టీచ‌ర్ నుంచి సీఎం వ‌ర‌కు

From teacher to CMఅతిశీ మార్లీనా సింగ్‌… ఓ టీచర్‌గా, సామాజిక కార్యకర్తగా, మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీలో కీలకంగా మారారు. ఢిల్లీ ప్రభుత్వంలో విద్యా, పీడబ్ల్యూడీ, కల్చర్‌, ఫైనాన్స్‌, టూరిజం శాఖలు నిర్వర్తించారు. ఆప్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో సభ్యులుగానూ ఉన్నారు. తర్వాత విద్యాశాఖ మంత్రిగానూ బాధ్యతలు చూశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీలో ఆ పదవి చేపట్టిన మూడో మహిళగా నిలిచిన ఆమె రాజకీయ ప్రస్థానం నేటి మానవిలో…

అతిశీ మార్లీనా సింగ్‌ 1981 జూన్‌ 8న పుట్టారు. ఈమె తల్లిదండ్రులు విజరు సింగ్‌, త్రిప్తా వాహి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు. అభ్యుదయ భావాలు కలిగిన వీరు మార్క్స్‌, లెనిన్‌ కలయికతో (వీaతీఞూంవఅఱఅ- వీaతీశ్రీవఅa) కూతురికి అతిశీ మార్లీనా సింగ్‌ అని పేరు పెట్టారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంటిపేరును వాడడం మానుకున్నారు. పంజాబీ మూలాలు ఉన్న తోమర్‌ రాజ పుత్రుల వంశానికి చెందిన అతిశీ… తనను తన వంశం కంటే పనితోనే అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరుకున్నారు. అందుకే తన ఇంటి పేరుతో కంటే అతిశీగానే అందరి మధ్యలో ఉండాలని నిర్ణయించుకొని ఇంటి పేరును తొలగించుకున్నారు.
విద్యాభాసం
విద్యా వంతులైన తల్లిదండ్రుల స్ఫూర్తితో అతిశీ ఉన్నత విద్యను అభ్యసించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఢిల్లీలోని స్ప్రింగ్డేల్స్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సేయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి 2021లో చరిత్రలో డిగ్రీ పట్టా అందుకున్నారు. తర్వాత చీవ్‌నింగ్‌ స్కాలర్‌షిప్‌తో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో 2003లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కూడా చరిత్రలోనే చేశారు. తర్వాత 2005లో ఆక్స్‌ఫర్డ్‌లోని మాగ్‌డాలెన్‌ కాలేజీలో రోడ్స్‌ స్కాలర్‌గా ఉండి ‘ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌’ విభాగంలో రెండోసారి మాస్టర్స్‌ పట్టా అందుకున్నారు.
రైతుగానూ…
చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం ఆంధ్రప్రదేశ్‌లోని రిశి వ్యాలీ స్కూల్‌లో చరిత్ర, ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేశారు. అయితే దీని వల్ల కేవలం తనకు మాత్రమే ప్రయోజనం ఉంటుందనీ, నలుగురికి ఉపయోగపడేలా ఇంకేదో చేయాలని భావించారు. భర్త ప్రవీణ్‌ సింగ్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో కొంత కాలం సేంద్రియ వ్యవసాయం చేశారు. అలాగే అక్కడి చిన్నారులకు చదువు నేర్పించారు. విద్య పట్ల వారిలో ఆసక్తి పెంచేందుకు పలు విద్యా కార్యక్రమాల్ని చేపట్టారు. దీనికోసం అక్కడి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశారు. ఈ సందర్భంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. సమాజం కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించి తమ పార్టీలోకి రావల్సిందిగా ఆహ్వానించారు.
రాజకీయాల్లోకి అరంగేట్రం
2013 జనవరిలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో అతిశీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తొలి నుండే పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారు. పార్టీ ప్రాథమిక పాలసీలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత ఆప్‌ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతానికి ఆప్‌ ప్రతినిధిగా, ఆప్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యురాలిగా పని చేశారు. ఈస్ట్‌ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించారు. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన చారిత్రాత్మక జల సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన నిరసనలు, న్యాయ పోరాటంలో మద్దతునిచ్చారు. 2015 జులై నుంచి 2018 ఏప్రిల్‌ వరకు ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియాకు సలహాదారురాలిగా పని చేశారు. విద్యా వ్యవస్థను మెరుగుపరడానికి ఎంతగానో కృషిచేశారు. తనలోని విశేషమైన నైపుణ్యాలతో అతి తక్కువ కాలంలోనే గొప్ప నాయకురాలిగా ఎదిగారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో అతిశీ తూర్పు ఢిల్లీకి ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఆ ఎన్నికల్లో పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ చేతిలో ఓడిపోయారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కల్కాజీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిపై 11 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలా పార్టీ వ్యవహారాల్లో పట్టు సాధించిన అతిశీ, గోవాలో ఆప్‌ ఛీప్‌గా వ్యవహరించారు. ఢిల్లీలోని విద్యాసంస్థలు అతిశీ సారథ్యంలో గణనీయంగా మెరుగుపడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యా హక్కు చట్టం ప్రకారం స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రైవేట్‌ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచ కుండా నిబంధనలను పటిష్టం చేయడం, స్కూల్‌ కరికులంలో ‘హ్యాపీనెస్‌’ పాఠ్యాం శాలను రూపొందించడంలో ఆమె ముఖ్య మైన పాత్ర పోషించారు. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టిపెట్టి వారిలో పలురకాల స్కిల్స్‌ను పెంపొందించడంపై ప్రత్యేకంగా కృషి చేశారు.
ఏకైక మహిళా మంత్రిగా…
మంత్రిమండలి పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా 2023 మార్చి 9న ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా ఆర్థిక, ఎడ్యుకేషన్‌, పబ్లిక్‌ వర్క్స్‌, పవర్‌, రెవెన్యూ, లా, ప్లానింగ్‌, సర్వీసెస్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిసిటీ, విజిలెన్స్‌ శాఖలను నడిపించారు. మద్యం కుంభకోణంలో పార్టీ కీలక నేతలందరూ జైలుకు వెళ్లడంతో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లోనూ తనదైన పాత్ర పోషించారు. ప్రజల మన్నలను పొందారు. పార్టీ ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. తన వాగ్దాటితో ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టారు. అందుకే అరవింద్‌ కేజ్రివాల్‌ రాజీనామాతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ఏకగ్రీవంగా ఆప్‌ పార్టీ ఖరారు చేసింది. షీలా దీక్షిత్‌, సుష్మా స్వరాజ్‌ తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 43 ఏండ్ల అతిశీ అతి పిన్న సీఎంగానూ గుర్తింపు తెచ్చుకున్నారు.