సైకిల్ పాత్రను గుర్తించి ప్రోత్సహించాలనే ఆలోచనను ఇతర దేశాల మద్దతుతో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని స్థాపించే చొరవ తుర్క్‌మెనిస్తాన్ నేతత్వంలో జరిగింది. అత్యంత పురాతనమైన రవాణా సాధనాల్లో సైకిల్ ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. తేలికైన, సమర్థవంతమైన వాహనం ఇది. పిల్లల నుండి వద్ధుల వరకు సైక్లింగ్ అందరికీ ఆహ్లాదకరమైన, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 3న జరుపుకుంటారు. ప్రొఫెసర్ లెస్జెక్ సిబిల్క్సీ (యునైటెడ్ స్టేట్స్‌లో సామాజిక శాస్త్రవేత్త) ప్రచారానికి నాయకత్వం వహించాడు. 56 దేశాల మద్దతును పొందాడు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జూన్ 3, 2018న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది. (అయితే దీని కోసం ఏప్రిల్ 12, 2018న తీర్మానం ఆమోదించబడింది )
శ్రీమంతుడు సినిమా చూశాక చాలామందికి మళ్లీ సైకిల్ తొక్కాలని ఆశమొదలైనట్లుంది. అంతకు ముందు కూడా చాలామంది వాకింగ్, జాగింగ్‌ల కంటే సైక్లింగ్ బెటర్ అనిదానికి ఓటేసినవాళ్లూ ఉన్నారు.
చిన్న పిల్లలకు, సైకిల్ మొదటి కల. గొప్ప బహుమతి కూడా. బైక్‌లు స్కూటర్‌ల వంటి ఇతర వాహనాలను నేర్చుకోవడానికి ఇది మొదటి అడుగు. ఇది సాహసోపేతమైనది. మారుతున్న జీవన విధానం వల్ల మనిషికి శారీరక శ్రమ తగ్గి.. మానసిక ఒత్తిడి పెరుగుతున్నది. ఆహారానికి తగినట్లు వ్యాయామం లేక పోవడంతో ఒంట్లో కొవ్వు పేరుకు పోయి అనేక ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో సైక్లింగ్‌తో శరీరంలోని ప్రతి అవయవమూ కదిలి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవ్చని పరిశోధకులు తేల్చి చెప్పారు.
మెరుపుతీగలా సన్నగా కనిపించటానికి వ్యాయామం, యోగాలని ఎంచుకుంటారు చాలామంది. మొదట్లోని ఉత్సాహం కొద్ది రోజులకు తగ్గి బద్దకించి మానేస్తుంటారు. అలాంటివారు కొత్తదనం కోసం సైక్లింగ్‌ను ఎంచుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల శరీరం దఢంగా తయారవుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కొవ్వు తగ్గి కండరాలు ఉత్తేజితమవుతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అధికబరువు, శ్వాససంబంధిత సమస్యలు చాలామటుకు హద్రోగాలకు కారణమవుతాయి. సైక్లింగ్‌ను ఎంచుకోవటం వల్ల ఈ సమస్య సగానికి సగం తగ్గుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆహారనియమాలకు ప్రాధాన్యమిస్తూ రోజుకు పావుగంట నుంచి అరగంటపాటు నిపుణులు సూచించన మేరకు సైక్లింగ్ చేయడం క్రమంగా బరువు తగ్గటంతో పాటు కొవ్వు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. నిటారుగా కూర్చొని తొక్కడం వల్ల నడుం, వెన్నునొప్పి, తరహా సమస్యలు బాధించవు. ఉదయాన్నే పావుగంట పాటు సైక్లింగ్ వల్ల రోజంతా హుషారుగా గడుస్తుంది. ఒత్తిడి అనిపించినప్పుడు పచ్చని వాతావరణంలో భారం దూరమై మనస్సు తేలిక పడుతుంది.
సైక్లింగ్ వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అధికబరువు సమస్యలు తొలగి సొగసుగానూ కనిపిస్తారు. రోజుకు అరగంట చొప్పన వారంలో మూడురోజులు సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హదయ సంబంధిత ఇతర వ్యాధులూ వచ్చే అవకాశం తగ్గుతుంది. శరీరంలో ఉన్న చెడుకొవ్వును ఈ సైక్లింగ్ పూర్తిగా తగ్గిస్తుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. చర్మవ్యాధులు దరిచేరవు. చర్మకణాలు ఉత్తేజంగా తయారై చెడు కణాలను బయటకు పంపిస్తాయి. ఉపిరితిత్తులకు ఒత్తిడి కలిగి ఉత్తేజంగా ఉఛ్వాసనిశ్వాసలు చేయడం వల్ల గాలి గదులు బలంగా తయారవుతాయి. తద్వారా ఉపిరితిత్తులు, గుండెపని తీరుమెరుగుగా పనిచేస్తుంది. దీనివల్ల ఉపిరితిత్తులకు వచ్చేవ్యాధుల నుంచి 80 శాతం వరకు బయటపడవచ్చునని వైద్యులు చెప్తున్నారు.
సైకిల్ ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా ఇదే అవసరం. రానురాను దీనివాడకం తగ్గిపోతుంది. కేవలం చిన్నారులు మాత్రమే సైకిల్ తొక్కుతూ ఎంజారు చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ రోజూ సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నిత్యం రోడ్లపై వెళ్లే వాహనాల నుంచి హైడ్రోకార్బన్స్, నత్రజని, కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్ లాంటి వాయువులు వెలువడుతాయి. ఇవన్నీ తీవ్రప్రభావం చూపిస్తాయి. అదే సైకిల్ తొక్కడంవల్ల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు.
చిన్నారుల చేత ప్రతిరోజూ వ్యాయామం చేయంచాలంటే చక్కటిమార్గం వారిచేత సైకిల్ తొక్కించడం. ఎదిగే పిల్లలు సైకిల్ తొక్కడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో లాభాలున్నాయి. సైక్లింగ్ ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సైకిల్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అంతే జాగ్రత్త అవసరం. సైకిల్ తొక్కేటప్పుడు ‘స్టాప్ – లుక్- అండ్ స్పీడ్’ మీద ధ్యాస అంత ముఖ్యం.
స్వతంత్రంగా బ్యాలెన్స్ చేసుకుంటూ సైకిల్ తొక్కుతూ ముందుకు సాగడం పిల్లలకు మహాసరదా. పిల్లలు సైకిల్ తొక్కడంలో భద్రత ప్రధానమని, ట్రాఫిక్ నిబంధనలు అన్నీ వర్తిస్తాయని గుర్తించాలి. పిల్లలు సైకిల్ తొక్కడం నేర్చుకునేప్పుడు పెద్దలు చాలా నేర్పుగా ఉండాలి. వారు సిద్ధం కాకుండానే సైకిల్‌ను నెట్టడం, తోయడం అత్యంత ప్రమాదకరం.
సైకిల్ వాడకాన్ని నగరంలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. దీనికోసం ఎన్నో సంస్థలు, కంపెనీలు తమవంతు కషి చేస్తున్నాయి. మార్కెట్‌లో బైక్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా సైకిళ్ల మోడల్స్ వచ్చాయి. సైకిళ్ల తయారీలో ప్రముఖ సంస్థలు కొత్త సైకిళ్లను రూపొందించి ప్రవేశపెట్టాయి.
వీకెండ్ వచ్చిందంటే చాలు నగరంలోని హైటెక్ సిటీతో పాటు పలుప్రాంతాలు సైకిలిస్టులతో నిండిపోతున్నాయి. మారిన తరానికి అనుగుణంగా పలురకాల లేటెస్ట్ మోడల్ సైకిళ్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వీకెండ్స్‌లో చాలామంది ఐటీ ఉద్యోగులు శరీర ఉల్లాసానికి, ఆరోగ్యానికి సైక్లింగ్ చేస్తున్నారు.
ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ రోజును తమ స్వంత పద్ధతులలో జరుపుకుంటారు. వారు సైకిల్ రైడ్ పోటీలను నిర్వహిస్తారు, సైకిల్‌తో పర్యటనలు చేస్తారు.
సైకిల్ పర్యావరణ, ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిది. సాధారణ శారీరక శ్రమ, ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్, మానసిక అనారోగ్యం, మధుమేహం, కీళ్లనొప్పులు మొదలైన అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా సైకిల్ తొక్కడం ఫిట్‌గా ఉండటానికి, జీవనశైలి ఆధారంగా ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి మంచి ఎంపిక.
ప్రపంచ సైకిల్ దినోత్సవం – ఇది రహదారి భద్రతను ప్రోత్సహిస్తుంది. పాదచారుల భద్రత, సైక్లింగ్ మొబిలిటీని రక్షించడం, అలాగే సమాజంలోని అందరికీ సైకిళ్లను ప్రోత్సహించడానికి, శారీరక, మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును బలోపేతం చేయడానికి సైకిల్ రైడ్‌లను నిర్వహించడానికి ఈ రోజు ప్రోత్సహిస్తుంది.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834