కార్పొరేట్‌ కళాశాలల్లో బట్టీ చదువులు

రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యా సంస్థల యజమానులు వ్యాపారమే తమ లక్ష్యంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకర్షించడానికి అనేక కొత్త రకమైన పేర్లు పెట్టుకుని మోసం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి లేకండానే అడ్మిషన్లు డిసెంబరులోనే ప్రారంభించారు. ఇప్పటికే సగానికిపైగా పూర్తి చేసుకున్నారు. గతంలో రూ.2 లక్షల ఫీజులు ఉంటే, ఈ సంవత్సరం దాన్ని రెట్టింపు చేసి, విద్య పేద వారికి అందని ద్రాక్షగా మారుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టు వ్యహరిస్తోంది. కార్పొరేట్‌ విద్యా సంస్థలో ఫీజుల నియ ంత్రణ చట్టం చేయాలని అనేక పోరాటాలు చేసినా పట్టించుకున్న నాథుడులేడు. వారు చేసే అక్రమాలు, అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉండటం సరైంది కాదు. ప్రధానంగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి వాటి చాతుర్యానికి బలైపోతున్న ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండేండ్ల పాటు హాస్టల్‌లో కొనసాగించేందుకు వారి వలలో పడి పోతున్నారు. ఫలితంగా ఎంతో మంది పల్లెల నుండి పట్నానికి వచ్చి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు ఇక్కడి వాతావరణాన్ని త్వరగా ఆకలింపు చేసుకోలేకపోతున్నారు. ఇంటర్‌కు ముందు అంటే పదో తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద స్వేచ్ఛా వాతావరణంలో పెరిగి ఉన్నఫలంగా ఒక్కసారిగా రెండేళ్ల ‘ఖైదీ’ అనుభవించలేక తమలో తాము సతమతమవుతూ విపరీతమైన మానసికవేధనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు కాయా, కష్టం, అప్పు చేసి మరీ ఒక్కసారిగా లక్షల ఫీజులు చెల్లించి చదివిస్తుండటం తమ భవిష్యత్తు కోసమే అనే భావన వారిలో పెనవేసుకుని అత్యుత్తమంగా చదువలేక చతికిలపడిపోతున్నారు. కొండంత సెలబస్‌తో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా సెలబస్‌ను పూర్తిగా బట్టిపట్టే పక్రియలో విద్యార్థిని, విద్యార్థులు సమిధ లవుతున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్‌ కళాశాలలు వెనుకపడ్డ విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులంటూ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అధ్యాపకులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కొంత మంది అధ్యా పకులు టార్గెట్‌ ఇస్తుండటంతో తమ బ్యాచ్‌లోని విద్యార్థులను ఉత్తమం గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో మిడిల్‌క్లాస్‌ స్టూడెంట్స్‌ రోజుకోసారి, వారానికోసారి, ప్రత్యేకంగా జరిగే టెస్టుల్లో వెనుకబడి పోతున్నారు. ఇలాంటి వారిపై అధ్యాపకులు టార్గెట్‌ చేస్తున్నారు. ఉత్తమంగా చదవలేక, సెలబస్‌ను కంప్లీట్‌ చేయలేక బట్టీ చదువులకు అలవాటుపడుతున్నారు. ఈక్రమంలో తమలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభకు పూర్తిగా పుల్‌స్టాప్‌ పెడుతున్నారు. అధ్యాపకులూ ఏ మెథడ్‌లో చెబితే విద్యార్థులు గ్రహిస్తారు అనే అంశాన్ని మేనేజ్‌మెంట్‌ టార్గెట్స్‌తో ఏనాడో మర్చి పోయారు. ఎంత సేపటికి మేనేజ్‌మెంట్‌ పెట్టే టెస్టుల్లో ప్రతిభ చూపారా? లేదా అనే అంశాన్ని మాత్రమే ఇక్కడ కొలమాణంగా పరిగణిస్తున్నారు. వెనుకబడ్డ విద్యార్థులకు సింపుల్‌గా అర్థమయ్యే మెథడ్‌లో చెప్పేందుకు అధ్యాపకులకు సైతం టైం లేకపోవడం, వేలమంది ఒక్కో క్యాంపస్‌లో విద్యార్థులు ఉండటంతో ఇంట్రెస్టు ఉండి విద్యార్థులను గాడిలో పెడుతామనుకున్న అధ్యాపకులు సైతం ఎందుకొచ్చిందిలే గొడవ అంటూ సైడ్‌ అయిపోతున్నారు. ఈ క్రమంలో మిడిల్‌ క్లాస్‌ స్టూడెంట్స్‌ అలాగే ఉండిపోతున్నారు. బట్టి చదువులతో తాము ప్రతిభ చూపిస్తున్నామనుకుంటున్న వందలాది మంది విద్యార్థులు కార్పొరేట్‌ విద్యాసంస్థల లాంటి క్యాంపస్‌లు దాటాక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమ సంస్థకు ర్యాంకుల పంట పండాలని లెక్చరర్స్‌కు టార్గెట్స్‌ విధిస్తుండటంతో ఆ ఒత్తిడితో లెక్చరర్స్‌ తమ గ్రూప్‌లో పిల్లలు ఉత్తమంగా చదువాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో బట్టీ చదువులకు లెక్చరర్స్‌ జేజేలు పలుకుతున్నారు. ఆల్రెడీ ప్రీపేర్‌ చేసి ఫ్రింట్‌ తీసిన మెటీరియల్‌ను విద్యార్థులచే బట్టీ కొట్టిస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్‌ వెలికితీయకపోగా ఉన్నది కాస్త పోయే రీతిలో కార్పొరేట్‌ చదువులు కొనసాగుతున్నాయి. ఇక స్పెషల్‌ సెలబస్‌ అంటే ఐఐటీ, జేఈఈ, ఏఐఈఈఈ, నీట్‌ మొదలైన బ్యాచ్‌ల విద్యార్థుల ఒత్తిడి చెప్పజాలవు. ఉదయం నిద్రలేవగానే మొదలు రాత్రిళ్లు పొద్దు పోయే వరకు స్పెషల్‌ క్లాసులంటూ రుద్దుడే… రుద్దుడు. చదువు… చదువు తప్ప వేరే ధ్యాస లేకపోవడంతో మానసిక ప్రశాంతత కరువై, స్వేచ్ఛ కరువై వారిలో ఉన్న టాలెంట్‌కు పుల్‌స్టాప్‌ పడుతుంది. పదివరకు పదిలంగా తల్లిదండ్రుల వద్ద పెరిగిన ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులు కొత్త లక్ష్యాలతో మహానగంరలోని కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అడుగుపెట్టి మనోధైర్యం కోల్పోతున్నారు. కొంత మంది ఇష్టంగా మరికొంత మంది అయిష్టంగానే అడ్మిషన్‌ తీసుకుంటున్నారు. మరి కొంత మంది తమ స్నేహితుల కోసం మరీ పట్టుబట్టి వారి తల్లిదండ్రుల మీద ప్రెషర్‌ పెట్టి మరీ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో జాయిన్‌ అవుతున్నారు. ఇలా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో విద్యనభ్యసించడానికి హాస్టళ్లలోని ఆయా క్యాంపస్‌లోకి ఎంటరైన విద్యార్థులు ఒక్క సారిగా మారిన వాతావరణాన్ని ఆకలింపు చేసుకోలేక పోతున్నారు. అంతకు క్రితం వరకు పాఠశాలల్లో చదువు పూర్తికాగానే ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద మెలిగిన వాతా వరణం ఒక్కసారిగా దూరమై కేవలం స్నేహితులు తోటి క్లాస్‌మెంట్స్‌ మాత్రమే తమ వాతావరణమైపోతుంది. ప్రథమ సంవత్సరంలో జాయిన్‌ అయిన తర్వాత ఒకటి రెండు వారాలు కొత్తగా ఉత్సాహంగా అనిపించినా రానురాను విద్యార్థుల్లో కొంత అలజడి మొదలైపోతుంది. తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాలన్నా నిర్ణీత టైంటేబుల్‌ ఉండటంతో ఆయా క్యాంపస్‌లో వేలాది స్టూడెంట్స్‌ మధ్య తమకెప్పుడు మాట్లాడే టైం వస్తుందోనని క్యాంపసుల్లో ఆశగా ఎదురు చూస్తుంటారు.
ఇక సెలవు దినాలు ముఖ్యంగా ఆదివారం వచ్చినా విద్యార్థులు పుస్తకాలతో మాత్రమే కుస్తీ పట్టాలి. కొంత సమయం విరామం ఇస్తే కిటికిల్లోంచి బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆనందించే ఎంతో మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో చదువు అనే ఒత్తిడిని జయించలేక, అధ్యాపకుల ఫ్రెషర్‌ను తట్టు కోలేక, ర్యాంకుల వేటలో పరుగెత్తలేక, ఇంటి వద్ద తల్లి దండ్రుల పరిస్థితిని అర్థం చేసుకుని వారికే సమాధానం చెప్పాలో తెలియక వారిలో వారు మథన పడుతూ కృంగిపోతూ అత్మానూన్యతా భావంలో కొట్టు మిట్టాడుతూ సైకాల జీగా ఇబ్బంది పడుతున్నారు. చదువులో వెనకపడిపోయి రెండేండ్ల ఖైదీల జీవితాన్ని కేవలం నాలుగుగోడల మధ్య అనుభవించలేక, ఒత్తిడి తాళలేక ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. అందుకే తల్లిదండ్రుల్లారా కార్పొరేట్‌ విద్యా సంస్థల వలలో పడకుండా మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందివ్వండి. స్వేచ్చాయుత వాతావరణాన్ని కల్పించండి.. వారిని సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రేరేపించండి. వారిలో ఏ అంశం పై ఆసక్తి ఉందో గ్రహిం చండి. ఆ దిశగా వారికి ఎంకరేజ్‌ చేయండి. అప్పుడే మీ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దబడుతుంది.
– తాటికొండ రవి
సెల్‌:9177302248