ఓబీసీ ఫెలోషిప్‌కు నిధుల్లేవ్‌

ఓబీసీ ఫెలోషిప్‌కు నిధుల్లేవ్‌– ఆందోళనలో ఎంఫిల్‌, పీహెచ్‌డీ స్కాలర్లు
మత రాజకీయాలను జనం నమ్మటంలేదు. ఇపుడు బీజేపీ ఓబీసీ అంశాన్ని తెరపైకి తెచ్చి లబ్దిపొందాలనుకుంటోంది. కానీ ఓబీసీ వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రం పైసలివ్వటంలేదు. నిధుల కొరతతో ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేసే ఓబీసీ పరిశోధకులకు ఇచ్చే ఫెలోషిప్‌లు అందక.. ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అధికారంలోకి వచ్చినప్పటినుంచి మోడీ ప్రభుత్వం ఏదో ఒక కొత్త పథకాన్ని తెరపైకి తేవటమో లేక ఉన్న పథకాలకు పేర్లుమార్చటమో చేస్తోందన్నది జగమెరిగిన సత్యం. నిధుల కొరతతో ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేసే ఓబీసీ పరిశోధకులకు ఇచ్చే ఫెలోషిప్‌లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఆ వర్గాల పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2014లో ఓబీసీకి ఎంఫీల్‌, పీహెచ్‌డీ స్కాలర్‌లకు సహాయం చేయడానికి స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రారంభించింది. కానీ స్టైఫండ్‌లలో జాప్యం పెరుగుతోంది. మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని స్కాలర్లు ఆరోపిస్తున్నారు. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) వెనుక బడిన తరగతులకు చెంది జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన 1,000 మంది కొత్త స్కాలర్‌లకు జాతీయ ఫెలోషిప్‌ (ఎన్‌ఎఫ్‌ఓబీసీ) ఇస్తుంది. వీరిలో 75 శాతం మంది సామజిక శాస్త్రాల నేపథ్యం ఉన్నవారై ఉంటారు. మిగిలిన వారు సైన్స్‌ స్కాలర్లుగా ఉంటారు. ఈ పథకంలో ఇంటిగ్రేటెడ్‌ ఎంఫీల్‌, పీహెచ్‌డీ అభ్యసించే విద్యార్థులకు ఐదేండ్ల ఫెలోషిప్‌, ఇతర ప్రోగ్రామ్‌ల కోసం రెండేండ్ల ఫెలోషిప్‌ ఉంటుంది. స్టైఫండ్‌ నెలవారీగా యూజీసీ ప్రమాణాలకు సమానంగా ఉంటుంది. అయితే ఓబీసీ ఓఠ్లకు గాలం వేస్తున్న ప్రభుత్వ ఈ సంవత్సరం ఈ మొత్తాన్ని నెలకు రూ. 37,000కి పెంచింది. కానీ ఇవ్వటం లేదని, బకాయిలు పేరుకుపోతున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.
నోడల్‌ ఏజెన్సీ మార్పు తరువాత బకాయిలు
మొదట్లో ఎన్‌ఎఫ్‌ఓబీసీకి నోడల్‌ ఏజెన్సీగా యూజీసీ ఉండేది. అయితే జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక,అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) లేదా మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఎన్‌బీసీఎఫ్‌డీసీ గత ఏడాది అక్టోబర్‌లో ”సవరించిన విధానం” కింద బాధ్యతలు చేపట్టింది. ఈ మార్పు తరువాత బకాయిలు అధ్వాన్నంగా పెరిగాయని పరిశోధకులు అంటున్నారు.
వందకు పైగా వర్సిటీల్లో జాప్యం…
ఎన్‌ఎఫ్‌ఓబీసీ పథకం లబ్దిదారులు మంత్రిత్వ శాఖకు పదేపదే ఫిర్యాదు చేశారని జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్న నయన్‌ ధావల్‌ నిర్వహించిన సర్వే తెలిపింది. 100కి పైగా విశ్వవిద్యాలయాలలోని 223 మంది స్కాలర్‌లలో దాదాపు 70 శాతం మంది జాప్యాన్ని ఎదుర్కొన్నారని పేర్కొంది. ”ఇది యూజీసీ కింద ఉన్నప్పుడు ఒకటి-రెండు నెలల ఆలస్యం జరిగేది. కానీ అది పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలతో క్లియర్‌ చేసేంది. ఎన్‌బీసీఎఫ్‌డీసీకి మార్చిన తరువాత నుండి పరిస్థితులు మరింత దిగజారాయి. ఐదు లేదా ఆరు నెలల తరువాత, మేం ఒక నెల మాత్రమే స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని పొందుతాం” అని రాజస్థాన్‌లోని రాజ్‌ రిషి భర్తిహరి మత్స్య విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో రీసెర్చ్‌ స్కాలర్‌ వెంకటేష్‌ యాదవ్‌ అన్నారు. ఆయన దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ ఫెలోషిప్‌ లబ్దిదారుగా ఉన్నారు.
‘నిధుల కొరత’
ఫెలోషిప్‌ విడుదలలో ఆల స్యం జరగ టానికి ”నిధుల కొరత” కారణ మని ఎన్‌బీసీఎఫ్‌డీసీలోని ఒక అధికారి తెలిపారు. ”ఈ పథకానికి ఏడాదికి కేటాయించిన మొత్తం నిధులలో 25 శాతానికి మించి ఒక విడతలో విడుదల చేయకూడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ నియమం కలిగి ఉంది. కాబట్టి డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది. కానీ మేం ఈ పథకం కింద ఒక సంవత్సరం మొత్తంలో కూడా ఈ 25 శాతాన్ని విడుదల చేయలేకపోయాం” అని అధికారి తెలిపారు. ”మేం విద్యార్థుల నుంచి క్లెయిమ్‌లను స్వీకరించిన తరువాత, మేం మంత్రిత్వ శాఖకు డిమాండ్‌ను పంపుతాం. ఆ తరువాత మంత్రిత్వ శాఖ మాకు మూడు నెలలకు నిధులను పంపుతుంది” అని తెలిపారు.ఈ ఫెలోషిప్‌ కింద 2022-23లో రూ.51 కోట్లు, 2021-22లో రూ.55 కోట్లు, 2020-21 రూ.33 కోట్లు, 2019-20లో రూ. 52 కోట్లు ఖర్చు చేసినట్టు ఆగస్టులో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. ఈ ఏడాది 2023-24 మూడో త్రైమాసికం వరకు రూ.40.11 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం 1,700 మంది ఈ ఫెలోషిప్‌ లబ్ధిదారులు ప్రతి నెలా దాదాపు రూ.8 కోట్ల స్టైఫండ్‌లతో ఉన్నారని, ఈ మొత్తం అవసరం కంటే తక్కువగా ఉందని అధికారి పేర్కొన్నారు.
”మేం ఈ పథకం కోసం సవరించిన బడ్జెట్‌ అంచనాను మంత్రిత్వ శాఖకు పంపాం. దీనికి సంబంధించి సానుకూల స్పందన వచ్చింది” అని అధికారి తెలిపారు.
ఓట్లు కోసం ప్రధాని ఓబీసీ జపం: ఎస్‌ఎఫ్‌ఐ
ఓట్ల కోసమే ప్రధాని మోడీ ఓబీసీ జపం చేస్తున్నారని, కానీ వాస్తవానికి ఆ వర్గాల విద్యార్థులకు ద్రోహం చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్‌ బిశ్వాస్‌ విమర్శించారు. నిధుల కొరతతో ఎన్‌ఎఫ్‌ఓబీసీ ఫెలోషిప్‌లు విడుదలలో జాప్యంపై వారు స్పందించారు. ఓబీసీల పట్ల ప్రధాని మోడీ సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని, ఆ వర్గాలకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రధాని మోడీ ఓబీసీ జపం చేస్తున్నారే, కానీ విద్యార్థులకు ఫెలోషిప్‌లు విడుదల చేయటం లేదని దుయ్యబట్టారు.
ప్రధాని మోడీ విమానం కొనుగోలకు రూ.12 వేల కోట్లు,షర్ట్‌ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేశారని, ఓబీసీల స్కాలర్‌షిప్‌లను మాత్రం నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఫెలోషిప్‌లు నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. వెనుకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేయడం మనువాద ఆలోచనా విధానమని దుయ్యబట్టారు.