గజ్వేల్‌ అనుకున్నంత అభివృద్ధి కాలేదు

Gajwel did not develop as much as expected– భవిష్యత్తులో రాష్ట్రానికే తలమానికం కావాలి
– ఇక నుంచి నెలకోరోజు నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటా : గజ్వేల్‌ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవ తెలంగాణ- గజ్వేల్‌
‘అందరూ గజ్వేల్‌ నియోజకవర్గంలో బాగా అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నారని, తాను అనుకున్న స్థాయిలో గజ్వేల్‌లో అభివృద్ధి జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని ఎస్‌ఎన్‌ఆర్‌ పుష్ప కన్వెన్షన్‌ హాల్‌లో శుక్రవారం గజ్వేల్‌ యోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన తర్వాత గజ్వేల్‌ అభివృద్ధిపై నెలకోసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజల మధ్యే గడుపుతాన న్నారు. ప్రతిపాదనలు, సమీక్షలు నిరంతరం ఉంటాయన్నారు. జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించబోతుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతున్నామని తెలిపారు. రాష్ట్ర అభివద్ధి ఆగదని, ప్రగతిపథంలో ఇంకా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యుత్‌, తాగు నీటి సమస్యలు పరిష్కరించుకున్నామని తెలిపారు. సాగు నీటి ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కొండపోచమ్మ సాగర్‌, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారం, పది రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపి తగిన ఆదేశాలు జారీ చేస్తానన్నారు. ఈ క్రమంలోనే తాను గెలిచిన తర్వాత మళ్లీ సీఎం హౌదాలో తొలి సమావేశం ఈ హాలులోనే ఏర్పాటు చేసుకుందామన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ముఖ్య నేతలు వంటేరు ప్రతాప్‌ రెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి, గజ్వేల్‌, కొండపాక, కుకునూర్‌పల్లి, జయదేవ్‌పూర్‌, మర్కూక్‌, ములుగు, వర్గల్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇలాంటి పిటిషన్లతో ప్రయోజనం ఏంటీ !
బీఆర్‌ఎస్‌ కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కారును పోలిన గుర్తులను ఇతర స్వతంత్ర, చిన్న పార్టీల అభ్యర్థులకు కేటాయించొద్దని, బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. యువ తులసీ పార్టీకి రోడ్‌ రోలర్‌, అలియన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ పార్టీకి చపాతి రోలర్‌ గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది. అలాగే కారును పోలిన ప్రీ సింబల్స్‌ ను ఇతర పార్టీలకు కేటాయించకుండా ఈసీఐకి ఆదేశాలు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్‌ల ను శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మసనం విచారించింది. బీఆర్‌ఎస్‌ తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గీ, మీనాక్షి అరోరాలు వాదనలు వినిపించారు. కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని ముకుల్‌ రోహిత్గీ వాదనలు వినిపించారు. దీనికి జస్టిస్‌ ఓకా స్పందిస్తూ ‘అందులో ఒక పార్టీ మీ పార్టీని ఓడిస్తుందని ఆందోళన చెందుతున్నారా? అవన్నీ పూర్తిగా పోలికలేని(డిఫరెంట్‌) గుర్తులు. దేశంలోని ఓటర్లు కారు, రోడ్డు రోలర్‌, చపాతీ రోలర్‌లకు తేడా తెలియనంత రాజకీయ నిరక్షరాస్యులు కాదు’ అని వ్యాఖ్యానించారు.
అనంతరం మీనాక్షి అరోరా వాదనలు వినిపిస్తూ… ఈవీఎం మెషిన్లలో రోడ్‌ రోలర్‌, చపాతీ రోలర్‌, పలు ఫ్రీ సింబల్స్‌ కారు గుర్తుగానే కన్పిస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇవీ ఓటర్లను కొంత వరకు గందరగోళానికి గురి చేసి, క్రాస్‌ ఓటింగ్‌ కు దారితీయవచ్చన్నారు. ఈ సందర్భంగా పార్టీ గుర్తులకు సంబంధించి సదిక్‌ అలీ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అయితే… మీనాక్షి అరోరా తో ద్విసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల తర్వాతే ఇలాంటి అంశాలు గుర్తుకు వస్తాయా? అని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి… ఎన్నికలు వాయిదా వేయాలని కోరుకుంటున్నారా? అని అసంతృప్తి వ్యక్తం చేసింది. మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌ పై ఆలస్యంగా వచ్చారని ధర్మాసనం అభిప్రాయపడింది. అధికార పార్టీ అయి ఉండి సుమారు 274 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారని ప్రశ్నించింది. ఆలస్యం కారణంగా ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే రిట్‌ పిటిషన్‌ పై హైకోర్టుకు వెళ్లేందుకు , పిటిషన్‌ ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ముకుల్‌ రోహిత్గీ అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. హైకోర్టుకు వెళ్లవచ్చని, అయితే మెరిట్స్‌ ఆధారంగానే హైకోర్టు విచారణ ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, పిటిషన్‌ ను కొట్టి వేసింది.