ఆదిలాబాద్ అభివృద్ధికి నిధులివ్వండి

Fund the development of Adilabad– ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్
– సమీకృత కలెక్టరేట్ పనుల పర్యవేక్షణ
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మారుమూల జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ అభివృద్దికి గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిధులు ఇవ్వడం లేదని ఎంపీ గోడం నగేష్ ఆరోపించారు. జిల్లా అభివృద్ధికి నిధులివ్వాలని అన్నారు. మంగళవారం న్యూ హౌజింగ్ బోర్డు కాలనీలో రూ.69 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ సముదాయ పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న విధానాన్ని ఆర్అండ్ బీ ఈఈ నర్సయ్య ఎంపీ, ఎమ్మెల్యేలకు వివరించారు. మ్యాప్ ను పరిశీలించి పనులు నత్తనడకన సాగడంపై ఆరా తీశారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అదే విధంగా ప్రాజెక్టు మేనేజర్ మనోహర్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఫోన్లో మాట్లాడి పనులను సమయంలోగా నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలను శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించారు.
పనులు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం
ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ… జిల్లాలో అసంపూర్తిగా ఉన్న భవనాలు, వివిధ శాఖల రోడ్లపై ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించామన్నారు. గత ప్రభుత్వ హాయంలో అనేక భవనాలకు శంఖుస్థాపనలు అయి పనులు 10 నుంచి 90 శాతం వరకు పూర్తి అయి పనులు మధ్యలోనే నిధులు లేని కారణంగా ఆగిపోయాయన్నారు. ఆ పనులను జరిపించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అదే విధంగా కేంద్రం నుంచి రావాల్సిన ఎలాంటి అనుమతులైన వచ్చే విధంగా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. మారుమూల జిల్లా అయిన ఆదిలాబాద్ కు గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిధులు విడుదల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.
భవనాల నిర్మాణాలు పూర్తిచేసేలా కృషి
ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ… జిల్లా కేంద్రంలో రూ.69 కోట్ల  సమీకృత కలెక్టర్ సముదాయ పనులు ప్రారంభమై సంవత్సరం కావస్తున్న ఇప్పటివరకు 25 నుంచి 30 శాతం వరకే పనులు జరిగాయన్నారు. ఈ విధంగానే పనులు సాగితే ఇంకా నాలుగు సంవత్సరాలు అయిన పనులు పూర్తికావన్నారు. గతంలో మంజూరై శంఖుస్థాపనలు జరిగి మధ్యలో ఆగిన భవనాలను పూర్తి చేసేల కృషి చేస్తామన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. బీసీ, సోషల్ వెల్పర్, పంచాయతీరాజ్, ఐటీడీఏ శాఖల పరిధిలో రోడ్ల పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. నిధులు, ఆలంకాలకు గల కారణాలను తెలుసుకుంటు వాటిని పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. సమైఖ్య పాలనలో ఆంద్రకే నిధులు వెళ్లేవని భావించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. 11 ఏండ్ల తరువాత కూడా అదే వివక్ష కొనసాగుతుందన్నారు. అభివృద్ది కేవలం రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టూపక్కాల నియోజకవర్గాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బీ డీఈ రమేష్, ఏఈ ప్రవీణ్, బీజేపీ నాయకులు ఉన్నారు.