– 25 ఏండ్లపాటు పార్టీకి సేవలందించిన గొప్ప వ్యక్తి
– బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీడ్కోలు సభలో హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నాటి జలదృశ్యం నుంచి నేటి తెలంగాణ భవన్ దాకా 25 ఏండ్లపాటు తమ పార్టీకి ఎనలేని సేవలందించిన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గొప్ప వ్యక్తి అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశంసించారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ప్రధాన కార్యదర్శిగా ఉండి, ఏండ్లపాటు తెలంగాణ భవన్‌కు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారని తెలిపారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారని తెలిసి అధినేత కేసీఆర్ సైతం ఎంతో బాధపడుతున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ భవన్ ఇన్‌ఛార్జి శ్రీనివాసరెడ్డి…సోమవారం బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ… తెలంగాణ అంటే అందరికీ కేసీఆర్ పేరు గుర్తుకొస్తుందనీ, అదే తరహాలో తెలంగాణ భవన్ అంటే శ్రీనివాసరెడ్డి పేరే గుర్తుకొస్తుందని తెలిపారు. భవన్ ఇన్‌ఛార్జిగా కేసీఆర్ చెప్పిన ప్రతీ విషయాన్నీ ఆయన తూ.చా.తప్పకుండా అమలు చేసేవారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ కష్టాలన్నింటినీ ఆయన కళ్లారా చూశారని చెప్పారు. ఈ క్రమంలో ఆయన తన అనుభవాలన్నింటినీ పుస్తక రూపంలో తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.