బెలూన్‌ నుంచి బేబీ వాకర్‌ వరకూ…

– స్వతంత్రులకు 193 ఎన్నికల గుర్తులు
– కేటాయించిన సీఈసీ
న్యూఢిల్లీ : రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే స్వతంత్రులు, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థుల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ 193 గుర్తులను కేటాయించింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమకు ఇప్పటికే కేటాయించిన ఎన్నికల గుర్తుల పైనే పోటీ చేస్తాయి. స్వతంత్రులు, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు మాత్రం ఎన్నికల కమిషన్‌ కేటాయించిన గుర్తుల జాబితా నుండి వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ఎన్నికల కమిషన్‌ కేటాయించిన గుర్తులలో చేతికర్ర, బేబీ వాకర్‌, ఎయిర్‌ కండిషనర్‌, బెలూన్‌, గాజులు, చక్రాల బండి, విజిల్‌, దారం-సూది, పుచ్చకాయ, వాల్‌నట్‌, వాలెట్‌, వయోలిన్‌, వాక్యూమ్‌ క్లీనర్‌, బాకా వంటివి ఉన్నాయి. ఈ సంవత్సరంలో మిజోరం, ఛత్తీస్‌ఘర్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17న, ఛత్తీస్‌ఘర్‌ అసెంబ్లీ గడువు జనవరి 3న, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ గడువు జనవరి 6న, రాజస్థాన్‌ అసెంబ్లీ గడువు జనవరి 14న, తెలంగాణ అసెంబ్లీ గడువు జనవరి 16న ముగుస్తుంది. ఈ ఐదు రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అధికారులు తెలిపారు. వీటితో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌లో కూడా ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగవచ్చు. అమర్‌నాథ్‌ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్ట్‌ 31న ముగుస్తుంది. కాబట్టి జమ్మూకాశ్మీర్‌లో అక్టోబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిసా రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి వచ్చే సంవత్సరం జూన్‌లో వేర్వేరు తేదీలలో ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌-మేలో జరగనున్నందున ఈ మూడు రాష్ట్రాలలో కూడా అప్పుడే ఎన్నికలు జరిపే అవకాశం లేకపోలేదు.