బషీరాబాద్ లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరం

నవతెలంగాణ -కమ్మర్ పల్లి 

బషీరాబాద్ గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  పశువులకు గాలి కుంటి వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని  సర్పంచ్ సక్కరం అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశువుల యజమానులకు అవగాహన కల్పించారు. గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం ఉంటుందని, నోటిలో నాలుకకి, చిగుళ్లకి బొబ్బలు ఏర్పడి అవి పగిలి నొప్పి వల్ల మేత వేయవన్నారు. నోటి నుండి చొంగ, నురగ కారుస్తుందని, కాలి గిట్టల మధ్య, గిట్ట పైన బొబ్బలు ఏర్పడి చితికి నొప్పి వల్ల నడువలేక పశువులు ఇబ్బంది పడతాయని తెలిపారు. గాలికుంటు వ్యాధికి చికిత్స లేనందున నివారణ మార్గాల పైన శ్రద్ధ వహించాలన్నారు. ముందు జాగ్రత్తగా వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, వ్యాధి సోకిన పశువును మంద నుండి వేరు చేసి చికిత్స చేయించాలని సూచించారు. వైరస్ వ్యాధి అయినందున మందులు పని చేయవని, వ్యాధి లక్షణాలకు అనుగుణంగా చికిత్స చేయించాలన్నారు. నోరు, కాలి గిట్టల మధ్యలో అయిన పుండ్లని శుభ్రంగా కడగాలని, వాటికి మందులని రాయాలన్నారు.3 నుండి5 రోజుల వరకు చికిత్స అందించాలని తెలిపారు.బొబ్బల వల్ల మేత మేయని పశువులకి త్వరగా జీర్ణం అయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని (గంజి,అంబలి )బెల్లం తో కలిపి తాగించాలి ఇలా చేయడం ద్వారా పశువు బలహీన పడకుండా జాగ్రత్త వహించాలని, వ్యాధి తీవ్రత ఎక్కువ అయితే రక్తంలోకి గ్లూకోజ్ ఇవ్వవలసి ఉంటుందని రైతులకు వివరించారు.కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ  అధ్యక్షులు బాజన్న, కార్యదర్శి  గంగాధర్, సక్కారం  నారాయణ, భూమేశ్వర్, వెటర్నరీ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, జామిల్, గోపాల మిత్ర స్పరన్, లక్ష్మి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.