గంజాయి మహమ్మారిని అరికట్టాలి: గడ్డం వెంకటేష్

నవతెలంగాణ – వలిగొండ రూరల్
గంజాయి మహమ్మారి పట్టణ ప్రాంతాలను వదిలి గ్రామాల వరకు విస్తరించింది దీనిపై ప్రభుత్వ అధికారులు పోలీస్ యంత్రాంగం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు, వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి గంజాయి నియంత్రణ చర్యలు చేపట్టాలి అని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పులిగిల్ల గ్రామంలో యువజన సర్వే నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన గంజాయి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ప్రధానంగా యువతను వారి ఆరోగ్యాలను పాడు చేస్తుందని, అదేవిధంగా అతి చిన్న వయసులో గంజాయికి బానిస కావడం వల్ల యువత భవిష్యత్తు నాశనమై చిన్నవయసులోనే ప్రాణాలు వదులుతున్న పరిస్థితి ఉందని వారు అన్నారు. ప్రభుత్వం నుండి కనీసం ఇప్పటివరకు ఎలాంటి అవగాహన సదస్సులు కానీ, నియంత్రణ చర్యలు గాని ప్రారంభించిన పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో లేదని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలు చేస్తుంది తప్ప ఇప్పటివరకు గంజాయి మూలాలను వెతికి వాటిని నియంత్రించే పనిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. గ్రామాలలో యువత ప్రభుత్వ ఉపాధి లేక, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్ల చెడుదారులు పట్టి గంజాయి, మద్యం చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న పోలీసు యంత్రాంగం కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి గంజాయి నియంత్రణకు గ్రామాల వారీగా పెట్రోలింగ్ జరిపి యువతకు అవగాహన కల్పించే బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉందని వారు అన్నారు. వెంటనే ప్రభుత్వం గంజాయి నియంత్రణ చర్యలు చేపట్టి గ్రామీణ స్థాయిలో యువతను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు డివైఎఫ్ఐ మాజీ జిల్లా కమిటీ సభ్యులు వడేమాను మధు, కెవిపిఎస్ జిల్లా నాయకులు వేముల అమరేందర్, డివైఎఫ్ఐ నాయకులు వేముల జైపాల్, వడ్డేమోని రవి,వేముల రమేష్, ఉపేందర్, వరికుప్పల నర్సింహ, వడ్డేమాని రవి తదితరులు పాల్గొన్నారు.