‘మౌలికానికి’ నిధులు వ్యూహాత్మకం!

”భౌతిక మౌలిక వసతుల కల్పన ” ప్రతీ దేశంలోనూ అత్యంత అవశ్యమైనదిగా అందరూ పరిగణిస్తారు. దేశాభివృద్ధికి అవసరమైన దానికన్నా ఎప్పుడూ మౌలిక వసతులు తక్కువ మోతాదులోనే ఉంటాయని అందరూ అంగీకరిస్తారు. అందుచేత మౌలిక వసతుల కల్పన రంగంలో ఎంత పెట్టుబడి పెట్టినా అది తక్కువే అవుతుందన్నది వారి అభిప్రాయం. ఈ మాదిరి అభిప్రాయం అభ్యుదయవాదులైన మేధావులు సైతం వ్యక్తం చేస్తారు. ఈ కారణంగానే మౌలిక వసతుల కల్పన రంగానికి ఎంత కేటాయించినా మామూలుగా ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. ఆ ప్లానుల అమలు సాధ్యమా కాదా అన్న విషయం గురించి, అవి వాస్తవంగా ఆచరణలోకి వస్తాయా రావా అన్న విషయం గురించి, ఆ ప్రాజెక్టులకు కేటాయించిన బడ్జెట్‌ నంతటినీ ఖర్చు చేయగలుగుతారా లేదా అన్న విషయం గురించి చర్చలు జరుగుతాయే తప్ప అసలు ఆ ప్రాజెక్టులు అవసరమా కాదా అన్న విషయం గురించి చర్చ జరగదు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పన రంగానికి భారీగా కేటాయింపులు పెంచారు. దానిపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్ని యావత్తూ ఖర్చు చేయలేకపోతున్నారన్న విషయం మీద చర్చ జరిగిందే తప్ప అంత ఎక్కువ మొత్తాన్ని కేటాయించడం ఉచితమా కాదా అన్న దాని మీద జరగలేదు. అంత ప్రాధాన్యతను మౌలిక వసతుల కల్పన రంగానికి ఇవ్వడం ఎందుకన్న అంశం మీద చర్చ లేదు. ఈ రంగాన్ని అత్యంత ‘పవిత్రమైన’ రంగంగా, ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని రంగంగా భావించడం వల్లే ఆ విధంగా జరుగుతోంది. భౌతిక మౌలిక వసతుల కల్పన ఏ మోతాదులో ఉండాలనేది ఒక దేశం అమలు చేసే ఆర్థికాభివృద్ధి వ్యూహం బట్టి ఉండాలి. అంతే తప్ప ఆయా దేశాల ప్రత్యేక పరిస్థితులతో నిమిత్తం లేకుండా అన్ని దేశాలకూ, అన్ని కాలాలకూ ఒకే విధమైన ప్రాధాన్యతతో మౌలిక వసతుల కల్పన రంగం ఉండకూడదు. సామ్రాజ్యవాదం విస్తరిస్తున్న కాలంలో పోర్టుల నిర్మాణం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగంగా ఉండేది. భారతదేశాన్ని సామ్రాజ్యవాదులు ఆక్రమించుకున్నప్పుడు సముద్ర మార్గాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం జరిగే అవకాశాలు పెరిగాయి. సంపన్న దేశాలకు కావలసిన ముడిపదార్థాలను ఎగుమతి చేయడానికి, సంపన్న దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను మార్కెట్లకు తరలించడానికి పోర్టుల అవసరం చాలా రెట్లు పెరిగింది. అందుకే వలసదేశాల్లో అంతకు ముందెన్నడూ లేనంత ఎక్కువగా పోర్టుల నిర్మాణం అవసరం ముందుకొచ్చింది. అదే పదహారో శతాబ్దంలో పాలించిన షేర్‌ షా సూరి కూడా తన హయాంలో మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ వనరులు కేటాయించాడు. అయితే అతడు ఎక్కువగా రోడ్ల నిర్మాణానికి కేటాయించాడు. ఎందుకంటే అప్పటి ఆర్థిక వ్యూహంలో రోడ్ల ద్వారా సుదూర వ్యాపారం చేయడం ప్రధాన భాగం అయింది. అంత ప్రాధాన్యత సముద్ర వ్యాపారానికి అతను ఇవ్వలేదు. పోర్టులకు ఇచ్చినట్టే రైల్వే లైన్ల నిర్మాణానికి కూడా బ్రిటిష్‌ పాలనా కాలంలో అధిక ప్రాధాన్యతనిచ్చారు. మన దేశంలోని ముడి పదార్థాలను రేవు పట్టణాల వరకూ తరలించడానికి అవి అవసరమయ్యాయి. వాటి నిర్మాణంలో పెట్టుబడులు పెట్టే ప్రయివేటు కంపెనీలకు లాభాలు గ్యారంటీ ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే ఎవరు ఎందుకోసం మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చినా, అంతిమంగా అది దేశానికి లాభమే కదా ఎప్పటికైనా వాటిని నిర్మించాల్సినదే కదా అని వాదించవచ్చు. అయితే భవిష్యత్తులో ఎప్పటికో అవసరం కావచ్చు అన్న పేరుతో మనకున్న పరిమితమైన వనరులను ఎక్కువ ఫలితాలు రాబట్టేలా, మన ఆర్థికవ్యూహం సక్రమంగా అమలు జరిగేలా వినియోగించడం మానేసి మౌలిక వనరుల రంగానికే కేటాయించడం సరైనది కాదు. దానివల్ల ఎక్కడ ఉపాధి కల్పన తక్షణం అవసరమో అక్కడ కల్పించడం సాధ్యం కావడం లేదు. ఇదే కార్ల్‌ మార్క్స్‌ అయితే ఉత్పత్తి శక్తుల ఆధునీకరణను ఎప్పుడూ సమర్థిస్తాడు గనుక తక్షణమే ఉపయోగపడని మౌలికవసతుల కల్పన ప్రాజెక్టులకోసం చేసే కేటాయింపులను కూడా బలపరిచివుండేవాడు అన్న అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఉదాహరణకు- బ్రిటిష్‌ వారు భారతదేశంలో రైల్వేల నిర్మాణం చేపట్టినప్పుడు ఆ రైల్వేలు తక్షణమే వలస పాలకుల దోపిడీకి తోడ్పడేవే అయినా దీర్ఘకాలంలో భారత సమాజం ఆధునీకరణకు ఆ రైల్వేలు దోహదం చేస్తాయి గనుక దానిని మార్క్స్‌ సమర్థించి ఉండేవాడు అని వారంటారు. కాని న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికకు మార్క్స్‌ రాసిన ఒక వ్యాసంలో ఈ తరహా ఆధునీకరణకు పూర్తి వ్యతిరేకతను వెలిబుచ్చాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు ఇండియాలో నిర్మిస్తున్న రైల్వేలు భారతీయులకు ఎందుకూ పనికిరావు అని కూడా అన్నాడు. అయితే… దానర్థం రైల్వేలు అసలు ఏ మాత్రమూ భారతీయులకు ఉపయోగపడవు అన్నట్టుగా మనం తీసుకోకూడదు. రైల్వేలు ప్రస్తుతం భారతీయులకు ఉపయోగకరంగా ఉండడమే కాదు, వాటిని ప్రారంభించిన తొలి దినాల్లో కూడా మనకు ఉపయోగపడ్డా యన్నది వాస్తవం. ఆ కాలంలో మన దేశ వనరులను కొల్లగొట్టడం కోసమే వాటిని ప్రారంభించి ఉండొచ్చు. కానీ అవి భారతీయులకు ఎందుకూ పనికిరావు అని చెప్పడం కొంత అతిగా ఉంది. అయితే ఇక్కడ మార్క్స్‌ నొక్కిచెప్ప దలచుకున్న అంశం వేరు. ఆనాటి కాల మాన పరిస్థితుల్లో భారతీయులకు రైల్వేల నిర్మాణం అంత ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. అది అప్పటి వలస పాలకులకు ప్రాధాన్యత కల అంశం. అందుకే వాటి నిర్మాణం చేపట్టడం జరిగింది. అందుకోసం ఇక్కడి వనరులను కూడా ఎక్కువగా ఖర్చు చేయడం జరిగింది. అదే భారతీయులకే స్వేచ్ఛ ఉండివుంటే వారు ఆనాడు అంతంత భారీ వనరులను రైల్వేలకోసం కేటాయించి ఉండేవారు కాదు. మౌలిక వసతుల స్థాయి ఒక దేశంలో ఎప్పుడైనా, అప్పటి అవసరాలకన్నా కొంత తక్కువగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెట్టి ఆ కొరతను అధిగమించాల్సివుంటుంది. అయితే ఎంత మోతాదులో ఆ పెట్టుబడులు ఉండాలి అన్నది ఆనాడు ఆ దేశం రూపొందించుకున్న ఆర్థికాభివృద్ధి వ్యూహం బట్టి నిర్ణయించబడాలి. అంతే తప్ప ఎంత ఎక్కువ పెట్టుబడి మౌలికవసతుల కల్పన రంగంలో పెట్టినా అది తక్కువే అన్న దృక్పథం కూడదు. ప్రస్తుతం నయా ఉదారవాద దశలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితి ఒక ప్రత్యేకమైన డిమాండ్‌ను సృష్టించింది. ఆ డిమాండ్‌ వ్యక్తమైన ఒకానొక రూపం విమానయాన రంగంలో రద్దీ విపరీతంగా పెరగడం. ఈ రద్దీకి తగినట్టు విమానాశ్రయాలను ఆధునీకరించడం, కొత్తవి నిర్మించడం, పాత వాటిని పునరుద్ధరించడం వంటివి చేపట్టడం అవసరమైంది. ఆ విధంగా చేయకపోతే రద్దీ మరింత పెరిగిపోయేది, ప్రయాణీకులు మరింతగా ఇబ్బందులు పడేవారు. ఈ వాస్తవ పరిస్థితిని చూపించి విమానాశ్రయాల నిర్మాణానికి ఎక్కువ పెట్టుబడులు కేటాయించడాన్ని సమర్థించుకోవచ్చు. ఇటువంటి కేటాయింపులను ఎవరూ వ్యతిరేకించరు. అది ప్రభుత్వ రంగంలో జరిగినా, లేక ప్రయివేటు పెట్టుబడులతో జరిగినా అందుకు అభ్యంతరం వ్యక్తం కాదు. కానీ ఈ పెట్టుబడుల కేటాయింపు అనేది కచ్చితంగా నయా ఉదారవాద ఆర్థిక వ్యూహానికి తగినట్టుగా ఉంది. అదే ఈ దేశంలో ఆర్థిక సమానత్వం సాధించే లక్ష్యంతో వేరే ఆర్థిక వ్యూహం చేపడితే అప్పుడు విమాన ప్రయాణాలకు డిమాండ్‌ తక్కువగా ఉంటుంది. విమానాశ్రయాల వద్ద రద్దీ తక్కువగా ఉంటుంది. అప్పుడు వాటిని ఆధునీకరించడం కోసం ఇంత భారీగా కేటాయింపులు చేయనవసరం ఉండదు. ఆర్థిక వ్యూహానికి, మౌలిక వసతుల రంగానికి కేటాయింపులు పెంచాలన్న డిమాండ్‌కి ఏ సంబంధమూ లేదన్న వైఖరి తీసుకోవడం ద్వారా ఆ డిమాండ్‌ వర్గ స్వభావాన్ని మరుగు పరుస్తున్నారు. అంటే మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులు పెంచాలన్న డిమాండ్‌ కూడా వర్గ డిమాండ్‌గానే పరిగణించాలి. ఆ డిమాండ్‌ అతి పవిత్రమైనదనో, వర్గాలకు అతీతమైనదనో అనుకుంటే అప్పుడు జరుగుతున్న అభివృద్ధి వర్గ స్వభావాన్ని మనం గుర్తించలేం. మన జీడీపీలో కనీసం మూడు శాతం కూడా వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించడం సాధ్యం కాదు అని, విద్యారంగానికి కనీసం 6శాతం కూడా కేటాయించడం కుదరదని పాలకులు చెపుతున్నారు. ఆర్థిక వనరుల కొరత కారణంగా ఆ విధమైన కేటాయింపులు చేయడం కుదరడంలేదని వారు అంటున్నారు. అదే మౌలిక వసతుల కల్పన రంగం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ మాట అనడంలేదు. నిజానికి ముందు మౌలిక వసతుల రంగానికి అధిక కేటాయింపులు చేసిన తర్వాతనే ఆర్థిక వనరుల కొరత గురించి మాట్లాడటం మొదలుపెడుతున్నారు. ఇలా విద్య, వైద్యం రంగాలను నిర్లక్ష్యం చేయడం అసమానతలను మరింత పెంచే ఆర్థిక వ్యూహంలో భాగమే. ప్రజల సంక్షేమానికి చేయవలసిన ఖర్చును బాగా తగ్గించి అలా మిగిల్చిన వనరులను మౌలిక వసతుల కల్పన రంగానికి కేటాయిస్తున్నారు. అందులో ప్రయివేటు పెట్టుబడిదారులు బాగా దోచుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యూహాన్ని మార్చినప్పుడు పాలకులు చెప్పే వాదనలు పని చేయవు. అయితే ఆర్థిక వ్యూహం మారాలంటే అందుకు శ్రామిక వర్గ ప్రజానీకాన్ని యావత్తూ సంఘటితం చేసి కదిలించగలగాలి. అంతా ఎందుకు కదిలి పోరాడాలో ఆ శ్రామిక వర్గానికి అర్థం కావాలంటే వారికి ఈ మౌలిక వసతుల కల్పన రంగానికి చేస్తున్న అధిక కేటాయింపుల వెనుక ఉన్న వర్గ వ్యూహం ఏమిటో బోధపరచాలి.
(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్‌ పట్నాయక్‌