ఆకలి చావుల నుంచి అభివృద్ధి వైపు…

వ్యవసాయం నాడు తిరోగమనం – నేడు పురోగమనం
– గతంలో ఆకాశం వైపు చూసే రైతులు.. ఇప్పుడు కాలువల నీళ్లతో పంటల సాగు
– 14 ఏండ్ల సుదీర్ఘ పోరాట ఫలితం 10 సంవత్సరాల అభివృద్ధిలో ఓ మైలురాయి
– నవతెలంగాణతో వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
వానాకాలం మొదలైందంటే రైతుల కండ్లు ఆకాశం వైపు, చేతులు వడ్డీ వ్యాపారస్తుల వైపు చాచేవారు. ఆకలిచావులు, అంబలి కేంద్రాలు, వలసలు, రైతు ఆత్మహత్యలు తెలంగాణాలో నిత్యకృత్యంగా ఉండేవి. పాలమూరు కూలీలంటేనే ప్రపంచ వ్యాప్తంగా పెట్టింది పేరు. అలాంటి ప్రాంతం నేడు అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే నేటి అభివృద్ధి. పది సంవత్సరాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలబెట్టేలా జరిగిన అభివృద్ధిని నెమరువేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సాధించిన విజయాలపై నిరంజన్‌రెడ్డి నవతెలంగాణా మహబూబ్‌నగర్‌ ఉమ్మడి ప్రాంతీయ ప్రతినిధి ఏ. పరిపూర్ణంకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యవసాయం, అనుభంధ రంగాల అభివృద్ధిపై ఆయన మాటల్లోనే..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయంలో అభివృద్ధి ఏ మేరకు సాధించారు?
రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణా ఉద్యమ సమయంలో అప్పటి పాలకులు తెలంగాణాను కించపరిచే విధంగా మాట్లాడారు. నీళ్లు రావన్నారు, విద్యుత్‌ లేక రాష్ట్రం అంధకారమవుతుందన్నారు. విద్య, ఉపాధికి నిధులు ఎక్కడ నుండి తెస్తారని ప్రశ్నించారు. వారి మాటలను తలకిందులు చేస్తూ ఉచిత విద్యుత్తు 24 గంటలు ఇస్తున్నాము. పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి ఏడాదికి 2 పంటలకు సాగునీరునందిస్తున్నాం. ఇప్పుడు ఏ రాష్ట్రం వెళ్లినా తెలంగాణ పథకాలపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్ళు, నిధులు, నియామకాల మీద దృష్టి సారించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ నేడు అభివృద్ధిలో దూసుకుపోతోంది. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితాలు ఒక్కొక్కటి ప్రజలకు చేరువవుతున్నాయి. దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యే విధంగా కార్యక్రమాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.
14 ఏండ్ల సుదీర్ఘ పోరాట అనుభవాలు ఏంటి ? రాష్ట్ర ఏర్పాటు ఫలితాలు వస్తున్నాయా ?
రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన 14 ఏండ్ల ఉద్యమం, చేసిన త్యాగాల ప్రతిఫలాలు మన కండ్లముందే కనిపిస్తున్నాయి. ఎంతో మంది యువత బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుభవంతో సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలేమిటి ? వ్యవసాయ రంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే కోణంలో పరిశోధనాత్మక చర్చలు చేసి పరిష్కారాలు కనుగొన్నారు. సాగు సక్రమంగా జరగాలంటే సాగునీరు కావాలి. అందుకే ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేశాము. గోదావరి మీద కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి, కృష్ణా నది మీద పాలమూరు-రంగారెడ్డి పథకానికి శ్రీకారం చుట్టాము. మూడేండ్లలో కాళేశ్వరాన్ని పూర్తి చేశాం త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీటిని పంటపొలాలకు మళ్ళిస్తాము. గతంలో కాలువలలో మోటార్లు వేసి నీటిని మళ్ళించడంపై ఆంక్షలుండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే శిస్తును రద్దు చేయడంతోపాటు మోటార్లపై వున్న నిషేధాన్ని ఎత్తివేశాము. 26 వేల చెరువులను, కుంటలను పునర్నిర్మాణం చేయడం ద్వారా ప్రాజెక్టులు ఎత్తి పోతల పథకాల పరిధిలో వున్న కాల్వలకు అనుసంధాన్ని చేసి సాగునీటిని ఇచ్చాము.
వలసలు, ఆకలి చావులు ఆగాయా ?
వర్షాలు లేక, సాగు నీరు రాక, బోరు బావుల్లో నీరు లేక సాగు కుంటుపడేది. విద్యుత్తు సక్రమంగా వుండకపోవడం వల్ల పంటలు ఎండిపోయేవి. దీనితో ఇక్కడ రైతులు సాగును వదిలి ముంబయి, మహారాష్ట్ర, దుబారు వంటి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు వెళ్లేవారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆత్మస్థైర్యం కోల్పోయిన రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా సాగుకు పెట్టుబడి కోసం రైతుకు ఇబ్బందులు లేకుండా రైతుబంధు కింద ఎకరాకు 10 వేలు అందిస్తున్నారు. ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే రైతు భీమా ఏర్పాటు చేశారు. అన్నం పెట్టే రైతు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి రావాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు 65 వేల 190 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడం జరిగింది. ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లించే రైతుబీమా పథకం మూలంగా రైతు ఏ కారణం చేత మరణించినా పది రోజులలోపు ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. 2018 ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 1,02,124 మంది రైతు కుటుంబాలకు రూ. 5106.20 కోట్ల బీమా పరిహారం అందించాం.
ఉచిత విద్యుత్తు, సాగునీటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం బోరుమోటార్ల మీదనే ఆధారపడింది. అందుకే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందించాలని నిర్ణయించి 2018 జనవరి 1 నుండి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. మొత్తం తెలంగాణలో 26 లక్షల పైచిలుకు వ్యవసాయ మోటార్లకు ఉచిత కరెంటు పథకం విజయవంతంగా అమలవుతూ ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ట్రాన్స్‌కో, డిస్కం వ్యవస్థలను పటిష్టం చేసేందుకు రూ.37,911 కోట్లు ఖర్చు చేశారు. ట్రాన్స్‌కోలో అతిముఖ్యమైన 400 కేవీ సబ్‌స్టేషన్లను 2 నుంచి 23కు పెంచారు. 220 కేవీ సబ్‌స్టేషన్లను 51 నుంచి 99కి, ఈహెచ్‌టీ లైన్ల పొడవును 16,379 సర్క్యూట్‌ కిలోమీటర్ల నుంచి 27,573 సర్క్యూట్‌ కిలోమీటర్లకు పెంచారు. డిస్కంల పరిధిలో 33 కేవీ సబ్‌స్టేషన్లను 2,138 నుంచి 3,190కి పెంచగా, ఎల్టీ లైన్ల పొడవును 4.89 లక్షల కిలోమీటర్ల నుంచి 6.67 లక్షల కిలోమీటర్లకు పెంచారు. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 7,778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండగా.. గత డిసెంబరు నాటికి దాన్ని 18,829 మెగావాట్లకు చేర్చారు. పులిచింతలలో 30 మెగావాట్ల నాలుగో యూనిట్‌, కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంట్‌, 270 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే నాలుగు యూనిట్ల భద్రాద్రి థర్మల్‌పవర్‌ ప్లాంట్‌ (1,080 మెగావాట్లు)ను నిర్మించి ప్రారంభించార. దీనికి సింగరేణి 1,200 మెగావాట్లు జత చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 74 మెగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్తును 5,117 మెగావాట్లకు తీసుకుపోయాం. యాదాద్రిలో 4,000 మెగావాట్లు సహా మరో 8,705 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రంలో వినియోగించే విద్యుత్తులో 33 శాతం వ్యవసాయానికే వినియోగిస్తుండడం వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం.
సాగు విస్తీర్ణం పెరిగిందా?
సాగునీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతోనే ఆగిపోకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడం, నకిలీ విత్తనాలపై తొలిసారి పీడీ యాక్టు ప్రయోగించి రైతులు నష్టపోకుండా అరికట్టడం, పంటల నమోదు, పత్తి సాగు, పప్పు గింజలు, నూనె గింజల సాగు వైపు రైతులను ప్రోత్సహించడం, రైతులు పండించిన పంటలను వందశాతం కనీస మద్దతుధరకు సేకరించడం వంటి చర్యలతో తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలిచింది. 2014 నాటికి కోటీ 31 లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2022-23 నాటికి అది 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014-15 నాటికి 68 లక్షల టన్నులు మాత్రమే ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 2.70 కోట్ల టన్నులకు చేరుకున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రూ. లక్షా 27 వేల కోట్లతో, 699.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం, రూ.10,719 కోట్లతో ఇతర పంటలను సేకరించడం జరిగింది. కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో నేడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచింది.
సాగునీటి, ఇతర పథకాల కోసం ఇంతవరకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు 😕
సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు సుమారు రూ.1.59 లక్షల కోట్లు, విద్యుత్‌ మౌళిక సదుపాయాల కోసం రూ. 37,911 కోట్లు ఖర్చు చేశాం. వ్యవసాయానికి 24 గంటల కరంటు కోసం ఏటా రూ.10,500 కోట్లు ఖర్చు పెట్టాం. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు విడతలలో రూ.17,351.47 కోట్లు రుణమాఫీ, రూ. 5349 కోట్లతో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు పునరుద్ధరించి, 8.93 టిఎంసి ల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓ, ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో రూ. 572 కోట్లతో 2601 రైతు వేదికల నిర్మాణం, రూ. 928.68 కోట్లతో 39.98 లక్షల క్వింటాళ్ల రాయితీపై వివిధ రకాల పంటల విత్తనాలు సరఫరా, 2014-15 నాటికి 39.01 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం ఉన్న గోదాంలు 73.80 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంపు, వ్యవసాయయాంత్రీకరణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం రూ.963.26 కోట్లను వెచ్చించి 6.66 లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చడం ఇలా మొత్తం వ్యవసాయరంగం సమగ్ర స్వరూపం మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.4.50 లక్షల కోట్లు .
వ్యవసాయ రంగం ద్వారా అనుబంధ రంగాలు
ఎలా అభివృద్ధి చెందుతాయి ?
ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ రంగాలైన మిల్లులు, ఆహార ఉత్పత్తి సంస్థలు, ఆహార అమ్మకాలు కొనుగోళ్లు చేసే రంగాలలో ఉపాధి లభిస్తుంది. వ్యవసాయం వర్దిల్లాలి, అందరి ఆకలి తీర్చే రైతన్న ఆనందంగా వుండాలి అనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. 60 ఏండ్ల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా ప్రపంచానికి దిక్సూచిలా నిలుపగలిగిన అరుదైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అశోకుడు చెట్లు నాటించెను, కాకతీయులు చెరువులు నిర్మించెను అన్నది మనం చదువుకుంటున్న చరిత్ర. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో నీళ్లన్నా, చెరువన్నా, పంటన్నా ముఖ్యమంత్రి కేసీఆరే గుర్తుకు వస్తారు.