– బాధితులకు బిల్డర్ల నుంచి నష్టపరిహారం ఇప్పించాలి
– ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇల్లు కట్టించాలి
– చెరువులను కాపాడేందుకు రాష్ట్ర స్థాయిలో హైడ్రాను విస్తరించాలి : రాష్ట్ర సర్కారుకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా హైదరాబాద్‌లోని చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాకు మద్దతు ఇస్తున్నట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం.పద్మనాభరెడ్డి ప్రకటించారు. అయితే, అదే సమయంలో హైడ్రా ద్వారా నష్టపోయే పేదలకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి ఆయన మంగళవారం లేఖ రాశారు. చెరువుల ఆక్రమణ ఇంత తీవ్ర రూపం దాల్చడానికి సంబంధిత శాఖ అధికారుల పాత్ర కూడా ఉంటుందనీ, వారి పాత్రపైనా విచారణ జరిపించాలని సూచించారు. అధికారులు, బిల్డర్ల కుమ్మక్కుతో అమాయక పేదలు, మధ్యతరగతివారికి తీవ్ర నష్ట జరుగుతున్న నేపథ్యంలో అక్రమ కట్టడాలు కూల్చినప్పుడు బిల్డర్ నుంచి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. అలా కాని పక్షంలో దగ్గరల్లోని ప్రభుత్వ భూమిని కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద వారికి న్యాయం చేయాలని విన్నవించారు. చెరువుల సర్వే నెంబర్లు రిజిస్టర్ చేయవద్దనీ, లేఅవుట్‌లు, ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని చెబుతూ సంబంధిత శాఖలకు నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేయాలనీ, ఆ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లేలా చూడాలని విన్నవించారు. బిల్డర్లతో కుమ్మక్రై తప్పుడు అనుమతులు ఇచ్చిన రిజస్ట్రేషన్, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చెరువులను రక్షించడమే కాకుండా చెరువులోకి వరద వచ్చే కాలువలో అడ్డంకులు లేకుండా, అలాగే మత్తడి బాగుచేసి చెరువు చుట్టూ కంచెవేయాలని సూచించారు. కాలనీల నుండి చెరువుల్లోకి వచ్చే మురుగునీటిని ఎస్టీపీ ద్వారా శుద్ధి చేయాలని విన్నవించారు. చుట్టూ ఉన్న కాలనీవాసులతో చెరువు రక్షణ కమిటీ ఏర్పాటు చేసి, వారికి చెరువు రక్షణ బాధ్యత అప్పగించాలని సూచించారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, తదితర జిల్లాల్లోనూ చెరువులు ఆక్రమణలకు గురైన నేపథ్యంలో హైడ్రాను రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తూ చట్టబద్ధత కల్పించాలని కోరారు.