– కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్‌లాల్ మీనా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బొగ్గు ఉత్పత్తి, రవాణా, వ్యాపార విస్తరణ కోసం సింగరేణి కాలరీస్‌కు పూర్తి సహకారాన్ని అందిస్తామని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్‌లాల్ మీనా అన్నారు. శుక్రవారంనాడిక్కడ సింగరేణి కాలరీస్ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థ చేపట్టే కొత్త గనుల పురోగతిని ప్రోత్సహిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనలో ముందున్నదని చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎమ్‌డీ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలోని మూడు బొగ్గు బ్లాకుల్ని సంస్థకే కేటాయించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి స్పందిస్తూ నిబంధనలకు లోబడి సింగరేణికి మేలు కలిగే విధంగా సహకరిస్తామన్నారు. సింగరేణి భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని హామీ ఇచ్చారు. సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సోలార్, థర్మల్ ప్రాజెక్టుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సింగరేణి చేపట్టిన వ్యాపార విస్తరణ చర్యలైన థర్మల్, సోలార్, జియో థర్మల్, ఓబీ నుంచి ఇసుక ఉత్పత్తి, కమర్షియల్ ఇసుక తయారీ తదితర ప్రాజెక్టులపై అభినందనలు తెలిపారు. సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపేందర్ బ్రార్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి సంతోషి, సింగరేణి డైరెక్టర్లు డీ సత్యనారాయణ రావు, ఎన్‌వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జే ఆల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎమ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.