నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్, డిప్లొమా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 27న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. అదేనెల 27,28 తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని పేర్కొన్నారు. ఈనెల 31న ప్రత్యేక విడత పాలిసెట్ ప్రవేశాలకు సీట్లను కేటాయిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.