మార్కెట్లకు ఎట్టకేలకు లాభాల బాట

Markets are finally taking a profit– సెన్సెక్స్‌ 1397 పాయింట్ల ర్యాలీ
– సుంకాల నిలిపివేత ప్రభావం
ముంబయి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పలు దేశాలపై విధించిన సుంకాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించడం భారత మార్కెట్లకు మద్దతునిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించొచ్చనే అంచనాలు తదితర కారణాలు దలాల్‌ స్ట్రీట్‌ భారీ లాభాలకు కలిసివచ్చాయి. దీంతో ఇటీవల కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న మార్కెట్లకు ఎట్టకేలకు ఉపశమనం లభించినట్లయ్యింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1397 పాయింట్లు లేదా 1.81 శాతం పెరిగి 78,583కి చేరింది. ఇంట్రాడేలో దాదాపు 1450 పాయింట్లు లాభపడి 78,659 గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 50 సూచీ 387 పాయింట్లు లాభపడి 23,739 స్థాయి వద్ద ముగిసింది. కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించడంతో మార్కెట్లలో విశ్వాసం పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.5.5 లక్షల కోట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌ సూచీలు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉండగా.. మరోవైపు ఐటీసీ హోటల్స్‌, జొమాటో, నెస్లే ఇండియా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, మారుతీ సుజుకి సూచీలు అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.