పురాణాలతో భవిష్యత్తు సంక్షోభం

Future crisis with mythology– గత చరిత్ర గొప్పతనాన్ని చెప్పాల్సిందే
– ఎన్‌సీఈఆర్టీ పాఠ్యాంశాల మార్పుపై విస్తృత చర్చ జరగాలి : ఎస్వీకే వెబినార్‌లో ప్రొఫెసర్‌ హరగోపాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రామాయణం, మహాభారతం, పురాణాలతో విద్యార్థుల భవిష్యత్తు సంక్షోభంగా మారుతుందని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జి హరగోపాల్‌ అన్నారు. గత చరిత్ర గొప్పతనాన్ని చెప్పాల్సిందేననీ, అయితే దానివల్ల సమాజానికి, ప్రజలకు భవిష్యత్తులో కలిగే ప్రయోజనాల గురించి స్పష్టత ఉండాలని చెప్పారు. అప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. ‘చరిత్ర పాఠ్యపుస్తకాల్లో పురాణాలా?’అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో శుక్రవారం వెబినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చరిత్రను రాసిన వాళ్లంతా మార్క్సిస్టులు కాబట్టి పాఠ్యాంశాలను మారుస్తున్నామని బీజేపీ నాయకులు చెప్తున్నారని వివరించారు. అయితే మార్క్సిస్టులు రాసినా, ఇతరులు రాసినా ఆ చరిత్ర వాస్తవమా? కాదా?, దానికి చారిత్రక ఆధారాలున్నాయా? లేదా?అనేది గమనించాలని సూచించారు. అంతే తప్ప వారు రాశారు కాబట్టి ఆ చరిత్ర స్థానంలో పురాణాలను విద్యార్థులకు అందించడం సమంజసం కాదన్నారు. భారతదేశానికి సంబంధించి మధ్యయుగాలనాటి చరిత్రను వదిలేసి రామాయణం, మహాభారతం, పురాణాల గురించి చరిత్ర పాఠ్యపుస్తకాల ద్వారా అందిస్తే విద్యార్థులకు స్పష్టమైన అవగాహన లోపిస్తుందని వివరించారు. అయితే వాటిలో ఉండే వాస్తవికత, కాల్పనికత గురించి చెప్పాల్సిన అవసరముందన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఖగోళ విజ్ఞానం, చంద్రునిపై ప్రయోగాలు విజయవంతమవుతున్న ఈ ఆధునికయుగంలో విశ్వాసాలకు సంబంధించిన చరిత్రను విద్యార్థులకు అందిస్తే నూతన సమాజం ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు. అంబేద్కర్‌ కలలుగన్న కులరహిత సమాజం కావాలని చెప్పారు. ఉపాధ్యాయులపై ఉన్న నమ్మకంతో రామాయణం, మహాభారతం, పురాణాలే చరిత్రగా చదివితే ఓ తరం జ్ఞానాన్ని కోల్పోతుందని, భవిష్యత్తు సంక్షోభంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కాలంలో ఉండే అనేక రకాల అవతారాలు ఇప్పుడెందుకు రావడం లేదన్న ప్రశ్న విద్యార్థులకు వస్తుందన్నారు. ఇంకోవైపు సమాజంలో ఉండే సవాళ్లు, సమస్యలు, హింస, ఆధిపత్యం, అసమానతల వంటి వాటికి కారణమెవరన్న ఆలోచనలు వస్తాయని చెప్పారు. మతం విశ్వాసాల ఆధారంగా గతంలోకి వెళ్తుందన్నారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తును సైన్స్‌ నిర్మాణం చేస్తుందని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం, సమాజం పురోగతి ఉండేలా పాఠ్యాంశాలను అందించాల్సిన అవసరముందని అన్నారు. చరిత్ర మార్పుపై ఎన్‌సీఈఆర్టీ అవలంభిస్తున్న వైఖరిపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.