ఇక‌పై ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడి

From now on, every buddy.. is a mother's lap– ప్రభుత్వ పాఠశాలలపై సరికొత్త ప్రణాళిక
– స్వయం సహాయక సంఘాల మహిళలకు బడుల బాధ్యతలు
– ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు
– అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా…ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలన కోసం సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పట్టించుకునే బాధ్యతను అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. సీఎం ఆదేశాల ప్రకారం… ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను అధికారులు ఏర్పాటు చేయ నున్నారు. కమిటీల్లో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రతీ తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులు సభ్యులుగా ఉంటారు. ఇకపై పాఠశాలల్లో జరిగే ప్రతీ వర్కు(పనిని)నూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీర్మానంతోనే చేపట్టనున్నారు. సంబంధిత కార్యాచరణను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమయ్యే తక్షణ పనులను గుర్తించి జూన్‌ 10 లోగా పూర్తి చేయాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ.25 వేలలోపు ఖర్చయ్యే పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే చేపడతాయి. అంతకు మించి, రూ.లక్ష వరకు ఖర్చయ్యే పనులకు ఎంపీడీవో, రూ. లక్ష దాటిన పనులకు జిల్లా కలెక్టర్ల అనుమతిలో చేపట్టాల్సి ఉంటుంది. పాఠశాలల్లో కిటికీలు, తలుపులు, ఎలక్ట్రిక్‌ స్విచ్‌ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతులను ఆయా కమిటీలు చేపట్టనున్నాయి. ఇందుకవసరమైన దాదాపు రూ.600 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. సంఘాల మహిళలపై భారం పడకుండా ఆదర్శ కమిటీలు చేపట్టే పనులకు రూ.25 వేలు అడ్వాన్సుగా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటితోపాటు పాఠశాల విద్యార్థులకు అవసరమైన యూనిఫారాలను కుట్టే పనులను కూడా సర్కారు స్వయం సహాయక సంఘాలకే అప్పగించింది. దీంతో వాటిల్లోని మహిళలకు స్థానికంగా ఉపాధి దొరుకుతుందనీ, అంతమేరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈసారి బడిబాట కార్యక్రమాన్ని కూడా తల్లుల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందనీ, తల్లుల పర్యవేక్షణ పెంచటం ద్వారా బడిలో చేరే ఆడ పిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తోంది. తద్వారా ప్రయివేటు బడులపై మోజును తగ్గించటమేగాక నాణ్యమైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించటంలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తోంది.
తిరుమలలో సీఎం
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుపతికి వెళ్లారు. తన మనవడి పుట్టు వెంట్రుకలను రేవంత్‌ కుటుంబ సభ్యులు స్వామి వారికి సమర్పించనున్నారు. ఇందుకోసం మంగళవారం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుమలకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
అక్కడి నుంచి తిరిగి ఆయన బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంటారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ రెడ్డి తొలిసారిగా వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అధికారులు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
రాజీవ్‌గాంధీకి రేవంత్‌ ఘన నివాళి
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్‌ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఐటీ రంగ అభివృద్ధికి ఆయన బాటలు వేశారని కొనియాడారు. మంగళవారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న రాజీవ్‌ విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీపాదాస్‌ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కె జానారెడ్డి మాజీ ఎంపీ వి హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, మల్‌రెడ్డి రాంరెడ్డి , కార్పొరేటర్‌ విజయారెడ్డి, ఇందిరా శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల కోసం ఆరు పాలసీలు టెక్స్‌టైల్‌ కోసం కొత్త పాలసీ
– ‘కోడ్‌’ ముగిసేలోపు పూర్తి చేయండి : అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు
పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేలా విధానాల రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ ముగిసేలోపు అన్ని రకాల పాలసీల తయారీ పూర్తికావాలని చెప్పారు. తెలంగాణ స్టేట్‌ ఇండిస్టీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ అధికారులతో మంగళవారంనాడాయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెక్స్‌టైల్స్‌కు సంబంధించి రాష్ట్రంలోని పవర్‌లూమ్‌, హ్యాండ్‌లూమ్‌ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని ఆదేశించారు. అలాగే పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఆరు నూతన పాలసీలను రూపొందిస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పాలసీ, ఎక్స్‌పోర్ట్‌ పాలసీ, న్యూ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ, రివైజ్డ్‌ ఈవీ పాలసీ, మెడికల్‌ టూరిజం పాలసీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని వివరించారు. అయితే ఇవన్నీ ఎన్నికల కోడ్‌ ముగిసేలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రపంచ దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పాలసీలను అధ్యయనం చేసి, ఇక్కడ వాటి సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని కోరారు.