సాహిత్య, సాంస్కృతిక ఉద్యమానికి ఐకాన్‌ గద్దర్‌

Gaddar is an icon of literary and cultural movement‘మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు! ఆ జీర బోయిన గొంతులో… జీవమెవరు పోసెదరు! ఆ జానపదం జీవ కణంలో జీవాక్షరాలెవరో… తుపాకులకు ఎదురు నడిచినా తూట నెవరు దాచెదరో..!’ తను లేనినాటి కోసం తనకుతాను రాసుకొని పాడుకున్న పాట ఇది. గద్దర్‌ పేరుతో సాంస్కృతిక యుద్ధరంగ సైని కుడై పోరాడుతున్న గుమ్మడి విఠల్‌ ఆగస్టు 6న అనారోగ్యంతో మరణించాడు. 74 ఏండ్ల జీవితంలో యాభైయేండ్లు ప్రజాకళా జీవితానికే అంకితమై తెలుగు విప్లవ గీతానికి కొత్త ఒరవడి సృష్టించాడు. గద్దర్‌ మరణం ప్రజా ఉద్య మ లోకానికి తీరని లోటు. అయితే, సుదీర్ఘకాలం అతివాద వామపక్ష మద్దతుదారుడిగా కొనసాగిన గద్దర్‌ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నా యంటే అతిశయోక్తి కాదు. అటు వామ పక్ష ఉద్యమం, ఇటు తెలంగాణ ఉద్య మం రెండిటినీ ఉర్రూతలూగించిన పా టలు గద్దర్‌ సొంతం. తిరుగుబాటునే పే రుగా మార్చుకున్నారు. హిందీ భాషలో గదర్‌ అంటే తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు అనే అర్థాలున్నాయన్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో, కమ్యూనిస్టు భావజాలంతో గద్దర్‌ పార్టీ కూడా పనిచేసింది. ఆ తిరుగుబాటు అనే పదాన్నే తన వృత్తి పేరుగా తీసుకున్నారు గద్దర్‌.
జనవరి 31న గద్దర్‌ జయంతిని పురస్క రించుకుని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షనీయం. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌ లో గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. హెచ్‌ఎండీఏకు చెందిన 1076 చ.గజాల (9గుంటలు) స్థలాన్ని కేటా యిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లాపూర్‌లో చౌరస్తాను ఆనుకొని ఉన్న హెచ్‌ఎండీఏ స్థలంలో ఇటీవల గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు నిర్మాణ పనులు చేప ట్టారు. అయితే, ఇది సరిపోతుందా గద్దర్‌ ఈ సమాజానికి చేసిన సేవ కి? ప్రజలందరూ ప్రశ్నిం చుకోవాల్సిన ఆవశ్యకత ఎం తగానో ఉన్నది. ఆయన జీవి తాన్ని ఓసారి పరిశీలిస్తే అనేక విషయాలు అవగతమవుతాయి.
1948లో మొదక్‌ జిల్లా తూప్రాన్‌ దగ్గర జన్మించిన గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. ఇంజినీరింగ్‌ చదివారు. మా వోయిస్టు పార్టీగా ఏర్పడక ముందు పీపుల్స్‌ వార్‌ మద్దతుదారు గా సుదీర్ఘకాలం పనిచేశారు. కొంతకాలం అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నారు. 1975లో బ్యాంకు క్లర్కుగా ఉద్యోగం ప్రారంభించి ఆ తర్వాత ఆ తరువాత ప్రజాజీవితం కోసం జననాట్య మండలి తరపున పనిచేశారు. తన జీవితాంత అనుభవంతో నేర్చుకున్న పాఠంతో సాయుధ పోరాటమే కాదు, ఎన్నికల పోరాటం కూడా అవసరమన్నాడు. విప్లవం జయప్రదం కావాలంటే ఆర్థిక సమస్య ఒక్కటే కాదు, కులవ్యతిరేక పోరాటం కూడా జమిలీగా జరగాల న్నాడు. మార్క్స్‌, పూలే, అంబేడ్కర్లు కూడా కావాలన్నాడు. గద్దర్‌ కవి, రచయిత, గాయకుడు, సాధారణ నటుడే కాదు సినిమా లలో సైతం పాటలు రాసి నటించాడు. 1980వ దశకంలోనే గద్దర్‌ సినిమాల్లో కనిపించారు. బి.నర్సింగరావు తీసిన ‘మా భూమి’ సినిమాలో బండెనక బండికట్టి పాట పాడుతూ ఆ సిని మాలో కనిపిస్తారు గద్దర్‌. 2009-2014 నాటి తెలంగాణ ఉద్య మంలో గద్దర్‌ రాసిన ”అమ్మా తెలంగాణమా ఆకలికేకల గాన మా..” అనే పాట ఎందరినో కదలించింది. 2011లో దర్శకులు శంకర్‌ తీసిన జైబోలో తెలంగాణ సినిమాలో ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ పాటకీ అంతే పేరొచ్చింది.
గద్దర్‌ తెలంగాణకు లేదా తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన వాడు కాదు. భారతదేశంలో హిందీ భాషలో ప్రావీణ్యత సంపా దించి దేశమంతా తిరిగారు తన ఆటాపాట మాటలతో అలరిం చాడు. దక్షిణాఫ్రికా దేశా ల్లో తన పాటను వాళ్ళ భాషలో తర్జుమా చేసి పాడి అభిమానులు కూడా వాడుకున్నారు. ఆయన ప్రభావం రోజురోజుకూ పెరు గుతూ యువతను ఉర్రూత లూరిస్తూ ప్రభుత్వాలని సై తం గడగడలాడించింది. ఈ క్రమంలోనే 1997లో గద్దర్‌ పై హత్యాయత్నం జరిగింది. కొన్ని బుల్లెట్లు ఆయన శరీరంలోనే ఉండిపో యాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమా లలో ఆయన పాత్ర ఎంతో ఉంది. సాంస్కృతిక ఉద్యమానికి ఆయనే సారధ్యం వహించారు. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రప్పిం చడంలో ఆయన కృషి ఎనలేనిది. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగానూ, 2009 మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ పెట్టి ఆట, పాట, మాటతో ఉద్యమాన్ని ముందుకు నడి పాడు. సుదీర్ఘకాలం ఓటు వ్యతిరేక పోరాటంలో ఉన్న గద్దర్‌ మొదటిసారి ఓటు వేయడం, కూడా అప్పట్లో పెద్ద వార్తలుగా, చర్చలుగా నిలిచాయి.
జానపద గాయకుడిగా గద్దర్‌ తన సంగీతాన్ని సామాజిక మార్పుకు సాధనంగా ఉపయోగించాలనే ఆచెంచలమైన నిబద్ధ తతో అతని కెరీర్‌ గుర్తించబడినది. భూసంస్కరణలు, పేదరికం, శ్రామికవర్గ దోపిడీ, కుల వివక్ష, లింగ అసమానత, అణగారిన వర్గాల హక్కులతో సహా అనేక సామాజిక సమస్యలను పరిష్క రించే అనేక పాటలను ఆయన స్వరపరిచారు, ప్రదర్శించారు. అతని పాటలు అట్టడుగు వర్గాల గొంతులకు వ్యక్తీకరణగా ఉన్నా యి. వారి మనోవేదనలను వినిపించడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి అతను తన సంగీతాన్ని ఉపయో గించాడు. గద్దర్‌ సంగీతం తెలంగాణ, భారతదేశంలోని ఇత ర ప్రాంతాల జానపద సాంప్రదా యాలలో కూడా లోతుగా పాతుకుపో యింది. అతను తెలంగాణ జానపద పా టలు, లావణి, గొంధాల్‌, ఆదివాసుల సాహిత్యం వారి లిబిలో ఇతర జానపద సం గీతం గొప్ప వారసత్వం నుండి ప్రేరణ పొందాడు. తన సందేశాలను తెలియ జేయడానికి అనేక రూపాలను ఉపయో గించాడు. అందుకే గద్దర్‌ సాహిత్య సాం స్కృతిక ఉద్యమానికి ఒక ”ఐకాన్‌”గా నిలి చారు. అతని సంగీతం దాని సరళత, ప్రామాణికత, భావోద్వేగ ఆకర్షణతో వర్గీకరించబడింది.
కమ్యూనిస్టులు, అంబేద్కర్‌వాదులు కలిసి పనిచే యాలన్నాడు. అందుకు లాల్‌ నీల్‌ శక్తుల ఐక్యత కీలకమ న్నాడు. అదే లక్ష్యంతో తన వెదురు కర్రకు లాల్‌ జెండాలు నీల్‌ జెండాలు కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. కమ్యూ నిస్టులు ఐక్యం కావాలని బలంగా కోరుకున్నాడు. తాను గతంలో సీపీఐ, సీపీఐ(ఎం)లను శత్రుభావంతో చూసేవాడి నని, అది తప్పని గ్రహించానని అందుకు క్షమాపణలు కోరుతు న్నానని మార్చి 19, 2017 న సీపీఐ(ఎం) నిర్వహించిన మహాజన పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ప్రకటిం చాడు. రాష్ట్రంలో ఉన్న అనేక కుల వర్గ సంఘాలన్నిటినీ ఒక వేదిక మీదికి తీసుకురావడంలో తీవ్రమైన కృషి చేశాడు. టి మాస్‌ అనే పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేయటంలో కీలకపాత్ర వహించాడు. రాజకీయాధికారం కావాలి, బహుజన రాజ్యాధికారం రావాలి అని బహు జన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నిర్మించడంలో కూడా ఆయ న కృషి అద్వితీయమైనది. బహుజన రాజ్యం రావాలంటే ఓటే ఆయుధం కావాలన్నాడు. కొన్ని కులాలకెే ఇంకెంతకాలం రాజ్యమని అని ప్రశ్నించాడు?
గద్దర్‌ను కేవలం కళాకారుడిగానో, నక్సలైట్‌గానో గుర్తించడం పొరపాటు. ఆయన ఏది అన్యాయమనిపిస్తే దానిపై పోరాడిన యోధుడు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అణిచి వేతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం లో ముందు వరుసలో నిలిచాడు. వర్గ రహిత అభ్యుదయ శక్తుల మధ్య అగా ధాలను పూడ్చేందుకు సిద్ధపడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అనేక పోరాటాల గద్దర్‌ పాత్ర లేకుండా ఉండదు. అందుకే ఆయనకు సరైన గౌరవం దక్కాలి. ట్యాంకుబండ్‌పై ఒకపక్కన బుద్ధుడు, మరో పక్కన అంబేద్కర్‌ విగ్ర హాలు ఉన్నాయి. అయితే గద్దర్‌కు నెక్లెస్‌ రోడ్‌లో ఆయన స్మారక మందిరాన్ని ని5ర్మించాలి. ఆయ న పేరిట జానపద సాంస్కృతిక యూనివర్సి టీని ప్రభుత్వం స్థాపించాలి. ఇదే గద్దర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి.
మన్నారం నాగరాజు
9550844433