పోతిరెడ్డిపల్లి జిపిలో నిధుల గోల్మాల్

– ఇంటి పన్నులు, బర్రెల వేలం డబ్బులు స్వాహా చేసిన వైనం
– డిపిఓకు ఫిర్యాదు చేసిన సర్పంచ్ లకావత్ సమ్మక్క
– దర్యాప్తు చేపట్టిన డిఎల్పిఓ ప్రభాకర్
నవతెలంగాణ – రాయపర్తి : కంచె చేను మేసిన చందంగా ఉంది మండలంలోని పోతిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి తీరు… గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టవలసిన కార్యదర్శి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగిన విధంగా గ్రామపంచాయతీ నిధులను స్వాహా చేయడంతో గ్రామ సర్పంచ్ లకావత్ సమ్మక్క వరంగల్ డిపిఓకు ఫిర్యాదు చేయగా గురువారం డిఎల్పిఓ ప్రభాకర్, ఎంపీఓ రాంమ్మోహన్ గ్రామపంచాయతీని సందర్శించారు. కార్యదర్శిని అధికారులు గ్రామపంచాయతీ రికార్డులను అడగగా క్యాష్ బుక్, ఇంటి పన్ను రశీదు బుక్, జిపి తీర్మాన రిజిస్టర్, మినిట్ బుక్ వంటివి ఇంటి దగ్గర ఉన్నావని సమాధానం తెలుపడంతో అధికారులు చేసేదేమీ లేక కార్యదర్శితో రాతపూర్వకంగా పత్రం రాయించుకొని ఉన్నటువంటి రికార్డులను తీసుకొని వెళ్లారు. మిగతా రికార్డులను తదుపరి రోజున ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ డిజిటల్ సైన్ తో గ్రామపంచాయతీ తీర్మానాలు, రికార్డు చేసిన బిల్లుల వివరాలు లేకుండా డబ్బులు డ్రా చేస్తుందని తెలిపారు. గ్రామస్తులు చెల్లించిన ఇంటి పన్నులు, నల్ల పన్నుల డబ్బులు సుమారు 70 వేల రూపాయలను ఎస్టీఓలో జమ చేయకుండా సొంత ప్రయోజనాల కోసం వాడుకుందని ఆరోపించారు. జంగిడి బర్రెలను వేలంపాట వేయగా (హరాజు) వచ్చిన 60 వేల రూపాయలను క్యాష్ బుక్ లో నమోదు చేయకుండా స్వాహా చేసిందని మండిపడ్డారు. గ్రామపంచాయతీ రికార్డులను ఆడిట్ కు పంపించడం లేదని ఆడిట్ కు అధికారులు పిలిచిన మొండిగా వ్యవహరిస్తూ రావడంలేదని తెలిపారు. గ్రామపంచాయతీ రికార్డులను చూస్తే గందరగోళంగా ఉన్నాయని ఇదేంటని అడిగితే తమపైనే కోపంగా మాట్లాడుతుందని బాధను వెళ్లబోసుకున్నారు. గ్రామపంచాయతీ సిబ్బందిని ఈజీఎస్ పనులకు వాడుకుంటూ సిబ్బంది చేసిన పనికి బిల్లులు పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు.