కల్వకుర్తిలో కేవీపీఎస్ రాష్ట్ర సామాజిక శిక్షణా తరగతులు
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి
నవతెలంగాణ-సూర్యాపేట
దేశంలో పెట్రేగిపోతున్న మతోన్మాద హింసను అరికట్టడానికి, రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్య విలువలను రక్షించుకోవడానికి సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సామాజిక కార్యకర్తలకు రాజకీయ తర్ఫీదునివ్వడానికి కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణా తరగతులు జూన్ 5, 6, 7వతేదీలలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి తెలిపారు.సోమవారం స్థానిక ఎంవీఎన్ భవన్‌లో జరిగిన ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసి ఆ స్థానంలో మనుస్మతిని ప్రాచీన భారత రాజ్యాంగంగా ప్రవేశపెట్టేందుకు యత్నిస్తుందన్నారు.ఆర్‌ఎస్‌ఎస్ కనుసనల్లోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.మొత్తం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడం ద్వారా రిజర్వేషన్లు రద్దుకాబడి తద్వారా సామాజికన్యాయాన్ని సమాధి చేస్తుందన్నారు.మత విధ్వేషాలను రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని సష్టించడం ద్వారా దేశ ప్రజల మధ్య విభజనను రెచ్చగొడుతుందని విమర్శించారు.బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులపైన 300 రెట్లు దాడులు పెరిగాయన్నారు.రాజ్యాంగ రక్షణ కోసం రిజర్వేషన్ల పరిరక్షణ కోసం భవిష్యత్తులో సామాజిక ఉద్యమాన్ని నిర్మించడానికి రాష్ట్రస్థాయి కెవిపిఎస్ నాయకులు కార్యకర్తలకి రాజకీయ తర్ఫీదునివ్వడానికి ఈ శిక్షణా తరగతులు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని బిఆర్‌ఎస్ కార్యకర్తల ఫలహారంగా పంచుతుందని అర్హులైనటువంటి నిరుపేద దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.దళితబంధులో జరుగుతున్న అవినీతిపైన సమగ్ర దర్యాప్తు జరిపించి అవినీతికి పాల్పడిన నాయకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు.దళితబంధును పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా నిజమైన అర్హులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మర్రినాగేశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు,దుర్గారావు, నాగమణి, రమణ, గిరి తదితరులు పాల్గొన్నారు.