గాదె సుబ్బారెడ్డి మరణం ప్రజానాట్యమండలికి తీరని లోటు

– పీఎన్‌ఎం అధ్యక్షులు ఎన్‌. మారన్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వీధి నాటక రచయిత, దర్శకుడు, ప్రజానాట్యమండలి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదె సుబ్బారెడ్డి మరణం ప్రజానాట్యమండలికి తీరని లోటని పిఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. మారన్న తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పీఎన్‌ఎం రాష్ట్ర మాజీ నాయకులు పద్మారావు, మారన్న పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్‌.మారన్న మాట్లాడుతూ ప్రజానాట్యమండలి నిర్మాణంలోనూ, ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణం కోసం ఎన్నో వీధి నాటికలను రాశారని గుర్తు చేశారు. ప్రజా కళల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం నిరంతరం తాపత్రపడేవారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక రంగంలో ఆయన చేసిన కృషి అమోఘమని తెలిపారు. గాదె సుబ్బారెడ్డి ప్రజానాట్యమండలి రాష్ట్ర అభ్యుదయ కళా ఉద్యమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో పీఎన్‌ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. కళ్యాణ్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి డి.రాజు నగర నాయకులు నాయుడు, రఘు, రాము, నాగరాజు, జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.