– ప్రధాని మోడీకి సీఎం రేవంత్,డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
– పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వండి
– విభజన హామీలు, పెండింగ్ నిధుల విడుదల, కేంద్ర ఆర్థిక సహకారం పై చర్చ
– శాఖల వారీగా వినతులు..
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకార… రెండు రాష్ట్రాల్లోనూ ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హౌదా కల్పిస్తామని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకను గుణంగా ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా కల్పించినట్టు… తెలంగాణలోనూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వాలని కోరారు. మంగళవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఆర్థిక శాఖ చీఫ్ సెక్రెటరీ రామకృ ష్ణారావు లు ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం సాయంత్రం 4:30 నిమిషాలకు ఢిల్లీ లోక్ కళ్యాణ్‌మార్గ్ లోని ప్రధాని నివాసంలో మోడీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిలు మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన దాదాపు 15 అంశాలపై ప్రధానికి వినతి పత్రాలు సమర్పించారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలు, పెండింగ్ బకాయిలు, విభజన హామీలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వివిధ రూపాల్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ. 6, 283 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై ప్రధాని మోడీతో చర్చించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాఖల వారీగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు, హామీ లపై వినతులు ఇచ్చినట్టు వెల్లడించారు.
ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలు…
– రాష్ట్రంలో 14 రోడ్లను నేషనల్ హైవేలుగా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి. ఇందులో కేవలం రెండింటికే ఆమోదం లభించగా… మిగతా 12 రహదారుల అప్‌గ్రేడ్‌కు గ్రీన్ సిగల్ ఇవ్వాలి
– ములుగు కేంద్రంగా ఏర్పాటు అవుతోన్న సమ్మక్క-సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి.
– ఏపీ పునర్విభజన చట్టం-2014 లోపేర్కొన్నట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం (బయ్యారం స్టీల్ ప్లాంట్) ఏర్పాటు చేయాలి. అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు – చేయాల్సి ఉండగా… పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. దానికి అదనంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ నీ ఏర్పాటు చేయాలి.
– 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ప్రకటించిన వాటిని సత్వరమే పునరుద్ధరించాలి
– పీఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌళి పార్కుల్లో వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రకటించాలి. అలాగే ఈ ప్రాజెక్ట్ కు రావల్సినన్ని నిధులు రానందున వెంటనే దానిని గ్రీన్‌ఫీల్డ్‌లోకి మార్చాలి.
– ప్రతి రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలనే ప్రతిపాదన ఆధారంగా… హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి. ఇందుకు కావాల్సిన స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
– ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు సైనిక స్కూల్స్ రాష్ట్ర విభజనతో ఏపీకి వెళ్లిపోయాయి. అందువల్ల తెలంగాణలో కొత్తగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలి.
– దేశ డిఫెన్స్ రంగానికి సంబంధించిన హెడ్ ఆఫీసులు అన్ని ప్రాంతాల్లో ఉన్నా… దక్షిణాదిలో లేనందున పుణెలో ఉన్న హెడ్ ఆఫీసును సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తరలించాలి.
– ఏపీ పునర్విభజన చట్టం 9వ షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థల విభజన, 10 షెడ్యూల్‌లోని సంస్థల అంశాలను పరిష్కరించాలి. ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ/తెలంగాణ భవన్ విభజనకు సహకరించాలి.