ఆద్యంతం వినోదభరితం

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కష్ణ దర్శకుడు. నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్‌ లైట్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై దివ్యాంగ్‌ లవానియా, మురళి కష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ రూల్స్‌ రంజాన్‌’ పేరుతో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందులోని నాలుగో పాటని ప్రదర్శించారు. అలాగే ఈ సినిమాని ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ఏ.ఎం.రత్నం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘వినోదాత్మక సినిమాలకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే సినిమా చూశాను. కుటుంబమంతా కలిసి చూడగలిగేలా ఉన్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘ఈ కథ వినేటప్పుడు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉన్నాను. థియేటర్లలో చూసేటప్పుడు మీరు కూడా అలాగే నవ్వుకుంటారనే నమ్మకం ఉంది’ అని హీరో కిరణ్‌ అబ్బవరం చెప్పారు. నాయిక నేహా శెట్టి మాట్లాడుతూ, ”డీజే టిల్లు’లో రాధిక పాత్ర తర్వాత, ఈ సినిమాలో నేను పోషించిన సనా పాత్ర ప్రేక్షకులను అంతలా మెప్పిస్తుంది’అని తెలిపారు. ‘మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్లకు వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిది’ అని దర్శకుడు రత్నం కష్ణ అన్నారు. నిర్మాతలు దివ్యాంగ్‌ లవానియా, మురళి కష్ణ వేమూరి మాట్లాడుతూ, ‘కష్ణ కథ చెప్పినప్పుడే బ్లాక్‌ బస్టర్‌ని అందిస్తానని నమ్మకం కలిగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ చిత్రాన్ని ఎంతో అందంగా మలిచారు’ అని చెప్పారు.