచ్చి, మూవీని రిలీజ్ చేస్తున్నారు’ అని అన్నారు. ‘అమర్ ఎంత ఇంటెన్స్‌గా స్టోరీ నెరేట్ చేశారో, దాన్ని నా పర్‌ఫార్మెన్స్‌లో చూపించానని అనుకుంటున్నాను. కథలో ఎన్నో ట్విస్ట్‌లు, టర్న్స్ ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి’ అని హీరో నిఖిల్ దేవాదుల చెప్పారు. నిర్మాత ఎస్‌కెఎన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా చూశాం. డైరెక్టర్ అమర్ ఒక పది సినిమాలు చేసినంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్‌లా మూవీ రూపొందించారు. నాకు హర్రర్ మూవీస్ చాలా ఇష్టం. భయపడినా ఇష్టపడుతూ హర్రర్ మూవీస్ చూస్తుంటా. మ్యూజిక్ డైరెక్టర్ సూపర్బ్‌గా మ్యూజిక్ ఇచ్చారు. హర్రర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం’ అని తెలిపారు.