గజ్వేల్‌ బరిలో ఈటల డౌటే?

Gajwel Barililo Etala Doute?– ట్విస్టులు..జంపింగ్‌లతో అధిష్టానం బేజారు
– పార్టీ డీలాపడ్డదని బీజేపీ శ్రేణుల ఆగ్రహం
– పాత, కొత్త నేతలకు టార్గెట్‌గా మారిన రాజేందర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గజ్వేల్‌ బరి నుంచి ఈటల తప్పుకున్నారా? హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచే పోటీలో ఉంటానని జాతీయ నాయకత్వానికి తేల్చిచెప్పారా? తనను నమ్మి వచ్చినవాళ్లకు కూడా టికెట్లు ఇప్పించుకోలేకపోతున్నాననే కోపంతో రగిలిపోతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ చదరంగంలో హాట్‌టాఫిక్‌గా మారాయి. ఢిల్లీ, తెలంగాణ కేంద్రాలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇవి నిజమేననిపిస్తున్నాయి. ఆయన పార్టీ మారే అవకాశముందనే చర్చా నడుస్తున్నది. బీజేపీ తెలంగాణ శాఖలో జరుగుతున్న ఊహించని ట్విస్టులు..జంపింగ్‌లు… తదితర పరిణామాలతో జాతీయ నాయకత్వం సైతం బిత్తరపోతున్న పరిస్థితి నెలకొంది. ఈటల రాజేందర్‌ చేరిక తర్వాతనే పార్టీ డీలాపడ్డదని ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న హార్డ్‌కోర్‌ కార్యకర్తలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హుజురాబాద్‌ నియోజకవర్గానికే పరిమితం కావాలని ఈటల భావిస్తున్నట్టు తెలిసింది. ఉప ఎన్నిక సమయంలో ఉన్న సానుభూతి, సానుకూల పవనాలు ఇప్పుడు లేవనీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంతో అక్కడా గెలుపు కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ఈటల రాజేందర్‌ బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు తనను నమ్ముకుని వచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చే విషయంలో పార్టీ మొండిగా వ్యవహరించడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.
ఉమ్మడి కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమకు వేములవాడ సీటు ఇవ్వాలని ఈటల పట్టుబడుతున్నారు. ఇదే స్థానం కోసం మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తన కొడుక్కు ఇవ్వాలని జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ టికెట్‌ అంశం ఎటూ తేలలేదు. దీనిపై ఈటల కినుక వహించారు. ఆయనకు పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తూ తమను పట్టించుకోకపోవడంపై ఆగ్రహంతో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాబుమోహన్‌, తదితర కీలక నేతలతో కాంగ్రెస్‌ నాయకత్వం చర్చలు జరుపుతున్నది. వారిలో కొందరినైనా తమవైపు తిప్పుకోవాలనే ఆలోచనతో బీఆర్‌ఎస్‌ పార్టీ సైతం ఆపరేషన్‌ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది. ఈ పరిణామాలపై బీజేపీ కార్యకర్తలు నైరాశ్యంలోకి కూరుకుపోయారు. ఈటల వచ్చాకే పార్టీ పరిస్థితి ఇలా తయారైందని బలంగా నమ్ముతున్నారు. బండి, ఈటల మధ్య గొడవను కొందరు ముఖ్య నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుని ఇద్దర్నీ దెబ్బతీశారనే చర్చా నడుస్తున్నది. ఈటల చేరిన తర్వాత ఆయనకు చేరికల కమిటీ చైర్మెన్‌, ప్రచార కమిటీ బాధ్యతలను సైతం జాతీయ నాయకత్వం అప్పగించింది. కీలకనేతలెవ్వరూ బీజేపీలో చేరకపోగా..ఉన్నవాళ్లూ పార్టీని వీడుతున్నారనే విమర్శలను ఎక్కుపెడుతున్నారు. కార్యకర్తలే కాదు…ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న బీజేపీ నేతలందరూ ఇదే భావనలో ఉన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం బీసీ జపం చేస్తున్నా..ఆ పార్టీలో పాత, కొత్త నేతలకు టార్గెట్‌గా ఈటల రాజేందర్‌ అవుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన పొలిటికల్‌ గ్రాఫ్‌ క్రమంగా తగ్గుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల నుంచి ఆయన టఫ్‌ ఫైట్‌ ఎదుర్కొంటున్నారు. బీజేపీలో ఉంటే ఆయన గెలవరనే చర్చా నడుస్తున్నది.