– శ్రామికవర్గ వ్యతిరేకి మోడీని దించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జాన్‌వెస్లీ
– వనపర్తిలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని సీపీఐ(ఎం) కార్యకర్తల సమావేశం
– ఇండియా కూటమి లక్ష్యం.. బీజేపీ ఓటమి : మంత్రి జూపల్లి
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో అరాచక పాలన సాగిస్తున్న మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే రాచరిక పాలన కొనసాగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జాన్‌వెస్లీ అన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల సీపీఐ(ఎం) జిల్లా కమిటీల విస్తృత స్థాయి సమావేశం వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగింది. వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ(ఎం) నేతలను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవికి మద్దతు తెలియజేస్తున్నట్టు సీపీఐ(ఎం) నేతలు తెలియజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వీరయ్య, జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. లౌకిక ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఏర్పడిన ఇండియా కూటమిలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సీపీఐ(ఎం) మద్దతు ఇస్తుందన్నారు. రెండుసార్లు అధికారం వెలగబెట్టిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. చెప్పుకోవడానికి ఏమీ లేక రాముడి అక్షింతలు, రామాలయం అంటూ ప్రచారం చేస్తుందని విమర్శించారు.
దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే.. ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాని మోడీ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారన్నారు. ఇప్పటి వరకు మెజారిటీ ఉందన్న ధీమాతో ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి అరాచక పాలన కొనసాగిస్తుందని చెప్పారు. ఇప్పుడున్న సీట్ల కంటే మెజార్జీగా 400 ఎంపీ సీట్లను బీజేపీకి అందిస్తే రాజ్యాంగంలో సవరణలు చేపట్టి చట్టాలు చేస్తామని చెబుతున్నారని తెలిపారు. దేశంలో ఇప్పటికే శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా కార్మిక చట్టాలను మార్చిందని తెలిపారు. శ్రామిక వర్గం తమ హక్కులను కాపాడుకునేందుకు ధర్నాలు చేసే వీలులేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిని పూర్తిస్థాయిలో దెబ్బ తీసిందన్నారు.
ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితులు ఏర్పడుతుండటంతో బీజేపీ నేతలు ఒక మెట్టు దిగి రిజర్వేషన్లు కొనసాగిస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హిందూ రాజ్యం, ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అన్న రీతిలో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, పనిచేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో ఇండియా కూటమిలో పనిచేస్తున్న కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని భావించి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సీపీఐ(ఎం) కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
సీపీఐ(ఎం) ప్రజాపోరాటాలే స్ఫూర్తి.. : మంత్రి జూపల్లి
పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్న సీపీఐ(ఎం) ప్రజాపోరాటాలే తమకు స్ఫూర్తి అని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందన్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే 100 శాతం రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఓటమి భయంతో బీజేపీ నేతలు రాముని అక్షింతలు అంటూ ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నారన్నారు. ఈ అక్షింతలు నిరుద్యోగం, పేదరికం, కుల వ్యవస్థ నిర్మూలన సాధిస్తాయా అని ప్రశ్నించారు. వామపక్షాలు, ఇతర ఇండియా కూటమి పార్టీలు, కాంగ్రెస్ ఆలోచన ఒకటేనని, బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యానికి రక్షించాలని చెప్పారు. ఎన్నికల అనంతరం కూడా మిత్రపక్షాల కూటమి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వామపక్షాలతో కలిసి పోతాం : మల్లు రవి
నాగర్‌క్నర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరగానే స్పందించిన ఆ పార్టీ కేంద్ర నాయకత్వం అంగీకారం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ఎల్లకాలం ప్రజా సమస్యలను ఎండగడుతూ ఉద్యమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసే వామపక్ష పార్టీలకు అభినందనలు తెలిపారు. సీపీఐ(ఎం), ప్రజాసంఘాలను కలుపుకుని పోవడం ద్వారా మతతత్వ విధానాలను నిరోధించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి రావడం చారిత్రాత్మక పరిణామ మన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ, కిల్లె గోపాల్, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల కార్యదర్శులు పర్వతాలు, వెంకటస్వామి, నాయకులు పుట్ట ఆంజనేయులు కందికొండ గీత, ఆర్.శ్రీనివాసులు, లక్ష్మి బాల్‌రెడ్డి, నర్మద, మేకల ఆంజనేయుల తదితరులు పాల్గొన్నారు.