కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన చిత్రం ‘గేమ్ ఆన్’. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రీ గేమ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత వివేక్ కూచిభొట్ల, నటుడు శివ బాలాజీ హాజరయ్యారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను, బిగ్ టిక్కెట్‌ను లాంచ్ చేశారు.
హీరో గీతానంద్ మాట్లాడుతూ,’ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాలేదు. రియల్ టైంలో సాగే సైకలాజికల్ గేమ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సౌండ్, ట్విస్టులు, విజువల్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని తెలిపారు. ‘ఈ ప్రాజెక్టులో భాగమవడం గర్వంగా ఉంది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను’ అని హీరోయిన్ నేహా సోలంకి అన్నారు. డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ, ‘సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ప్రతి సీను కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించా. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ఈ కంటెంట్ గురించి మాట్లాడతారు. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్క్రీన్ ప్లే, విజువల్స్ మ్యూజిక్ పరంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. మా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమాను ప్రేక్షకులు గెలిపిస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. ‘థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుంది. బొమ్మ బ్లాక్ బస్టర్.. అందరూ రాసి పెట్టుకోండి’ అని నిర్మాత రవి కస్తూరి చెప్పారు.