– ప్రీ క్వార్టర్స్‌లో ఓడిన స్టార్ ప్లేయర్
– క్వార్టర్‌ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్
– యు.ఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2024
యు.ఎస్ ఓపెన్‌లో అమెరికా యువ స్టార్ కొకొ గాఫ్ టైటిల్ వేటకు తెరపడింది. వరుసగా మూడు మ్యాచుల్లో మెరుగైన విజయాలు నమోదు చేసిన లోకల్ స్టార్.. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో బోల్తా కొట్టింది. సొంత అభిమానుల నడుమ టైటిల్ ముద్దాడాలనుకున్న గాఫ్‌కు భంగపాటు తప్పలేదు. పురుషుల సింగిల్స్‌లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ముందంజ వేశాడు. చెమట పట్టకుండా ప్రత్యర్థిని చిత్తు చేసిన జ్వెరెవ్ క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపాడు.
నవతెలంగాణ-న్యూయార్క్
జర్మనీ స్టార్ ఆటగాడు, నాల్గో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. మెన్స్ సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు బ్రాండన్ నకషిమాపై అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. 3-6, 6-1, 6-2, 6-2తో అలెగ్జాండర్ జ్వెరెవ్ గెలుపొందాడు. నాలుగు సెట్ల మ్యాచ్‌లో జ్వెరెవ్‌కు తొలుత ఎదురుదెబ్బ తగిలినా.. తర్వాత వరుసగా మూడు సెట్లలో అలవోక విజయం సాధించాడు. 14 ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్ ఆరు బ్రేక్ పాయింట్లతో అదరగొట్టాడు. పాయింట్ల పరంగా 114-80తో బ్రాండన్‌పై తిరుగులేని ఆధిపత్యం చూపించాడు. సొంత సర్వ్‌లో జ్వెరెవ్ 15 గేమ్ పాయింట్లు గెలుపొందగా, బ్రాండన్ 10 గేమ్ పాయింట్లు సాధించాడు. మెన్స్ సింగిల్స్‌లో మరో ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో నొవాక్ జకోవిచ్‌ను ఓడించిన అలెక్సీ పాపిరిన్ పరాజయం పాలయ్యాడు. అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫె 6-4, 7-6(7-3), 2-6, 6-3తో అలెక్సీని ఓడించాడు. జకోవిచ్‌పై నిలకడగా రాణించిన అలెక్సీ.. ప్రీ క్వార్టర్స్‌లో తేలిపోయాడు. నాలుగు సెట్ల మ్యాచ్లో ఒక్క సెట్‌లోనే పైచేయి సాధించాడు. టైబ్రేకర్‌కు దారితీసిన రెండో సెట్‌ను సైతం చేజార్చుకున్నాడు. అలెక్సీ 24 ఏస్‌లు సంధించగా, ఫ్రాన్సెస్ 14 ఏస్‌లు కొట్టాడు. అలెక్సీ, ఫ్రాన్సెస్ చెరో మూడు బ్రేక్ పాయింట్లు సాధించగా.. పాయింట్ల పరంగా 120-117తో ఫ్రాన్సెస్ పైచేయి సాధించాడు. ఫ్రాన్సెస్ 21 గేమ్ పాయింట్లు సాధించగా, ఆసీస్ ఆటగాడు అలెక్సీ 19 గేమ్ పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో దిమిత్రోవ్, ఫ్రాన్సెస్.. జ్వెరెవ్, ఫ్రిట్జ్‌లు తలపడనున్నారు.
గాఫ్‌కు భంగపాటు :
సొంత అభిమానుల నడుమ యు.ఎస్ ఓపెన్ టైటిల్ అందుకోవాలని తపించిన కొకొ గాఫ్ కథ ప్రీ క్వార్టర్‌ఫైనల్లోనే ముగిసింది. సహచర అమెరికా క్రీడాకారిణి ఎమ్మా నవారో 6-3, 4-6, 6-3తో కొకొ గాఫ్‌ను చిత్తు చేసింది. మూడు సెట్లకు దారితీసిన మ్యాచ్‌లో నవారో నాలుగు బ్రేక్ పాయింట్లతో విజయానికి చేరువైంది. గాఫ్ కేవలం రెండు బ్రేక్ పాయింట్లతో వెనుకంజ వేసింది. పాయింట్ల పరంగా 100-88తో గాఫ్‌పై నవారో పైచేయి సాధించింది. రెండో సీడ్, టైటిల్ ఫేవరేట్ సబలెంక సైతం క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఎలిసీ మెర్టెన్స్‌పై 6-2, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించి సబలెంక అలవోకగా ముందంజ వేసింది. సబలెంక 12 గేమ్ పాయింట్లు గెలుపొందగా.. మెర్టెన్స్ కేవలం ఆరు గేమ్ పాయింట్లు మాత్రమే సాధించింది. ఏడో సీడ్ చైనా స్టార్ క్విన్‌వెన్ జెంగ్ 7-6(7-2), 4-6, 6-2తో డొనా వెకిక్‌పై విజయం సాధించాడు. టైబ్రేకర్‌తో తొలి సెట్‌ను నెగ్గినా చైనా అమ్మాయి రెండో సెట్‌లో తలొగ్గినా.. నిర్ణయాత్మక మూడో సెట్లో మెరిసింది. 10 ఏస్‌లు, మూడు బ్రేక్ పాయింట్లతో కదం తొక్కి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.