ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి

– పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి
– దండెంపల్లి సరోజ
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్‌ దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో నల్లగొండ ఎంపీడీవో ఆఫీసులో ఆఫీస్‌ సూపరిండెంట్‌ రవీందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి కేటాయించిన బడ్జెట్‌ రెండు లక్షల కోట్లు ఇవ్వాలని, రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని, కూలీలకు కూలి బందు పథకం ఇవ్వాలని, పని ప్రదేశంలో ఏ వ్యక్తి అయినా చనిపోయిన వారికి నష్టపరిహారం 10 లక్షలు ఎక్సిగ్రేషన్‌ ఇవ్వాలని, వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ పథకాన్ని విస్తరింప చేయాలని, రెండు వందల రోజులు పని దినాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. వికలాంగులకు, వితంతువులకు, ఎస్సీ, ఎస్టీ తరగతులకు ప్రత్యేక పనులు పెట్టడానికి చట్టంలో నిబంధనలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కట్ట అంజయ్య, కార్యదర్శి గోలి నర్సింహ, పట్టణ ఉపాధ్యక్షులు తేలకలపల్లి శ్రీను, సహాయ కార్యదర్శి పనస చంద్రయ్య, దండెంపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.