శవగోస..!

– రైలు ప్రమాద మృతదేహాల అప్పగింతలో జాప్యం
– డీఎన్‌ఏ పరీక్షలంటూ కాలయాపన
– శవాగారాల వద్ద బంధువుల పడిగాపులు
– ట్రాక్‌ పునరద్ధరణపైనే కేంద్రం దృష్టి
ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం జరిగి ఐదు రోజులు దాటింది. కేంద్రం, రైల్వే మంత్రిత్వ శాఖ ఆఘమేఘాల మీద ప్రమాదస్థలి పునరుద్ధరణ పనులు చేపట్టి, ఆ మార్గంలో రైలు ప్రయాణాన్ని అనుమతించింది. దుర్ఘటన ఆనవాళ్లన్నింటినీ తుడిచేసి, ఈ ప్రమాదంలో తమ అసమర్థత ఏమీ లేదని చెప్పే ప్రయత్నాన్ని కేంద్రం కొనసాగించింది. కానీ బాలాసోర్‌ ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ఇంకా సమస్యగానే మిగిలివుంది. ఆనవాళ్లు గుర్తుపట్టకుండా మారిపోయిన మృతదేహాలను గుర్తించడంలో బంధువులు, కుటుంబసభ్యులు గందరగోళానికి గురవుతున్నారు. మృతదేహం తమవారిదంటే…కాదు తమ వారిదంటూ వాదనలు జరుగుతున్నాయి. దీనితో డీఎన్‌ఏ పరీక్షలు చేసి మృతదేహాలు అప్పగిస్తామంటూ పోలీసులు ప్రకటించారు. ఫలితంగా మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమవుతున్నది. మృతదేహాల కోసం వచ్చిన వారు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తుంటే…కేంద్రం మాత్రం రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణను ఏదో ఘనకార్యం చేసినట్టు ప్రచారం చేసుకోవడాన్ని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.
భువనేశ్వర్‌ : బాలాసోర్‌ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల రాకతో వివిధ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఆ శవం మా వాడిదేనని ఒకరంటే కాదు…కాదు మా బంధువుది అంటూ మరొకరు ముందుకు వస్తున్నారు. ఇలా ఒక మృతదేహం కోసం పలువురు పోటీ పడుతుండడంతో ఏం చేయాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిజనిర్ధారణ కోసం వారు బంధువుల డీఎన్‌ఏ నమూనాలు సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాల గుర్తింపులో గందరగోళం ఏర్పడిన ప్రతిసారీ డీఎన్‌ఏ పరీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని భువనేశ్వర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ విజరు అమృత్‌ కులంగే తెలిపారు. ఒకే మృతదేహం కోసం పలువురు పోటీ పడుతున్న సందర్భాలు కన్పిస్తున్నాయని ఆయన చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షలు జరిపేందుకు ఎయిమ్స్‌లో ఓ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 20 మంది నుండి నమూనాలు సేకరించారు. ఇదిలావుండగా మృతుల సంఖ్యను రైల్వే శాఖ సవరించింది. తొలుత 288 మంది చనిపోయారని ప్రకటించి ఇప్పుడు ఆ సంఖ్యను 275గా చూపుతోంది. బాలాసోర్‌ జిల్లా కలెక్టర్‌ పంపిన తుది నివేదిక ప్రకారం 193 మృతదేహాలను భువనేశ్వర్‌ పంపామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా చెప్పారు. శవాలకు డీఎన్‌ఏ పరీక్షలు కూడా చేస్తున్నామని, ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది మృతదేహం తమ బంధువుదేనని చెబితే అప్పుడు వారికి కూడా పరీక్ష చేసి నిజనిర్ధారణ చేస్తామని వివరించారు.
ఒడిశాలో మరో రైలు ప్రమాదం
 ఆరుగురు కార్మికులు మృతి..
 ఈదురుగాలులకు కదిలిన గూడ్స్‌ రైలు బోగీలు..
ఝాజ్‌పూర్‌: ఒడిశాలో వరుసగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌,హౌరా బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ లు బాలాసోర్‌ వద్ద ఘోర ప్రమాదంలో 300 మందికి పైగా చనిపోయిన విషయం విదితమే. తాజాగా బుధవారం మరో రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడి ఝాజ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గూడ్స్‌ రైలుకు చెందిన నిరుపయోగ బోగీ చక్రాల కింద నలిగి ఆరుగురు కార్మికులు మృతి చెందగా..మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.