గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక రద్దు

Gadwala MLA election cancelled– ఎమ్మెల్యేగా డీకే అరుణను కొనసాగించాలి
– హైకోర్టు సంచలన తీర్పు
– పలువురు ఎమ్మెల్యేలపైనా పిటిషన్ల దాఖలు
నవతెలంగాణ-హైదరాబాద్‌
గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కష్ణ మోహన్‌ రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయన ఎన్నికను రద్దు చేస్తూ గురువారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ధర్మవరపు కొట్టం అరుణను ఎమ్మెల్యేగా గుర్తించింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి ఆమెను ఎమ్మెల్యేగా గుర్తించింది. 2018లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్లను
దాఖలు చేశారని తేల్చింది. ఈ మేరకు డీకే అరుణ దాఖలు చేసిన ఎలక్షన్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్‌ వినోద్‌కుమార్‌ తీర్పు వెలువరించారు.తప్పుడు అఫిడవిట్‌ సమర్పించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.5 లక్షల జరిమానాను విధించారు. కోర్టు ఖర్చుల నిమిత్తం పిటిషనర్‌ డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించారు.2018 డిసెంబర్‌ 7న తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అప్పటి టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌గామారింది) అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేసినప్పుడు 1,00,415 ఓట్లు వచ్చాయి. సమీప బీజేపీ అభ్యర్థిని డీకే అరుణకు 72,155 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు 28,260 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈ ఎన్నికల సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవి ట్లను సమర్పించారంటూ 2019లో డీకే అరుణ హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పు తర్వాత కృష్ణమోహన్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించేందుకు ఆగస్టు 18న న్యాయవాది మనోహర్‌ వచ్చారని, మధ్యంతర పిటిషన్‌ కూడా దాఖలు చేశారని హైకోర్టు రిజిస్ట్రీ న్యాయమూర్తి దృష్టికి తెచ్చింది. డీకే అరుణ దాఖలు చేసిన ఎలక్షన్‌ పిటిషన్‌లో జూన్‌ 22నే జడ్జిమెంట్‌ను రిజర్వు చేశామని, ఇప్పుడు మధ్యంతర పిటిషన్‌ను అనుమతించే ప్రసక్తిలేదని తేల్చి చెప్పింది.
పలువురు ఎమ్మెల్యేల ఎన్నికలపై పిటిషన్లు
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరికిషోర్‌, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్‌ రవీంద్రకుమార్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే నరేందర్‌, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, వికారా బాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, పటాన్‌ చెరువు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎన్నికలను సవాల్‌ చేసిన ఎలక్షన్‌ పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ఇటీవల వనమా ఎన్నిక చెల్లదన్న తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.