స్టార్టప్‌లకు నిధులు డల్‌

స్టార్టప్‌లకు నిధులు డల్‌– గతేడాది డిసెంబర్‌ త్రైమాసికంలో ఏడేండ్ల కనిష్టానికి
– ‘ట్రాక్‌ఎక్స్‌ఎన్‌’ సమాచారం
న్యూఢిల్లీ : గతేడాది భారతీయ స్టార్టప్‌లు నిధుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. గతేడాది డిసెంబర్‌ త్రైమాసికంలో స్టార్టప్‌లకు నిధులు ఏడేండ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కారణం..2016 మూడో త్రైమాసికంలో నమోదైన పేలవ పనితీరు తర్వాత అతి తక్కువ ఈక్విటీ పెట్టుబడిని అందుకోవటమే. ఈ విషయాన్ని ట్రాక్‌ఎక్స్‌ఎన్‌ సమాచారం నివేదించింది. ”ఏడేండ్ల కనిష్టం అనేది భారత్‌కు ప్రత్యేకమైనది కాదు. కానీ యూఎస్‌, యూకే, ఆగేయాసియాతో సహా ప్రధాన భౌగోళిక ప్రాంతాలలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా నిధులలో ఇదే అత్యల్పంగా ఉన్నది” అని ట్రాక్‌ఎక్స్‌ఎన్‌ సహ వ్యవస్థాపకులు నేహా సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ స్టార్టప్‌లు 2023లో నిధుల సేకరణలో దాదాపు 73 శాతం క్షీణతను చవిచూశాయి. అంతకుముందు సంవత్సరం స్టార్టప్‌లకు 2022లో రూ.2.07 లక్షల కోట్లకు పైగా నిధులు అందగా.. అవి ఈ ఏడాది రూ.58 వేల కోట్లకు పడిపోవటం గమనార్హం. ఇందులో, ఫిన్‌టెక్‌, రిటైల్‌, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్‌లు, ఎన్విరాన్‌మెంట్‌ టెక్‌, స్పేస్‌ టెక్‌ వంటి అగ్రగామి నిధులతో కూడిన రంగాలున్నాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిధులు సమకూర్చే భౌగోళిక ప్రాంతాలలో భారత్‌ ఐదో స్థానానికి పడిపోయింది. ఇది 2022, 2021 రెండింటిలోనూ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం.