
– 14,000 ఎకరాలకు అందనున్న సాగు నీరు
నవతెలంగాణ – భైంసా
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చొరవ తో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ఆయకట్టు దారులకు ఊరట లభించింది. రైతాంగానికి వేసవిలో సాగు నీటికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం జీవో ను విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేసారు. ప్రాజెక్ట్ కెపాసిటీ 358.7 మి. కాగా ప్రాజెక్టులో 357.5 మి. నీరు నిల్వ ఉంటేనే 2017 జి. వో. ప్రకారం సాగు నీరు విడుదలకు ఆస్కారం ఉండేది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తేవడం జరిగిందన్నారు. ప్రభుత్వం 355.9 మీ. వరకు నీరు ఉన్నప్పటికీ సాగునీరు వాడుకోవచ్చని జి. వో. విడుదల చేయడం తో 0.6 టి. ఎం. సి. ల నీరు అదనంగా వాడుకోవడం వల్ల 6 వేల ఎకరాలకు అదనపు సాగు నీరు అందడం తో 14 వేల ఎకరాలకు పూర్తి స్థాయి లో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ జి. వో విడుదల వల్ల ప్రాజెక్ట్ ఎగువ భాగం లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కుబీర్ మండల రైతులకు సాగు నీరు అందుతుందన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదములు తెలియజేసారు. విలేకరుల సమావేశం లో బిజెపి తానూర్ మండల అధ్యక్షులు చిన్నా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సర్దా,కౌన్సిలర్ కపిల్, నాయకులు కృష్ణ పాల్గొన్నారు.