మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు. ఈనెల 21, ఉదయం 11:12కి టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆదివారం ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ‘టీజర్‌తో ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో పరిచయం చేస్తాం. సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేశాం. డబ్బింగ్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రమిది. ఇంటిల్లిపాది చూసి నవ్వుకునే వినోదాత్మక సినిమా. మోహనకష్ణ ఇంద్రగంటి అద్భుతంగా తీశారు. ఏడాది ఆఖరులో అందరినీ నవ్విస్తుందీ సినిమా’ అని అన్నారు. నరేష్ విజయకష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం.