– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బస్వాపుర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కొరకు రూ.500 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధుల విడుదల కోసం ఈనెల 20వ తేదీన భువనగిరి జిల్లా కేంద్రంలోని “రైతు బజార్ దగ్గర ” నిర్వహిస్తున్న ” సామూహిక నిరసన దీక్షలో ” రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆదివారం సీపీఐ(ఎం) ఇంటింటి కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకోవడం జరిగిందనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడానికి నిర్మాణం చేపట్టిన బస్వాపూర్ ప్రాజెక్టు చివరి దశలో ఉన్నదని అన్నారు. గత పాలకులు నిర్వాసితులను ఆదుకోవడంలో విఫలమతే ఈ ప్రభుత్వం కూడా నిర్వాసితులను ఆదుకునే విషయంలో, ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఉదాసీనతతో వ్యవహరిస్తుందని అన్నారు. గతంలో రిజర్వాయర్లో కొన్ని నీళ్లు నింపడంతో బస్వాపురం, ముత్తిరెడ్డిగూడెం, గంగసానిపల్లి, రాయగిరి చెరువులు నింపడం వల్ల ఆయా గ్రామాల రైతులకు సాగుకు నీరు ఉపయోగపడిందని అన్నారు. ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత బసవపురం రిజర్వాయర్ లోకి చుక్కనీరు కూడా తేవడం లేదని, ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి యాదగిరిగుట్ట మండలాలకు సంబంధించిన చెరువులు మాత్రం నింపుతున్నారని మరి ఈ ప్రాంతంలో ఎందుకు చెరువులను నింపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటితో ఈ ప్రాంత చెరువులను కూడా నింపాలని కోరారు. ముంపు గ్రామాలకు నష్టపరిహారంతో పాటు, ప్రాజెక్టు పూర్తి కోసం కూడా నిధులు విడుదల చేయాలని వీటి సాధన కోసమే సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలో రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ముంపు గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండా అశోక్, గ్రామ కార్యదర్శి కూకుట్ల కృష్ణ లు పాల్గొన్నారు.