– ఇజ్రాయిల్‌కు అమెరికా సాయం 1790కోట్లు !
– అంతర్జాతీయ నివేదిక వెల్లడి
వాషింగ్టన్ : గాజాలో దాడులను ఆరంభించిన తర్వాత ఇజ్రాయిల్‌కు 1790కోట్ల డాలర్ల మేరకు మిలటరీ సాయం అందించినట్లు బ్రౌన్ యూనివర్శిటీ విడుదల చేసిన కొత్త నివేదిక పేర్కొంది. యుద్ధ వ్యయాల ప్రాజెక్టు పేరుతో ఈ నివేదికను మంగళవారం విడుదల చేశారు. గాజాలో దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రదర్శనలు, కొవొత్తుల ర్యాలీలు, నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. పైగా ఆ ప్రాంతంలో అమెరికా మిలటరీ కార్యకలాపాలకు అదనంగా మరో 4860కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారని పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు. గాజా, లెబనాన్‌ల్లో ఇజ్రాయిల్ దాడులకు మద్దతుగా అమెరికా ఎంత మొత్తం ఖర్చు పెట్టిందో వెల్లడించే అంచనాల్లో ఈ నివేదిక ఒకటిగా వుంది. అయితే పైన పేర్కొన్న సాయం కూడా పాక్షికమేనని పూర్తి స్థాయి సాయం వివరాలను దాచిపెట్టడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు.
గాజాలో 138మంది జర్నలిస్టుల మృతి
గతేడాది కాలంలో గాజాలో ఇజ్రాయిల్ పాల్పడిన దాడుల్లో 138మంది జర్నలిస్టులు మరణిం చారని అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య (ఐఎఫ్‌జె) పేర్కొంది. వీరిలో 127మంది పాలస్తీనియన్ జర్నలి స్టులు కాగా, ఐదుగురు లెబనాన్, నలుగురు ఇజ్రాయిల్, ఒకరు సిరియాకు చెందిన వారు. ఇజ్రాయిల్ ఆర్మీ వీరిని లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. కాగా 32 మాసాల పాటు సాగిన ఉక్రెయిన్ యుద్ధంలో 18మంది జర్నలిస్టులు చనిపోయారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు అనే ఒకే ఒక వ్యక్తి నడుపుతున్న ప్రభుత్వం వల్లనే గాజా, లెబనాన్‌లో యుద్ధాలు జరుగుతున్నాయని పేర్కొంది.