మార్క్స్‌ స్ఫూర్తితో మరింత ముందుకు..!

మార్క్స్‌ స్ఫూర్తితో మరింత ముందుకు..!”అతడు తనకోసమే శ్రమించినట్లయితే బహుశా గొప్ప పండితుడుగా, గొప్ప జ్ఞానిగా, మంచి కవిగా ప్రసిద్ధి చెందవచ్చు. అతనెప్పటికీ పరిపూర్ణుడు, సిసలైన గొప్ప వ్యక్తిగా ఉండజాలడు” అని విస్పష్టంగా తన పదిహేడవ యేటనే చెప్పిన మార్క్స్‌, ఆచరణలో మానవాళి కోసం జీవితాంతం శ్రమించిన, ఆలోచిం చిన మహనీయుడు. ఇది పూలబాటకాదని తెలుసతనికి, రాళ్లతో నిండినదనీ తెలుసు. ”జీవితంలో అన్నింటికీ మించి మానవాళికోసం శ్రమించగల స్థానం మనం ఎంచుకున్నట్లయితే, ఏ బరువులూ మనల్ని కుంగదీయ లేవు” అని చెప్పగలిగిన యువ మార్క్స్‌ను చూసినపుడు, అతని భవిష్య దృష్టి మనకర్థమవుతుంది.
సాధించినదానిపట్ల నిరంతర అసంతృప్తి, పరిపక్వత కోసం ఎడతెగని శోధన అతని విశిష్ట లక్షణాలు. కళాసాహిత్యాలపై లోతైన విశ్లేషణ ఇప్పటికీ మనకు దారిచూపుతూనే ఉంటుంది. నూతన భావాల ఆవిర్భావానికి తరగని ధార అయిన సృజనాత్మకత ఉత్తేజానికి ప్రేరణగా ఉండే సామర్థ్యాలను వ్యక్తిలో వృద్ధి చేసేది కళే అని చాటి చెప్పాడు. మార్క్స్‌ పూర్తిగా కళామయ వాతావరణంలో బాల్యం నుండీ పెరిగాడు. మార్క్స్‌ చివరి వరకూ అధ్యయనాన్ని ఆపలేదు. జీవిత చరమాంకంలో కూడా కొత్త భాషలు నేర్చుకోవడానికి పూనుకున్నాడు. అపారమైన అధ్యయనం, అపారమైన రచన ఆయన సొంతం. ప్రపంచ మానవాళి విముక్తి కోసం పనిచేసిన మార్క్స్‌ దుర్భర దారిద్య్రాన్ని అనుభవించాడు. అత్యంత ధనిక కుటుంబం నుండీ వచ్చిన జెన్నీ, మార్క్స్‌తోపాటుగా కష్టాలు, బాధల్ని పంచు కుంది. ఆఖరికి దారిద్య్రంలో, తిండిలేక ఆకలితో అలమటించారు. అనారోగ్యాలతో పిల్లలూ మరణించారు. ఇంతటి ఇక్కట్లలోనూ తన పనిని వొదిలిపెట్టక, మరింత పట్టుదలతో చేశాడు మార్క్స్‌. ఆయన జయంతి సందర్భం గా, ఒక తత్త్వవేత్త, సామాజిక విప్లవ సిద్ధాంతకర్త ఎలా రూపుదిద్దుకున్నాడో అధ్యయ నం చేయాలి. అలాంటి జీవితాలు, నిరాశా నిస్పృహలు, ఓటములు, బలహీనతలు, తిరోగమన ఆలోచనలు ఎదురైనపుడు వాటిని ఎదుర్కొనే ఉత్సాహాన్ని అందిస్తాయి, చైతన్యాన్ని నింపుతాయి. మరీ ముఖ్యంగా మన దేశం నేడెదుర్కొంటున్న మతతత్వమూ, దోపిడీ కలిపి ఫాసిస్టు తరహా పాలన సాగుతూ, మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము నిరాకరించ బడుతున్న సందర్భంలో మార్క్స్‌ను అధ్యయనం చేయటం, మార్క్సిజాన్ని అవగాహన చేసుకోవటం ద్వారా వీటిపై పోరాటం చేయటానికి ఆయుధాలను సమకూర్చుకోవటం ఒక్కటే మనముందున్న కర్తవ్యం.
మార్క్స్‌ జయంతి వేళ, సాంస్కృతికరంగం, భావజాల రంగాల గురించి కొద్దిగా ప్రస్తావించుకుందాము. నేటి మన దేశ పాలకులు ప్రజలపై దోపిడీని తీవ్రతరం చేస్తూనే, సాంస్కృతిక విషయాలను ముందుకు తెచ్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలకు పూనుకుం టున్నారు. భారతదేశంలాంటి సంప్రదాయ, విశ్వాసాలపై ఆధారపడిన సమాజంలో సంస్కృతికి సంబంధిం చిన అంశాల ఆధిపత్య భ్రమలను కల్పించి, అందుకు కావల్సిన శత్రువులనూ సృష్టించి, ఒక యుద్ధ వాతావరణాన్ని నిర్మిస్తున్నా రు. ఒకవైపు కుల వ్యవస్థలో వున్న పీడనకు, మరోవైపు శ్రమ దోపిడీలో అణచివేతను ఎదుర్కొంటూ బలహీన పడుతున్న ప్రజలకు, ప్రపంచీ కరణ ఫలితంగా అనేకమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న మధ్యతరగతి జీవులకు, తామూ ఒక ఆధిపత్యం వహించ గలిగే మానసిక ప్రాబల్యాన్ని అందించే మెజారిటీ, మైనారిటీ పేర మత విభజనకు అధికారగణం ఉపయోగిస్తున్నది. ప్రపంచీకర ణ ప్రభావాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్య మించడం, నిరసన పెల్లుబికిరావడంతో, జాతి, మత వైషమ్యాలను పెంచుతూ దాని చుట్టూ ప్రజలను తిప్పే మితవాద తిరోగమన భావజా లాన్ని ముందుకు తెచ్చాయి పాలకవర్గాలు.
ఇలాంటి పరిస్థితిలో ప్రగతిశీల భావాలు వెనుకపట్టుపట్టి, విశ్వాసాలవైపు, విభజన ఆలోచనలవైపు జనం చూస్తున్న సమయంలో ఉద్యమకారులు, నిర్దిష్ట వాస్తవ పరిస్థితులను, సాంస్కృతిక విషయాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మార్క్స్‌ చూపిన దారిలోనే ఆ చైతన్యాన్ని పొందగలుగుతాము. మార్క్సిజం గుడ్డి విశ్వాసాలకు వ్యతిరేకమైనది. పెట్టుబడిదారీ ప్రపంచంలో మనిషి స్వార్థం ఇరుసుగా పనిచేస్తున్నది అమానవీయ హేతువాదం. ‘పొరుగువాని బాధలు చూసి ముఖం తిప్పుకునేవాడు ఎద్దుతో సమానం’ అనే ప్రవచనాన్ని పెట్టుబడిదారీ హేతువాదం అంగీకరించదు. మనిషికి ఉండాల్సిన సామాజిక బాధ్యతలను తిరస్కరించి ‘ఏదీ ఉచితంగా రాదు’ అనే సూక్తిని బోధిస్తుంది. పైగా ప్రతి ఒక్కరూ తమ బాగు కోసం తాము కష్టపడితే అందరూ బాగుపడతారు అని తర్కిస్తుంది. నీ కష్టం మీదనే నీ విజయం, నీ అపజయానికి కారణం నీ బలహీనత అనే చెబుతుంది. ఏ విషయాన్నయినా వ్యక్తి కేంద్రంగానే చర్చిస్తుంది. సమాజం మొత్తంగా ఎప్పుడూ చర్చించదు. ఎందుకంటే సామాజిక విషయంగా ఏది చర్చించినా, సామాజిక వెనుకబాటు, దారిద్య్రం, అసమానతలకు సమాజమే బాధ్యత వహించాల్సి వస్తుంది కనుక. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యక్తి స్వార్థపు విలువనే మానవ విలువగా చూస్తుంది. ఈ రకమైన భావాల నే ప్రతి అంశంలోనూ ప్రతిపా దిస్తుంది. ప్రచారమూ చేస్తుంది.
ప్రజల మనసులను ఆకట్టుకున్న భావాలు భౌతికశక్తిగా మారతాయన్న మార్క్స్‌ మాటలు నిజమేనని చరిత్ర రుజువుచేసింది. భావాలు చైతన్యంగా మారి విప్లవాత్మక మార్పుకు ఎలా దారితీస్తాయో, అవే భావజాలాలు ఫాసిజం రూపంలో మానవ మారణహౌమం సాగించడానికి తోడ్పడింది. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ అది వున్న రూపంలో అధికారంలో కొనసాగలేనపుడు, దాని స్థానంలో ప్రజాస్వామ్య శక్తులు అధికారంలోకి రాగలిగేంత బలంగా లేనపుడు ఫాసిజం తలెత్తుతుందని గ్రాంసీ, యితర మార్క్సిస్టు మేధావులు చెప్పారు. అయితే హిట్లరు అన్ని కోట్ల మంది జర్మను ప్రజల్లో జాతి ద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టగలిగాడు? యూదులను అత్యంత దారుణంగా చంపుతున్నా పట్టించుకోని కఠినాత్ములుగా ఎలా మార్చలిగాడు? జాత్యహంకారాన్ని ఎలా ప్రేరేపించగలిగాడు? అనే ప్రశ్నలకు బూర్జువాహేతువాదం, సామాజిక మానసిక శాస్త్రాలు సమాధానం చెప్పలేవు. ఈ ఫాసిస్టు ఉదంతం ప్రజల మనసులను ఆవహించిన భావజాలపు బలాన్ని సుస్పష్టంగానే చూపింది. పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాలు వీటి పెరుగుదలకు కారణమనే ఒక సాధారణ సమాధానం పూర్తి సమాధానంగా ఉండదు. ఈ వైఫల్యాలు వర్గ చైతన్యం, వర్గ స్పృహ, వర్గ సంస్కృతులను ఎందుకు పెంచడంలేదు అనేది ప్రశ్నించుకుంటే, పెట్టుబడిదారీ వ్యవస్థలోని వ్యక్తివాదం, అందుకు సంబంధించిన భావ జాలం ప్రజల మనస్సుల్లోకి బాగా ఇంకిపో యిందని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు సంస్కృతి, భావజాలాల ప్రాధాన్యతను గుర్తించి, వాటిని గురించి చర్చించాలి. దానికి నిర్దిష్ట అధ్యయనం అవసరమవుతుంది. మన దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను చూస్తూనే ఉన్నాం. దీని సమర్థకుల్లో ఎక్కువగా విద్యావంతులే ఉన్నారు. కాబట్టి భావాలు, ఆశయాలు వ్యక్తులపై ఎంత బలంగా పనిచేస్తాయో చూడవచ్చు. ఆ భావాల నిర్మాణం ఏ రకమైనవి అయినప్పటికీ, సత్యా లపై వాస్తవాలపై ఆధారపడినవా లేదా అనేది వేరే విషయం. సాంస్కృతిక పరమైన మనిషిపై భావాల ప్రభావం చాలా తీవ్రంగా పనిచే స్తుంది. మనదేశంలో స్వాతంత్య్ర పోరాట కాలంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ లక్షలాది మంది ప్రజలు, తమ కుటుంబాలను, ఆస్తిపాస్తులను,సుఖసంతోషాలను, జీవితాలను సైతం త్యాగంచేసి పనిచేశారు. వీటిని కేవలం ఆర్థిక విశ్లేషణలతో అర్థం చేసుకోలేము. ఆర్థిక విశ్లేషణ స్థూలంగా సమాజ గమన సూత్రాలను అర్థం చేసుకోవటానికి అత్యంత ఆవశ్యకమైనదే. అంతిమంగా సంస్కృతిని ఆర్థికాంశమే నిర్ణయి స్తుందనేది నిజమే అయినా, భావాలకు, సంస్కృతికి ఉండే సాపేక్ష స్వతంత్ర పాత్రను గ్రహించకపోతే విఫలమవుతాము. ఉపరితల అంశాలుగా ఉన్నవి కూడా పునాదిపై ప్రభా వాన్ని కలిగిస్తాయనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఏ జీవన పరిస్థితులు పాలకవర్గ భావజాల సారాంశాన్ని నిర్ణయి స్తాయో, అవే పరిస్థితులు ఆ భావజాలాన్ని తిరస్కరించడానికి అవసరమైన పరికరాలనూ సమకూరుస్తాయి. అయితే ఇదంత సులభం కాదు. ప్రయత్న పూర్వకంగా సాధించాల్సింది.
వర్గ సంఘర్షణలో భాగంగా రైతులు, కార్మికులు, యాజమాన్యాల, ప్రభుత్వాల ఆధిపత్యంపై అణచివేతపై ఎంత తీవ్రంగా పోరాడినప్పటికీ, ఇదే శ్రామికవర్గాలు కుటుంబాల్లో స్త్రీలపై, పిల్లలపై అణచివేత, ఆధిపత్యం ప్రదర్శించడం మనం చూస్తాము. అంతేకాదు ఉద్యమాలలో పనిచేసేవారు, ఇతర అంశాలలో భిన్నంగా వ్యవహరించడము అక్కడక్కడ కనపడుతుంది. ఇకపోతే సంప్రదా యాలు, ఆచారాలు, పరంపరగా వస్తున్న కుటుంబ వ్యవహారాలు అనేక విషయాలపట్ల వెలువరించే భావాలు గమనిస్తే, ఎంత లోతుగా నిండిపోయి ఉన్నాయో తెలుస్తుంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మన పోరాట చైతన్యము వర్గ చైతన్యంగా మారితేనే మిగతా అన్ని సంబంధాలలో మార్పు వస్తుంది. శ్రామికుల మధ్య నిజమైన సామాజిక, సాంస్కృతిక సంబంధాలు కార్మికవర్గ విప్లవానికి ముందస్తు షరతు అంటాడు మార్క్స్‌. అదే వర్గ స్పృహ. వర్గంగా ఉండటంవేరు, వర్గ స్పృహ కలిగి ఉండటం వేరు. ఈ వర్గ చైతన్యాన్ని పెంపొం దించటానికి సాంస్కృతిక రంగంలో, భావజాల రంగంలో తీవ్రంగా కృషి చేసినపుడు మాత్రమే వీటన్నింటిని అధిగమించగలుగు తాము.
మార్క్సిజం ప్రకారం సంస్కృతి అనేది సామాజికంగా వ్యవస్థీకృతమైన మానవ అస్తిత్వ పరిస్థితుల ఉత్పత్తితో ముడిపడిన భౌతిక శక్తి. సంస్కృతి, మనిషి సమాజ సభ్యునిగా సముపార్జించుకున్న జ్ఞానం, నమ్మకం, కళ, నైతిక విలువలు, చట్టం, సంప్రదాయం తదితర సామర్థ్యాలు, అలవాట్లు అని మోర్గాన్‌ వివరిస్తారు. దీనిని ఏంగెల్స్‌ స్వీకరించి సాంస్కృ తిక అంశాల విశ్లేషణతో నిర్దిష్ట సూత్రాలను కనుగొన్నారు. మానవ జీవితానికి సంబం ధించిన ఎంత స్వల్ప విషయమైనా సాంస్కృతిక సిద్ధాంతానికి పరాయిది కాదు. సంస్కృతి మానవ నిర్మిత ద్వితీయ ప్రకృతి. వర్తమానంలో వినిమయ సంస్కృతిని ఒకవైపు పెంచి పోషిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ, మరోవైపు విశ్వాసాలపై ఆధారపడిన మూఢ త్వాన్ని విస్తరింపజేస్తున్నది. ఒకవైపు అత్యంత శాస్త్ర సాంకేతిక వస్తు వినియోగం, మరోవైపు సవాళ్లు, సమస్యలపట్ల అచేతన దీనావస్థ రెండూ విచిత్ర సహజీవనం నేటి వ్యవస్థ విషాదం. ఈ రెండింటి గందరగోళంలో భ్రమాత్మక అంశాలతో నిండిన మతాన్ని తెచ్చి, వైరుధ్య భావాలను వెదజల్లుతున్న తరుణంలో, భావజాల రంగంలో వర్గ చైతన్యంతో పనిచే యాల్సిన అవసరం ఉంది. అందుకు వ్యూహా లను రచించుకోవాలి. మార్క్స్‌ మనకు ఎన్నో పరికరాలు ఇచ్చాడు. వాటిని సమర్థవంతంగా వినియోగిస్తే ముందుకు పోతాము.
(నేడు కారల్‌ మార్క్స్‌ 206వ జయంతి)
కె.ఆనందాచారి
9948787660