పిల్లలు అన్నింటా అభివృద్ధిచెందాలంటారు. అన్నింటా అంటే చదువుతోపాటు ఇతర రంగాల్లోనూ అని అర్ధం. ఆటలు, సంగీతం, పుస్తక పఠనం అలవర్చుకోవాలి. అందుకు పరిస్థితులు అనుకూలించేలా తల్లిదండ్రులు కృషిచేయాలి. పిల్లల్ని వాటిలోనూ ప్రోత్సహించాలి.
అసలా మాటకు వస్తే పూర్వం స్కూల్లోనే పెద్ద గ్రౌండ్ వుండేది. బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, కబడ్డీ, కోకో, పరుగుపందెం.. ఇలా అనేక ఆటలు ఆడించేవారు. స్కూల్లో కూడా క్రాఫ్ట్ క్లాస్ ఉండేది. అందులో నవారు అల్లిక, దారం తీయటం ఇతర కుట్లు, అల్లికలు మొదలైనవి నేర్పించేవారు. పాటలు పాడించేవారు.
కొన్ని స్కూళ్లల్లో సంగీతం క్లాసులు కూడా ఉండేవి. ఇపుడవన్నీ పోయాయి. స్కూల్ అంటే గ్రౌండ్ లేని స్కూల్ దర్శనమిస్తుంది చాలా చోట్ల. గ్రామాల్లో తప్ప పట్టణాల్లో అసలు వాటికోసం ఎదురుచూడడం వ్యర్థం. ఆటపాటలు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి.
తల్లిదండ్రులు పిల్లల్ని కేవలం కరిక్యూలం చదువులే కాకుండా వీటిలోనూ రాణించేట్టు ప్రోత్సహించాలి. స్కూల్లో లేదా స్కూలు సమయం తర్వాత పిల్లలకు కనీసం రెండు గంటలపాటు స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాలి. అలాగే ఇంటిపరిసరాలు పరిశీలించేందుకు సహకరించాలి. చెట్ల పెంపకం, పక్షులు, జంతువుల గురించి తెలుసుకునేందుకు తోడ్పడాలి. తెలియనివి స్పష్టంగా వివరిస్తూ తెలియజేయాలి. పరిసరాల జ్ఞానం పిల్లలకు ఎంతో అవసరం. ఒక్కోసారి వాళ్లు స్కూల్లో చదువుకున్నవే ఈ విధంగా వాస్తవంగానూ తెలుసుకునే వీలుంటుంది.
ఇంట్లో టీవీ ముందు గంటల తరబడి కార్టూన్ షోలు చూసే కంటే కనీసం ఒక్కగంట బయట స్నేహితులతో ఆడటానికి ఉత్సాహపరచాలి. అలా ఆడటం వల్ల ఇతరులు పరిచయమవుతారు, స్నేహితులవుతారు. అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు స్పష్టమవుతాయి. ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. ఆటలతో పాటు వారు సహజంగానే తెలిసిన అనేక విషయాల గురించి మాట్లాడుకోవడంతో అనేకం తెలుసుకోగలరు. ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మానసికంగా ఎంతో బలపడతారు. ఆటల్లో పాల్గొనడంతో చురుగ్గా తయారవుతారు. పోటీతత్వం అలవడుతుంది. వ్యూహాత్మకంగా ఆలోచించడం తెలుస్తుంది. గెలవాలన్న పట్టుదల పెరుగుతుంది. ఇదే పంథాను చదువులోనూ వారు అమలు చేయగల్గుతారు. రాని సబ్జెక్టుల పట్ల మరింత శ్రద్ధ వహించగల్గుతారు. వారిని ఆ విధంగా ప్రోత్సహించాలి. మంచి ప్లేయర్లను, సందర్భాలను స్ఫూర్తిదాయకంగా తెలియజేయాలి. అలానే పాటలంటే ఇష్టం వున్నదని గ్రహిస్తే సంగీతం నేర్పించే ప్రయత్నాలు చేయండి. అందులోనూ రాణించడం ఎంతో ఉత్తమం.
పుస్తకపఠనం మరీ మంచిది. దగ్గరలోని లైబ్రరీకి వెళ్లనీయండి. అక్కడ పిల్లల పుస్తకాలు తనకు తెలిసిన, వచ్చిన భాషలో వున్నవి చదవనీయండి. స్కూలు లైబ్రరీని ఉపయోగించుకోవడం అలవాటు చేయండి. తద్వారా ఆలోచనా పరిధి, సృజనాత్మకత విస్తరిస్తాయి. తనకు తెలిసినవి, చదివినవాటి గురించి స్నేహితులకు చెప్పడానికి ప్రయత్నిస్తారు. మంచిస్నేహానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇలా చేయండి…
– పిల్లల ఆసక్తులు గమనించండి.
– టీవీ, వీడియో గేమ్స్ పిల్లల చేతికి చిక్కనీయకండి.
– తోచిన ఆటను స్వేచ్ఛగా ఆడనీయండి. ష ఆంక్షలు పెట్టవద్దు.
– అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు స్వేచ్చగా చెప్పనీయండి.
– పుస్తక పఠనం లేదా సంగీతం నేర్చుకునే వీలు కల్పించండి.
కరిక్యులమ్ చదువుతోపాటు ఆటపాటల్లోనూ పిల్లలు రాణించేలా చేయండి. కొందరు చదువు తర్వాత తమకు ఆసక్తి వున్న రంగాల్లో స్థిరపడటానికి వీలవుతుంది. ఆసక్తి వున్న రంగాల్లో స్థిరపడడానికి ఇలా బాల్యం నుంచే వారిలో ఆసక్తిని ప్రోత్సహిస్తుంటేనే వీలవుతుంది. ఇటీవలి కాలంలో పిల్లల్లో అటువంటి ఆసక్తులను ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు అన్నింటా రాణిస్తున్నారు కూడా. మీరూ ఆలోచించండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్