నిధులిచ్చినా ఖర్చు చేయని ఎంపీటీసీలు

నిధులిచ్చినా ఖర్చు చేయని ఎంపీటీసీలు– నిజాంపేట మండలంలో రూ.7.36లక్షల నిధులు మిగులు
నవతెలంగాణ-నిజాంపేట
ప్రజలకు సేవ చేస్తామని.. ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేస్తారు స్థానిక ప్రజాప్రతినిధులు. తీరా అమలులోకి వచ్చేసరికి ప్రభుత్వం వారికిచ్చే నిధులతో ఎలాంటి పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తారు. దీనికి నిదర్శనమే సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో ఎంపీటీసీలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయకపోవడమే. 2023-24 సంవత్సరానికి గాను 15వ ఫైనాన్స్‌ నిధుల కింద నిజాంపేట మండలానికి రూ.8,64,712 మంజూరయ్యాయి. ఎంపీటీసీల పదవీకాలం ముగియడానికి సమయం దగ్గర పడుతున్నప్పటికీ అందులో నుంచి రూ.1,28,201 నిధులను మాత్రమే ఖర్చు చేసి పనులు చేపట్టారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం కేవలం డ్రయినేజీలు, మంచినీటి పైపులైన్లకు మాత్రమే ఈ నిధులను వినియోగించుకోవాలి. కానీ నిధులను సద్వినియోగం చేయకపోవడంతో మంజూరైన నిధుల్లో రూ.7,36,511 మిగిలిపోయాయి. ఎప్పుడో చేయవలసిన పనులను నేటికీ మొదలు పెట్టకపోవడమే నిధులు మురిగిపోవడానికి కారణమని పలువురు వాపోతున్నారు.
ఎన్నికల కోడ్‌ అనంతరం ఎంపీటీసీలు తమకు మంజూరైన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసి పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. అంతేకాదు, ప్రభుత్వాలు ఎంపీటీసీలను చాలా చిన్నచూపు చూస్తాయని, వారికి ప్రత్యేకంగా కార్యాలయం కూడా ఉండదని కొందరు ఎంపీటీసీలు వాపోతున్నారు. వారికి కార్యాలయాలు కేటాయించాలని కోరుతున్నారు.