జె జెస్సిలా ఏంజెలిన్… తన కుటుంబ సభ్యుల పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు ఓ అనాథా శ్రమానికి వెళ్ళారు. అక్కడి ఓ నెలల బాబు విషాద జీవితం ఆమెకు ఓ లక్ష్యాన్ని నిర్దేశించింది. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలను కున్నారు. అంతేకాదు తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న అనాథలకు, కుటుంబం భారంగా భావించి వదిలేసిన వృద్ధులకు అండగా నిలబడ్డారు. దీనికోసమే ‘వీ విటమిన్ గ్లోబల్’ అనే సంస్థను స్థాపించారు. దీని ఆధ్వర్యంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
గత ఏడాది సెప్టెంబర్ 27న కూడా మంసాపురం గ్రామంలో రోజూ మాదిరిగానే సూర్యుడు ఉదయించాడు. రాబోయే తుఫాను గురించి తెలియని ఆ గ్రామంపై తన బంగారు కాంతిని ప్రసరింపజేశాడు. గ్రామానికి చెందిన 35 మందికి పైగా ఎక్కిన మినీబస్సుకు జరిగిన ప్రమాదంలో తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న ఆరోజు అది సాధారణ దినచర్యగా లేదు. సూర్యుని వెచ్చదనంతో పాటు కన్నీటితో వారి హృదయం బరువెక్కిన ఉదయంగా మారింది. కొన్ని గంటల్లోనే ఉద్రేకపూరితమైన ఫోన్ కాల్స్ వారి ప్రశాంతతను బద్దలు కొట్టాయి. ప్రమాదం గురించి భయంకరమైన వార్తను అందించాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని ఓ ఇరుకైన రహదారి నుండి ప్రయాణిస్తున్న మినీబస్సు అదుపుతప్పి ఒక గొయ్యిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా నలుగురు మరణించారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణమంతా దు:ఖ సంద్రంలా మారిపోయింది.
ఓ ఆశా దీపంగా
ప్రమాదం జరిగి పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్న సమయంలో జె జెస్సిలా ఏంజెలిన్ ఓ ఆశా దీపంగా ఉద్భవించింది. 35 ఏండ్లు వయసు గల ఆమె శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన ‘వీ విటమిన్ గ్లోబల్’ అనే ఓ ఎన్జీఓకు సీఈఓ. ఆమె అక్కడకు చేరుకోకముందే ఆమె బృందం అక్కడ ఉంది. ప్రమాదానికి గురైన వారికి సహాయ చర్యలు అందిస్తూనే బంధువులను ఓదార్చుతున్నారు. తీవ్రంగా గాయపడిన 19 ఏండ్ల పువిరాజ్‌ను గుర్తించిన జెస్సిలా వెంటనే వైద్యులతో సమన్వయం చేసుకుని, మధురైలో అత్యవసర వైద్య సంరక్షణను ఏర్పాటు చేసింది. ప్రమాదం జరిగిన నెలల తర్వాత కూడా ఆమె పువిరాజ్ కుటుంబానికి మద్దతుగా నిలిచింది. ‘జెస్సిలా ఉనికి ఒక అద్భుతం. ఆమె నా మేనల్లుడి ప్రాణాన్ని కాపాడింది’ అని పువిరాజ్ మామ ఎస్ రామసామి ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో పంచుకున్నారు.
వాస్తవ కథలు ఎన్నో
ఆ బాబును కాపాడం జెస్సిలా చేసిన మొదటి సాహసం కాదు. ఏడాది కిందట ఓ ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కళాశాల విద్యార్థిని రక్షించడానికి ఆమె ముందుకు వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రులు మైళ్ల దూరంలో ఉండటంతో జెస్సిలా అతనికి వైద్య సహాయం అందేలా చూసుకుంది. అంతేకాదు అతని కుటుంబం వచ్చే వరకు అతని పక్కనే ఉంది. కరుణ, సామాజిక స్పృహ కలిగిన ఆమె జీవితంలో ఇటువంటి వాస్తవ కథలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి కథలు ఓ దశాబ్దానికి పైగా లెక్కలేనన్ని పుట్టుకొచ్చి వారి జీవితాలను తాకుతుంది. జెస్సిలా ఒడిస్సీ పదేండ్ల కిందట ఓ అనాథాశ్రమాన్ని సందర్శించడంతో ఆమె పని ప్రారంభమైంది. కుటుంబ సభ్యుని పుట్టినరోజును ఆనందంగా జరుపుకోవాలని అక్కడకు వచ్చిన ఆమె జీవితాన్ని మార్చే క్షణంగా ఆ రోజు మారింది. తల్లిదండ్రుల ఆత్మహత్య చేసుకోవడంతో అనాథగా మారిన ఓ ఎనిమిది నెలల శిశువు కథను ఆమె అక్కడ విన్నది. ‘అంత నిరాశకు గురై ఎవరూ ఇలా తమ జీవితాలను అర్థాంతరంగా ముగించకూడదని నాకు అప్పుడు తెలిసింది. అప్పుడే మానసిక ఆరోగ్య అవగాహన నా లక్ష్యం అయింది’ అని జెస్సిలా గుర్తుచేసుకున్నారు.
వీ విటమిన్ గ్లోబల్ స్థాపన
మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కొంతకాలం ఓ ఎన్‌జీఓలో స్వచ్ఛందంగా పనిచేసిన తర్వాత జెస్సిలా తన భర్తతో కలిసి 2019లో ‘వీ విటమిన్ గ్లోబల్’ను స్థాపించారు. మొదట కళాశాల విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లతో వారి ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆకలి నుండి పర్యావరణ పరిరక్షణ వరకు విస్తృత సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి క్రమంగా అభివృద్ధి చెందింది. ఉదాసీన ప్రపంచంలో నిర్లక్ష్యానికి గురైన వారికి ఆమె సేవా కార్యక్రమాలు ఓ ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఆమె శాశ్వత కార్యక్రమాలలో ఒకటి నిరాశ్రయులకు, వదిలివేయబడిన వారికి రోజువారీ భోజనాలు అందించడం. ‘కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఆకలితో అలమటించడం చూశాను. కానీ వారందరికీ సహాయం అందించేందుకు నేను తిరగలేకపోయాను’ అని ఆమె పంచుకున్నారు. గత నాలుగేండ్లుగా ఆమె బృందం ప్రతిరోజూ సగటున 40 మందికి భోజనాలు వడ్డిస్తోంది.
అవధులు లేని సేవ
జెస్సిలా కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణ మరొక ముఖ్యమైన భాగం. ఆమె బృందం రెండు నెలలకోసారి అడవిని శుభ్రపరచడం, చెట్ల పెంపకంతో పాటు ఉద్యానవన విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్‌లను చేపట్టి యువతలో ప్రకృతి ప్రేమను పెంపొందిస్తుంది. అలాగే పండు గులకు పేదలకు దుస్తులను పంపిణీ చేయడం నుండి అనాథ మృతదేహాలను దహనం చేయడం వరకు జెస్సిలా సేవా కార్యక్రమాలకు అవధులు లేకుండాపో యాయి. ఆమె ప్రయత్నాలు కేవలం తక్షణ ఉపశమనం గురించి మాత్రమే కాదు, మానవత్వం, సంస్కృతిని పెంపొందిం చడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీవిల్లిపుత్తూరు బస్ స్టాప్‌లో వదిలివేయ బడిన వృద్ధ మహిళను ఉదాహరణగా తీసుకోండి. స్థానిక పోలీసులతో కలిసి జెస్సిలా బృందం ఆమెను తన కుటుంబంతో తిరిగి కలిపిం ది. కానీ కొద్ది రోజులకే ఆ కుటుంబం మళ్లీ ఆమెను వదిలివేసింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘మనం మానవత్వాన్ని దాని ప్రధాన భాగంలో పునర్నిర్మించాలి’ అని జెస్సిలా అంటున్నారు. ఆ మాట చెబుతున్నపుడు ఆమె స్వరం దృఢ సంకల్పంతో దు:ఖంతో నిండిపోయింది.
కరుణ అనేది ఓ అంటువ్యాధి
జెస్సిలా సేవా కార్యక్రమాలు చాలా మందిలో ఆశ, క్రియాశీలత విత్తనాలను నాటింది. ఆమె అంకితభావాన్ని చూసి ప్రేరణ పొందిన అనేక మంది యువకులు, పెద్దలు ‘వీ విటమిన్ గ్లోబల్’లో వాలంటీర్లుగా చేరారు. ఒకప్పుడు ఆమె నుండి సహాయం పొందిన వారు కొందరు ఇప్పుడు ఆమె మిషన్‌కు అండగా నిలబడ్డారు. ఈ విధంగా కరుణ అనేది ఓ అంటువ్యాధి అని నిరూపిస్తున్నారు. భవిష్యత్తులో జెస్సిలా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను నిర్మించాలని కలలు కంటున్నారు. ‘చేయాల్సింది ఇంకా చాలా ఉంది’ అని ఆమె నిశ్శబ్ద సంకల్పంతో ప్రకటిస్తున్నారు. వృత్తిరీత్యా ఈవెంట్ ప్లానర్ అయినప్పటికీ జీవితాలను మార్చడంలో, విరిగిన ఆత్మలను బాగుచేయడంలోనే ఆమెకు నిజమైన తృప్తి ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు దు:ఖంలో మునిగిపోయిన గ్రామంలో జెస్సిలా స్థితిస్థాపకత, ఆశకు చిహ్నంగా మారింది. విషాదం ఎదురైనప్పుడు కూడా మనిషిలోని కరుణ ఇతరులకు మార్గాన్ని వెలిగించగలదని ఆమె ప్రయాణం మనకు గుర్తు చేస్తుంది. ఇలా తన ఆశా రెక్కలను విప్పుతూ ఆమె మనందరినీ కలలు కనడానికి, కష్టంలో ఉన్న వారిని ఆదుకోడానికి, మానవత్వ శక్తిని విశ్వసించడానికి ఆహ్వానిస్తున్నారు.