గద్దర్‌ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలి

గద్దర్‌ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలి– ప్రముఖ ప్రగతిశీల భావకుల పిలుపు
– జాతీయ పుస్తక ప్రదర్శనలో ‘గద్దర్‌ యాదిలో పాటతో ఒక సాయంత్రం’
నవతెలంగాణ-కల్చరల్‌
ప్రజాగాయకులు గద్దర్‌ సాంస్కృతిక చైతన్య వారసత్వాన్ని కొనసాగించాలని ప్రముఖ ప్రగతిశీల భావకులు పిలుపునిచ్చారు. గద్దర్‌ ఒక ప్రాంతానికి చెందిన వారు కారనీ ప్రపంచ పీడిత ప్రజలకు పాట గొంతుగా, ప్రతినిధిగా నిలిచారని అన్నారు. ప్రముఖ కవి పసునూరు రవీందర్‌ నిర్వహణలో హైదరాబాద్‌ ఎన్‌టీఅర్‌ స్టేడియంలో జరుగుతున్న 36వ జాతీయ పుస్తక ప్రదర్శనలో భాగంగా గద్దర్‌ ప్రాంగణంలోని రవ్వ శ్రీహరి వేదికపై ‘గద్దర్‌ యాదిలో పాటతో ఒక సాయంత్రం’ కార్యక్రమంలో పలువురు గద్దర్‌ గురించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. రవీందర్‌ స్వాగతం పలుకుతూ.. గత సంవత్సరం గద్దర్‌ నడయాడిన ప్రాంగణంలో ఆయన యాదిలో జరుపుకోవటం బాధాకరంగా ఉందన్నారు. ప్రెస్‌ అకాడమీ పూర్వ చైర్మెన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ.. గద్దర్‌ గురించి చివరి దశలో కొంతమంది అపోహలు పడ్డా ఆయన పీడిత ప్రజల పక్షమే నిలిచారని చెప్పారు. శ్రీశ్రీ కమ్యూనిస్టులను తయారు చేస్తే గద్దర్‌ విప్లవకారులను తయారు చేశారన్నారు. గద్దర్‌ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదని తేల్చి చెప్పారు. సాహిత్య అకాడమీ పూర్వ చైర్మెన్‌ జూలూరి గౌరీశంకర్‌ మాట్లాడుతూ.. గద్దర్‌లో పసివాని బోలాతనం ఉందన్నారు. సినీ గీత రచయిత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా శాసనసభలో ఒక విప్లవ కవి, గాయకునికి నివాళ్లర్పించటం అపూర్వ ఘట్టం అన్నారు. గద్దర్‌ పేరిట సినీ కళాకారులకు అవార్డ్‌ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించటం విశేషమన్నారు. దళిత, స్త్రీ, తెలంగాణ ప్రాంతీయ వాదాలను ఆయన పాటలో మిళితం చేశారని చెప్పారు. జానపద వాగ్గేయకారుడు జయరాజ్‌ మాట్లాడుతూ.. గద్దర్‌ ప్రభావితం చేయని వారు నేటి తరంలో కవులుగానీ ఉద్యమ కారులుగానీ లేరన్నారు. ఆయన సర్వం సమాజానికి అర్పించిన గౌతమ బుద్ధుడు వంటి వారన్నారు. ఇది గద్దర్‌ యుగంగా గాయని విమలక్క చెప్పారు.
ఎమ్మెల్యే గోరటి వెంకన్న మాట్లాడుతూ.. గద్దర్‌లాంటి మరో ప్రజా యుద్ధ నౌక రావటం సాధ్యం కాదన్నారు. ప్రొఫెసర్‌ ఖాసీం, ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి, ప్రగతిశీల కవులు యశ్‌పాల్‌, ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్‌, యోచన తమ ప్రసంగాలు, పాటలతో సభికులను ఉత్తేజపరిచారు. గద్దర్‌ కుమారుడు సూర్యం గద్దర్‌ ఫౌండేషన్‌ లక్ష్యాలు వివరించారు. కవి యాకూబ్‌ ముందుగా స్వాగతం పలుకగా.. కోయ చంద్రమోహన్‌ వందన సమర్పణ చేశారు.